తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో కొలువుదీరిన మంత్రి వర్గ కూర్పులోనూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ కనిపించింది. మొత్తం పదకొండు మంది మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువుదీరారు. అయితే ఇందులో మాత్రం మైనారిటీలకు చోటు లభించలేదు. కారణం… మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటం వల్లనే… ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఆయా సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులు వరించనున్నాయని ఇప్పటికే సంకేతాలందాయి. దాంతో ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తోందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతే పరాజయం చెందిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురదాబాద్ నుంచి ఎంపీగా కూడా గెలిచిన అనుభవం అజహరుద్దీన్ కి ఉంది. అలాంటి సీనియర్ నాయకునికి ఎం.ఎల్.సి. ఇచ్చి… మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే… ముస్లిం మైనారిటీల్లో వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుందని ఆ వర్గం నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో ముస్లిం మైనారిటీల్లో మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ, ఇటీవల నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్… కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే షబ్బీర్ ఆలీ గతంలో మంత్రి పదవులను అలంకరించిన అనుభవం ఉంది. ఆయన ఎలాగూ మంత్రి పదవిని అనుభవించారు కాబట్టి…
ఆయనకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించి… పార్లమెంటుకు పంపితే ఆయన అనుభవం పార్టీకి జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది. మరోవైపు హైదరాబాద్ కు చెందిన ఫిరోజ్ ఖాన్ కూడా యువ నాయకుడు. ఆయనకు ఇప్పుడే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి… పెద్దల సభకు పంపాల్సి అవసరమైతే ఇప్పటికిప్పుడు లేదనేది కొంత మంది సినియర్ల వాదన. ఆయనకు ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చి… పార్టీకి సేవలు ఉపయోగించుకుంటే మంచిది. ఇలా కాంగ్రెస్ లో ఉన్న ముగ్గురు ముఖ్యమైన ముస్లిం మైనారిటీ నాయకుల్లో అజహరుద్దీనే… మైనారిటీ కోటాలో మంత్రి పదవిని అలంకరించడానికి అసలు సిసలైన అర్హుడు. ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి అజహరుద్దీన్ సేవలు గ్రేటర్ పరిధిలో ఎంతో కీలకం కూడా. క్రికెట్ ను ఎంతో పవిత్రమైన క్రీడగా భావించే మన దేశంలో… ఆయన ఒక క్రౌడ్ పుల్లర్ గా కూడా పార్టీకి ఎంతో ఉపయోగపడతారు. ఇటీవల ఓ ప్రముఖ డైలీలో కూడా ప్రపంచకప్ వన్డే క్రికెట్ లో ఆయన గెలిచిన మ్యాచ్ ల సంఖ్య కూడా… ధోనీ కంటే అధికంగా ఉందని పేర్కొనడం గమనార్హం. ఈ కోణంలో కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో క్రికెట్ ను అమితంగా ప్రేమించే పెద్దా చిన్నా ఓటర్లను ఆకర్షించడానికి అజహర్ క్రేజ్ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.