ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తన పిచ్చి చేష్టలతో ప్రతిపక్ష కార్యకర్తలను, పాత్రికేయులను నానా ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ‘కాపు’ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి జి.వి.ఎస్ మారుతిపై తప్పుడు ఫిర్యాదు చేసిన 5 వ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆయన పట్టణ టీడీపీ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. తొలుత ఆయన పార్టీ నాయకులతో కలిసి మారుతీ ఇంటికెళ్లి పరామర్శించారు. అనంతరం రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే “కాపు” అధికార బలంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు వల్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పట్టణంలోని 8 వ వార్డులో మారుతీ ఇంటికి వెళ్లిన కాపు ప్రభుత్వం ముద్రించిన బ్రోచర్ పట్టుకొని తనతో ఫోటో దిగాలని కొరడంతో, ఈ ఏడాది తనకు అమ్మ ఒడి రాలేదని ఫోటో దిగడం తనకు ఇష్టం లేదని సున్నితంగా మారుతీ తిరస్కరించాడన్నారు. పక్కనున్న వైసీపీ నాయకులు అతను టిడిపి తరపున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తి అని చెప్పగా “ఓహో నువ్వేనా టిడిపి సోషల్ మీడియా వేదవ్వి అంటూ అసహనంతో దుర్భాషలాడడంపై కాలవ మండిపడ్డారు. స్వయంగా ఎమ్మెల్యే తానే పోలీసులకు ఫిర్యాదు చేసి జైల్లో పెట్టిస్తానని బెదిరించి అక్రమ కేసు బనాయించడం ఏంటని కాలవ ప్రశ్నించారు. అధికార బలంతో ఎమ్మెల్యే కాపు వ్యవహరిస్తున్న తీరుపై గడప గడప మన ప్రభుత్వంలో ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. సోమవారం ఉదయం బొమ్మణహల్ మండలం, బండురు గ్రామంలో చెన్నమ్మ అనే మహిళ మూడేళ్లలో ఒక్క కొంపయినా కట్టించావా అంటూ ఎమ్మెల్యేని నిలదీసిందన్నారు. దాన్ని చిత్రీకరించిన ఈనాడు విలేకరిపై కాపు సహనం కోల్పోయి దౌర్జన్యంగా సెల్ ఫోన్ లాక్కొని, రికార్డు అయిన దృశ్యాలను స్వయంగా డిలీట్ చేయడాన్ని కాలవ తప్పుపట్టారు. పాత్రికేయుల సెల్ ఫోన్ లాక్కొని, చిత్రీకరిస్తున్న దృశ్యాలను డిలీట్ చేసే అధికారం ‘కాపు’నకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అడుగడుగునా విఫలమైన ఎమ్మెల్యే, అసమర్థత, దద్దమ్మ ఎమ్మెల్యేగా రాయదుర్గం చరిత్రలో కాపు నిలిచిపోతాడని కాలవ ఎద్దేవా చేశారు. హారేసముద్రం గ్రామంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విలేకరులు రావొద్దని వైసీపి నాయకుడు చంద్రశేఖర రెడ్డి హుకుమ్ జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పాత్రికేయులను రావొద్దనే అధికారం వైసీపీ వారికీ ఎవరిచ్చారన్నారు. స్వయంగా అక్కడున్న ఎస్సై దిలీప్ కుమార్ కూడా విలేకర్లను అడ్డుకొని ఆంక్షలు విధించారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను బాధ్యతగా చిత్రికరిస్తున్న పాత్రికేయులపై ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు, ఎస్సై అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన ఎస్సై ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకి మానసిక స్థితి సరిగ్గా లేకనే పాత్రికేయుల మీద, టీడీపీ కార్యకర్తల మీద ప్రతాపం చూపిస్తున్నాడని కాలవ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విప్’కాపు’ను గ్రామాల్లో అడుగుపెట్టకుండా ప్రజలే అడ్డుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాలవ తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కాపు పిచ్చి చేష్టలు మాని, మానసిక రుగ్మతలను బాగు చేయించుకుని ప్రజలతో సక్రమంగా మెలగాలని కాలవ హెచ్చరించారు.