అమరావతి :త్వరలో నూతన ఏపీ టెక్స్ టైల్, అపెరల్ మరియు గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర చేనేత మరియు జౌళి, బీసీ సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి ఎస్.సవిత గారు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యంగా టెక్స్ టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందుకోసం మౌలిక వసతుల కల్పనతో పాటు రాయితీలు కూడా విరివిరిగా అందజేయనుందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో త్వరతగతిన అనుమతులివ్వనున్నామన్నారు. టెక్స్ రంగంలో పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తుల పెరుగుదలకు నూతన ఏపీ టెక్స్ టైల్, అపెరల్ మరియు గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. 2018-23 ఏపీ టెక్స్ టైల్, అపెరల్ మరియు గార్మెంట్స్ పాలసీని గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఆ తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ పాలసీని పక్కనపడేయడంతో, టెక్స్ టైల్ రంగంలోని నూతన పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. దీనివల్ల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపడమేకాకుండా ఉపాధి కల్పనలోనూ ఆ ప్రభావం పడిందన్నారు. ప్రస్తుత చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. దీనిలో భాగంగానే టెక్స్ టైల్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 2018-23 పాలసీని మరింత మెరుగులుదిద్ది నూతన పాలసీని తీసుకురానున్నామన్నారు. ఇందుకోసమే పెట్టుబడుదారులతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ఇచ్చే సలహాలు సూచనలను నూతన పాలసీలో అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టైక్స్ టైల్ రంగంలో ఉన్న పరిశ్రమల సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
*ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం*
దేశంలో సిల్క్ ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో, కాటన్ ఉత్పత్తిలో ఆరో స్థానంలో, జనపనార ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉందని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో 9 టెక్స్ టైల్, అపెరల్ పార్కులున్నాయన్నారు. వాటిలో ఆరు ప్రభుత్వ రంగంలో ఉండగా, మూడు ప్రైవేటు రంగంలో ఉన్నాయన్నారు. 146 మెగా టెక్స్ టైల్ ఇండస్ట్రీలు, 18,500 యూనిట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 15 టెక్నికల్ టెక్స్ టైల్ కంపెనీల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, మూడు ఇండస్ట్రీస్ కారిడార్లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అగ్రో టెక్స్ టైల్, జియో టెక్స్ టైల్, మొబైల్ టెక్స్ టైల్ కు అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో ఈ అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రంలో టెక్స్ టైల్ మరియు అపెరల్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సవిత ఆహ్వానం పలికారు. టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, టెక్స్ టైల్ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడమే తమ ప్రభుత్వ నూతన పాలసీ లక్ష్యమన్న మంత్రి సవిత స్పష్టంచేశారు. అంతకు ముందు పలువురు స్టేక్ హాల్డర్లు తమ అనుభవాలను, ఆలోచనలతో పాటు పలు సూచనలు చేశారు. తమ సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ, స్టేక్ హోల్డర్ల ఆలోచనలు, సూచనలు కొత్త పాలసీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆయా సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, జేడీ శ్రీకాంత్ ప్రభాకర్, రాష్ట్ర, రాష్ట్రేతర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.