డెబ్యూ హీరో అనిరుధ్(తన రెండో చిత్రం ‘అరంగేట్రం’ కూడా ఈరోజే రిలీజ్), యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ చిత్రం ‘యాద్గిరి & సన్స్’. ఈ చిత్రానికి విజయ్ కురాకుల సంగీతం అందించారు. రోహిత్ విలన్ గా నటించారు. సీనియర్ నటడు జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, మోతీలాల్, నాగరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.
కథ: యాద్గిరి(జీవా)కి ఇద్దరు కుమారులు. వీరిద్దరిలో లక్ష్మణ్(మోతీలాల్) పనిపాట లేకుండా ఎప్పుడూ తాగి బలాదూర్ గా తిరుగుతూ ఉంటాడు. యాద్గిరి మరొక కొడుకు వెంకట్(అనిరుధ్) ఓ ప్రైవేటు కంపెనీలో సిన్సియర్ గా ఉద్యోగం చేస్తూ… తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటాడు. అతడు ఓ కమర్షియల్ బ్యాంకులో పనిచేసే స్వాతి(యశస్విని)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ… ఆమె లోకంగా బతికేస్తూ ఉంటాడు. అయితే ఓసారి వెంకట్ బీరువాలో దాచుకున్న డబ్బును… లక్ష్మణ్ దొంగతం చేసి… తాగుతూ ఉంటాడు. అంత పెద్ద మొత్తాన్ని దొంగలించడంతో వెంకట్ కోపంతో ఊగిపోయి… తన సోదరుడు తాగుతున్న కల్లుదుకాణం కెళ్లి… మందలించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి… లక్ష్మణ్ చనిపోతాడు. దాంతో వెంకట్ జైలుపాలు అవుతాడు. మరి జైలు పాలు అయిన వెంకట్… స్వాతి ప్రేమను ఎలా పొందాడు? అసలు తన అన్న చావుకు వెంకట్ తో గొడవనే కారణమా? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని తీసే సినిమాలకు బోలెడంత హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన మెయిన్ ప్లాట్ ను బేస్ చేసుకుని… ప్రేక్షకులను మెప్పించే విధంగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటేనే ఇలాంటి రియల్ ఇన్సిడెంట్ బెస్డ్ స్టోరీస్ కి ఆదరణ ఉంటుంది. ఇలాంటి కథలకు పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా… కథ… కథనాలే ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు ఎంగేజ్ చేస్తాయి. దర్శకుడు బిక్షపతి రాజు పందిరి అదే చేశారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైంని బేస్ చేసుకుని… దానిని అన్నదమ్ముల మధ్య ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా తల్లిదండ్రులు, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న తగువులు లాంటి రోజూ మనం ప్రతి ఇంట్లో చూసే సన్నివేశాలనే తెరమీద చూపించి… ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి… అసలు కథలోకి వెళ్లాడు దర్శకుడు. సెకెండాఫ్ మొత్తం రియల్ స్టోరీ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా? అనే సందేహం వస్తుంది. కానీ చివర్లో న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలను చూపెట్టడంతో… వావ్ అనిపిస్తుంది.
హీరో అనిరుధ్ కి ఇది డెబ్యూ మూవీనే అయినా… బాగా నటించారు. ముఖ్యంగా సెకెండాఫ్ లో వరుస మరణాల వెనుక వున్న సస్పెన్స్ ని ఛేదించే క్రమంలో అతడు చూపించే నటన ఆకట్టుకుంటుంది. అతని ఫ్రెండ్ గా విజయ్ పాత్రలో నటించిన నాగరాజు కూడా బాగా చేశాడు. అలాగే అతని సోదరునిగా లక్ష్మణ్ పాత్రలో నటించిన మోతీలాల్ తాగుబోతు పాత్రలో లీనమై నటించాడు. ఇతని పాత్ర చూస్తే… మనకు నిత్యం పల్లెటూళ్లో మన చుట్టూ కనిపించే మనుషులే గుర్తొస్తారు. హీరోయిన్ గా నటించిన యశస్విని పాత్ర కూడా ఓకే. విలన్ పాత్రలో జోసెఫ్ గా నటించిన రోహిత్ కాసేపే కనిపించినా పర్వాలేదు అనిపించాడు. లాయర్ పాత్రలో రాజీవ్ కనకాల కనపించాడు. టైటిల్ పాత్రలో యాద్గిరిగా… జీవా నటన ఆకట్టుకుంటుంది. అతని భార్యగా నటించిన మధుమణి పాత్ర కూడా అంతే. మిగతా పాత్రలన్నీ కూడా తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు ఈ వాస్తవిక సంఘటన స్టోరీని ఎక్కడా హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా… తాను అనుకున్నది అనుకున్నట్టుగా సింపుల్ గా తెరమీద చూపించేశారు. ఇలాంటి ఘటనలు కూడ జరుగుతుంటాయి… తస్మాత్ జాగ్రత్త అనే మెసేజ్ కూడా ఇచ్చాడు దర్శకుడు. విజయ్ కురాకుల సంగీతం బాగుంది. శ్రీను బొడ్డు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. నిర్మాత చంద్రకళ పందిరి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3