హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్‌తో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతనాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చనప్రకాశ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీతప్రకాశ్‌గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజగౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ పార్టీలో చేరగా, వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇటీవలే జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ కూడా రానున్నారు. ఈ సమయంలో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు టీఆర్ఎస్‌లో చేరడంతో బీజేపీ ముఖ్య నేతలు షాక్‌కు గురయ్యారు.