కుప్పం:- అంగన్వాడీలు చేసే న్యాయబద్ధమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 20 రోజులుగా అంగన్ వాడీ వర్కర్లు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు చంద్రబాబు నాయుడు కుప్పంలో శనివారం సంఘీభావం తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ…”టీడీపీ హయంలో రెండుసార్లు మీకు వేతనాలు పెంచాం. నేడు మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. సమస్యలపై ఆందోళనలకు దిగితే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ప్రభుత్వం మీ డిమాండ్లు పరిష్కరించకుంటే మేం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తా. అంగన్వాడీల సమస్యలు మ్యానిఫెస్టోలో పెట్టి పరిష్కరిస్తాం. మీరు ఐక్యంగా ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీకు షో కాజ్ నోటీసులు ఇచ్చిన అవి తాత్కాలికం మాత్రమే. మీరు నా నియోజకవర్గంలో పోరాడుతున్నారు… ఉద్యోగాల నుంచి ఇప్పుడు మిమ్మల్ని అధికారులు తీసేస్తే నేను వచ్చాక మళ్ళీ నియమిస్తా. ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు అందరికీ ఉంది. మేము శాశ్వతం కాదు.. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి.. ప్రభుత్వం మీకు అండగా ఉండాలి. మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నేను 14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఉంది.. కానీ ఆందోళనలు చేసేవారిని నేను ఎప్పుడూ ఎవరిని బెదిరించలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు” అని చంద్రబాబు అన్నారు.