ఇటీవలే దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తికావడం తెలిసిందే. ఎంతో విలువైన స్పెక్ట్రమ్ ను దక్కించుకున్న టెలికాం దిగ్గజాల్లో రిలయన్స్ జియో కూడా ఉంది. కాగా, ఈ ఏడాది దీపావళి నాటికి జియో ద్వారా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్వర్క్ ను తీసుకుస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ వెల్లడించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా వంటి మెట్రో నగరాల సహా ప్రధాన నగరాలన్నింటిలో ఈ ఏడాది 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక, 2023 డిసెంబరు నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి తాలూకా, ప్రతి మండలంలోనూ 5జీ సేవలు అందిస్తామని అంబానీ వివరించారు.
రిలయన్స్ జియో చైర్మ్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ… “5జీలో లేటెస్ట్ వెర్షన్ అయిన స్టాండ్ ఎలోన్ 5జీతో వినియోగదారుల ముందుకువస్తున్నాం. పాన్ ఇండియా స్థాయిలో నికార్సయిన 5జీ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. అందుకోసం జియో రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తోంది” అని వివరించారు.