పదేళ్ల క్రితం ఏదైనా ఒక సాంగ్ మిక్సింగ్ కోసం ముంబై వెళ్తే మమ్మల్ని స్టూడియో లోపలికి కూడా అనుమతించేవాళ్లు కాదు. బయటే కూర్చొబెట్టేవారు. కానీ ఇప్పుడు ముంబైలో ఫ్లైట్ దిగగానే కారు పంపిస్తున్నారు. హోటల్ బుక్ చేస్తున్నారు. వాళ్లతో సమానంగా చూసుకుంటున్నారు. దీనంతటికి కారణం రాజమౌళినే. ఆయన వల్లే తెలుగు టెక్నీషియన్స్‌కి ఇప్పుడు గౌరవం పెరిగింది’ అని అన్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘బహిర్భుమి’. నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అజయ్ పట్నాయక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
నేను పుట్టి పెరిగిందంతా విజయనగరంలోనే. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ నాకు నా కజిన్ అవుతాడు. మా ఫ్యామిలీ వాళ్లంతా మ్యుజిషియన్సే. అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే ఇష్టం పెరిగింది.
ఏ ఆర్ రెహమాన్ సంగీతం అంటే చాలా ఇష్టం. రోజా సినిమా థీమ్‌కి బాగా ఆట్రాక్ట్ అయ్యాను. అప్పుడే నేను కీబోర్డు స్టార్ట్ చేశాను. బయట నేర్చుకున్న సంగీతానికి సినిమాల్లోని సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంది. మళ్లీ హైదరాబాద్‌కి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నాను.
2008లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాను. కానీ నేను సంగీతం అందించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘బహిర్భూమి’ చిత్రంతో నా పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
‘బహిర్భూమి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఓ నిర్మాత నా స్టూడియో దగ్గరకు వచ్చి..ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే మూడింతలు ఎక్కువ ఇచ్చి తన కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు.
అన్నయ్య(ఆర్పీ పట్నాయక్) ఎఫెక్ట్ నాపై చాలా ఉంది. గతంలో నేను సంగీతం అందించిన ఓ పాటకు వన్ మిలియన్ వ్యూస్ వచ్చినా.. అందరూ ఆర్పీ పట్నాయక్ సాంగ్ అనుకున్నారు. దాని వల్ల నాకు ఒక అవకాశం కూడా రాలేదు. కానీ బహిర్భూమి చిత్రం పాటలకు వ్యూస్ తక్కువే ఉన్నా.. చాలా మందికి రీచ్ అయింది. అందుకే వరుస చాన్స్‌లు వస్తున్నాయి.
నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని ఇంట్లో వాళ్లకు చెప్పినప్పుడు. ముందుకు చదువు ఉండాలని చెప్పారు. ఇండస్ట్రీలో క్లిక్ అవ్వకపోయినా ఏదైనా జాబు చేయాలంటే చదువు మస్ట్ అనిపించింది. అందుకే చదవు పూర్తయ్యాక ఇండస్ట్రీలోకి వచ్చాను.ఇప్పటి వరకు 12 సినిమాలకు సంగీతం అందించాను.
నోయల్ నాకు మంచి స్నేహితుడు. సంగీతంలో నోయల్ నాకంటే సీనియర్ .కానీ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. ఈ చిత్రంలో ర్యాంప్ సాంగ్ పాడాడు.
ఈ సినిమాకు మంచి బీజీఎం ఇచ్చాను. క్వాలిటీలో పోల్చుకోలేం కానీ.. ‘మంగళవారం’ స్థాయిలో నేపథ్య సంగీతం ఉంటుంది.
కథతో పాటు నటీనటుల ప్రభావం కూడా సంగీతంపై ఉంటుంది. మంచి కథ, పేరున్న హీరో అయితే దానికి తగ్గట్టుగా నేపథ్య సంగీతం అదించొచ్చు. నోయల్ ఉన్నాడు కాబట్టే.. బహిర్భుమికి మంచి బీజీఎం కుదిరింది. వేరే కొత్త హీరో ఉంటే నేను ఈ సినిమాపై అంత ఫోకస్ చేయకపోవచ్చు.
సినిమా దర్శకుడికి మ్యూజిక్ పరిజ్ఞానం ఉండాలి. అలా ఉన్నప్పడే మంచి సంగీతం తీసుకోగలడు. ట్యూన్ విన్నవెంటనే పాటలో బాగుందో బాలేదో చెప్పేంత నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మంచి సాంగ్స్ వస్తాయి.
నా గత 12 సినిమాలు వేరు. బహిర్భుమి సినిమా వేరు. ఈ సినిమా పాట విని చాలా మంది ఫోన్ చేసి అభినందించారు.
ఏఐ టెక్నాలజీ ఎఫెక్ట్ సంగీతంపై అంతగా ఉండదు. దాని సహయంతో కొత్తరకమైన సంగీతం అందించే చాన్స్ ఉంది కానీ.. సహజమైన సంగీతానికి అది ఎప్పుడూ పోటీ కాదు.
డైరెక్టర్‌కి ఇది తొలి సినిమా. చాలా సాఫ్ట్ తను. సెట్‌లో నవ్వుతూ కనిపిస్తాడు. ఏదైనా చెప్పడానికి కూడా మొహమాటం పడతాడు. కానీ నా నుంచి మంచి సంగీతం అందుకున్నాడు.
నిర్మాత మచ్చ వేణుమాధవ్ ఈ సినిమాకు చాలా సపోర్ట్‌గా నిలిచాడు. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
పూరీ జగన్నాథ్ సినిమాకు సంగీతం అందించాలనేది నా లక్ష్యం. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.