రైతులను ఆదుకుంటామని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రైతాంగ సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని తెలుగుదేశం పార్టీ రాప్తాడు నియోజకవర్గ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో చేపట్టిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రాప్తాడు మండలంలోని రోడ్డుపై టమోటా బాక్సులతో ధర్నా చేశారు. తాహాసీల్దార్ కార్యాలయం ముందు టమోటా బాక్సులతో నిరసన తెలిపారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని మండల తాహాసిల్దార్ బి.ఈరమ్మకు వినతిపత్రం అందించారు.ఈ సంధర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కూడా కల్పించలేని హీన స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా టమోటా పంటలు కనిపిస్తున్నాయి. టమోటా మార్కెట్ లో మాత్రం 1 కేజీ టమోటా రెండు రూపాయలు ధర ఉందన్నారు. కూరగాయలు పండించే రైతులకు కూలీల ఖర్చులు పెట్టుబడులు కూడా రావడం లేదని లబోదిబోమంటున్నారని తెలియజేశారు.టమోటా రైతులకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కనే టమోటాలు పారబోస్తున్నారు. ప్రతి రోజు ప్రభుత్వ అధికారులు మేధావులు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటి వరకు జిల్లా నాయకులు గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించుకోవడం సిగ్గుచేటన్నారు.రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం చేతకాని దద్దమ్మ పరిపాలనకు నిదర్శనమన్నారు. అలాగే రెండు సంవత్సరాల నుండి రైతులకు సబ్సిడీతో డ్రిప్ స్పింక్లర్లు ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు మరియు ఇన్ పుట్ సబ్సిడీ జిప్సం ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచిందని చెప్పేందుకు ఇంతకన్నా సాక్షాలు ఏమీ కావాలన్నారు. కనీస మద్దతు ధర లేదు ఎరువుల ధరలపై నియంత్రణ లేదు ఈ ప్రభుత్వంలో అసలు రైతు బతికే పరిస్థితులే లేవన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ ను తీసేసే కుట్రలు చేస్తోందన్నారు. వైసీపీ పాలనలో రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలు చేస్తున్నామన్నారు.