నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. సెప్టెంబర్ 24న “లవ్ స్టోరి” థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. చిరు, అమీర్ ఖాన్ “లవ్ స్టోరి” టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా
*సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ*…మా సినిమా కార్యక్రమానికి అమీర్ ఖాన్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. “లవ్ స్టోరి” పాటలు ఇంత పెద్ద విజయం సాధించాయంటే అందుకు కారణం దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు థాంక్స్. కేవలం సంగీతమే కాదు శేఖర్ గారితో జర్నీ చేసిన ఈ రెండేళ్లలో మంచి మనిషిగా కూడా మారాను. ఇదొక మెమొరబుల్ జర్నీ నాకు. మా సినిమాకు మంచి సాంగ్స్ రాసిన లిరిసిస్ట్స్ అందరికీ థాంక్స్. అన్నారు.
*మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ*… కరోనా లాక్ డౌన్ తర్వాత పిల్లలు స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు ఇలా సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉంది. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి, ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతోంది. ఈ మధ్య నన్ను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, ఇంట్లో కూర్చుని లాప్ టాప్ లో చేస్తూ ఉన్నాను. కానీ బయటకొచ్చి ఆడియెన్స్ చప్పట్లు వింటే వచ్చే సంతోషం వేరు. నారాయణదాస్ నారంగ్ గారు నాకు ఎన్నో ఏళ్లుగా మిత్రులు. ఆయన 80 వ దశకంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోకి లోకి చ్చినప్పటి నుంచి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాకు గురువులా భావిస్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి భీష్మాచార్యులు వంటివారు. ఏషియన్ ఫిల్మ్స్ నిర్మాణ రంగంలోకి రావడం సంతోషకరం. మీలాంటి వాళ్లు ప్రొడక్షన్ లోకి రావాలి. సినిమాలు నిర్మించాలి. సినిమా విలువ మరింత పెంచాలి. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నారాయణదాస్ గారి అబ్బాయి సునీల్ తండ్రిని మించిన తనయుడు. చాలా స్మార్ట్. వాళ్ల కృషి లేకుంటే పంపిణీ రంగంలో, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఇన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్, ఇన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేవి కావు. ఇవాళ భారతదేశంలోనే ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే కారణం సునీల్ నారంగ్ లాంటి వాళ్ల కృషి వల్లే. “లవ్ స్టోరి” టైటిల్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రేమ కథలు చూసి చాలా కాలం అవుతోంది. నా స్నేహితుడు నాగార్జున గారి అబ్బాయి నటించాడు. ఇందాక అమీర్ ఖాన్ నాతో నాగ చైతన్య గురించి చెప్పారు. లాల్ సింగ్ చద్దాలో నటించాడు. చాలా కంఫర్ట్ గా అనిపించింది, మంచి యాక్టర్ అని. ఆ మాట వింటే నాకూ సంతోషమేసింది. నాగ చైతన్య మంచి వ్యక్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ కు చాలా మంది ఎగిరిపడుతుంటారు. కానీ చైతూ ఎప్పుడూ ఒకేలా సంమయనంతో ఉంటాడు. నాగార్జున లాంటి కూల్ ఫాదర్ కు చైతూ లాంటి కూల్ సన్ ఉన్నాడు. ఇండస్ట్రీతో నాగ చైతన్య జర్నీ కూడా నిర్మాణాత్మకంగా సాగుతోంది. ఆయన సుదీర్ఘ కాలం ప్రయాణం చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పగలను. చైతూ మంచి కథలు ఎంచుకుంటాడు, సెలెక్టివ్ గా, కొత్తగా సినిమాలు చేస్తుంటాడు. “లవ్ స్టోరి” కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చైతూ. నాగ చైతన్య, నా మిత్రుడు అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా చూడాలని వేచి చూస్తున్నాను. నేనే ముంబై వచ్చి సినిమా చూస్తానని అమీర్ తో చెప్పాను. ఆయన లేదు నేనే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మీకోసం ప్రొజక్షన్ వేయిస్తా అన్నారు. సో నైస్ ఆఫ్ హిమ్. టోక్యో ఎయిర్ పోర్ట్ లో అమీర్ ను కలిసినప్పుడు తనకు సినిమా మీదున్న ప్యాషన్ గురించి చెప్పాడు. ఫారెస్ట్ గంప్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలిపాడు. సినిమా మీద అమీర్ ఖాన్ కు ఉన్న ప్రేమ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మేమంతా లాల్ సింగ్ చద్దా చూసేందుకు వేచి ఉన్నాం. ఆయన హైదరాబాద్ వచ్చి, యంగ్ స్టార్స్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థాంక్స్. సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే దాకా ఆమె ఎవరో తెలియదు. ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. వరుణ్ వచ్చి ఎలా చేశాను డాడీ అని అడిగితే, సారీరా నేను నిన్ను చూడలేదు, సాయి పల్లవిని చూశాను అని చెప్పాను. నా సినిమా ఆచార్యలో సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆమె నో చెప్పింది, నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్ లో నటించాలని లేదు. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది. నాతో అప్పట్లో రాధ, శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెజింగ్ గా ఉండేది. చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్ విజువల్ ఫీస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా. కొన్నేళ్ల కిందట శేఖర్ కమ్ముల కలిశాడు. మీ సినిమాలు చూస్తూ పెరిగాను, మీరంటే ఇష్టం అని చెప్పాడు. అతను వస్తే ముందు నవ్వు కనిపిస్తుంది. అంత పాజిటివ్ పర్సన్. శేఖర్ కమ్ముల ఎవరి దగ్గరా పనిచేయలేదు. కానీ ఆయనకంటూ ఒక స్టైల్ ఏర్పర్చుకున్నాడు. ఇవాళ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. కమర్షియల్ యాంగిల్ కోసం తాపత్రయపడడు. తను అనుకున్న కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కిస్తాడు. శేఖర్ కమ్ముల సినిమాను నేనెంతో అభిమానిస్తాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. పవన్ మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దరియా సాంగ్ కోసమైనా “లవ్ స్టోరి” సినిమా రెండు మూడు సార్లు చూస్తాను. మొన్న కరోనా టైమ్ లో ఇండస్ట్రీలో కార్మికులు పనిలేక అల్లాడిపోయారు. వాళ్లకు మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు అందించి, ఆదుకున్నాం. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా తారలు అని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని వినమ్రంగా కోరుతున్నా. అన్నారు.
*అమీర్ ఖాన్ మాట్లాడుతూ*…నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈ నెల 24న చూస్తాను. అదీ థియేటర్ లలోనే. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా ఓపెన్ అవలేదు. కానీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసుకుని చూడాలని అనుకుంటున్నాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది. సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. లవ్ స్టోరి సినిమా సంగీత దర్శకుడు, ఎడిటర్, డీవోపీ అండ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూకు ఆల్ ద బెస్ట్. అన్నారు.
*మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ*…నాగ చైతన్య, సాయి పల్లవి జంట లవ్ స్టోరి చిత్రంలో బాగుంది. వాళ్లద్దరూ బాగా నటించాలని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. పాండమిక్ టైమ్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. థియేటర్ లోనే తమ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చిన నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ గారికి అభినందనలు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టార్లలో పుంజుకోవాలి. లవ్ స్టోరి చిత్రంతో థియేటర్ లలో సినిమా చూసే ఉత్సాహం రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
*దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ*….మా లవ్ స్టోరి ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మా సినిమా గురించి చెప్పిన మాటలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయనకు మా టీమ్ తరుపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇక అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ ఇలా గన్ పట్టుకుని డిఫరెంట్ సినిమా ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోయాను. నేను డాలర్ డ్రీమ్స్ సినిమా చేసి, దానికి నేషనల్ అవార్డ్ పొందాను. ఆ తర్వాత దిల్ చాహతా హై రిలీజైంది. అక్కడా యువత డ్రీమ్స్ కనిపిస్తాయి. ఎక్కడో మా సినిమాలకు తెలియని కనెక్షన్ ఉంది అనిపించింది. సర్ఫరోష్ సినిమా దర్శకుడు నాకు తెలిసిన మిత్రుడే. ఆయన మీకు కథ చెప్పి ఒప్పించి సినిమా చేశాడు. నేనూ ఒకరోజు మీకు కథ చెబుతాననే నమ్మకం కలిగింది. త్రీ ఇడియట్స్ చూశాక, నేను రూపొందించిన హ్యాపీడేస్ కు రిలేటివ్ గా అనిపించింది. అప్పుడు మీ సినిమాలకు నా సినిమాలకు ఎక్కడో తెలియని కనెక్షన్ ఏర్పడుతోంది అని భావించాను. అమీర్ ఖాన్ హోస్ట్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమం చూశాక..మీలా మరే స్టార్ సొసైటీ కోసం ఆలోచించలేరు అనిపించింది. భగవంతుడే మిమ్మల్ని ఇలా పని చేయిస్తున్నాడు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను. సినిమాలకు ఏదో ఒక పర్పస్ ఉండాలని కోరుకుంటాను. సొసైటీకి ఏదో ఒక మంచి చెప్పాలనుకుంటాను. లీడర్ సినిమాలో నేనో డైలాగ్ రాశాను. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని. ఆ డైలాగ్ నుంచి ఇన్ స్పైర్ అయి లవ్ స్టోరి చిత్రాన్ని తెరకెక్కించాను. లవ్ స్టోరి షూటింగ్ టైమ్ లో ఫస్ట్ వేవ్, రిలీజ్ టైమ్ లో సెకండ్ వేవ్ వచ్చాయి. ఈ కష్టంలోనూ మా సినిమా టీమ్ అంతా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. వాళ్లందరికీ నా థాంక్స్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నారాయణదాస్ నారంగ్ గారికి కృతజ్ఞతలు. లవ్ స్టోరి చిత్రాన్ని థియేటర్ లో చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
*నిర్మాత నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ*…మా లవ్ స్టోరి ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, అమీర్ ఖాన్ గారికి థాంక్స్. లవ్ స్టోరి సినిమా కంటెంట్ మీద మాకున్న నమ్మకంతో థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే థియేటర్స్ లో సినిమాలు విడుదల చేయాలి. దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆయనతో నెక్ట్ ఫిల్మ్స్ చేయబోతున్నాం. లవ్ స్టోరి మీ అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
*హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ*…చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను. అమీర్ ఖాన్ గారు ఎప్పుడూ మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటారు. నేను విభిన్నమైన క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నమ్మడమే పెద్ద బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను. ఆయన డైరెక్షన్ లో నాకిది రెండో సినిమా. ఒక్కసారి శేఖర్ కమ్ముల గారి సినిమా సెట్ కు వెళ్తే ఎంత వినయంగా పనిచేయాలో, ఎంత ఒద్దికగా ఉండాలో తెలుస్తుంది. అదే ఎనర్జీతో నేను మిగతా చిత్రాల సెట్స్ కు వెళ్తుంటాను. ఈ టీమ్ తో మరో సినిమా వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. శేఖర్ గారి చిత్రాల్లో సమాజానికి చెప్పేందుకు ఏదో ఒక విషయం ఉంటుంది. అలాగే ఇందులో అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాళ్లంతా లవ్ స్టోరి చూశాక, ఒక ఆలోచనతో ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని మీరు వేసుకునే ఒక ప్రశ్నతో ఇంటికి వెళ్తారు. అన్నారు.
*నాగ చైతన్య మాట్లాడుతూ*….మెగాస్టార్ చిరంజీవి గారికి నా కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్స్. ఆయన సినిమాల్లో మెగాస్టార్, బయట మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా పాండమిక్ టైమ్ లో ఎంతోమంది కార్మికులకు సాయం చేశారు. మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ ఇన్ స్పైరింగ్ గా ఉంది. లవ్ స్టోరి ట్రైలర్ చూసి అమీర్ ఖాన్ గారు మెసేజ్ చేశారు. సండే ఏంటి ప్రోగ్రాం అని ఆయన అడగగానే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెప్పాను. నేను వస్తాను అన్నారు. ఆయన ఆ మాట అనగానే నమ్మలేకపోయాను. 45 రోజులు లాల్ సింగ్ చద్దా సినిమా కోసం అమీర్ ఖాన్ గారితో పనిచేశాను. ఆ టైమ్ లో నేను మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా అభిమానులను మిస్ అవుతున్నానని తెలుసు. కానీ పాండమిక్ పరిస్థితుల వల్ల కొంతమంది అభిమానులనే కలవగలుగుతున్నాను. లవ్ స్టోరి విషయానికి వస్తే, నేను ఇప్పటిదాకా ఏ సినిమాకూ ఇంత ఇన్ స్పైర్ కాలేదు, ఏ క్యారెక్టర్ ఇంత డెప్త్ లోకి వెళ్లి చేయలేదు. శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఇంత ఇన్ వాల్వ్ అయి లవ్ స్టోరి చిత్రంలో నటించగలిగాను. శేఖర్ గారి దర్శకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఆయన కథ లో, క్యారెక్టర్ లో వెళ్లే డెప్త్ చూసి, ఈ మనిషి కోసం ఎంత దూరం అయినా వెళ్లొచ్చు అనిపించింది. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన హీరోలకు ఎప్పుడూ చెబుతుంటాను దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో అవకాశం వస్తే సినిమా వదులుకోకండి. ఆయనతో సినిమా చేశాక మంచి నటుడు అవుతారు, మంచి పర్సన్ అవుతారు, నేనూ అలాగే మారాను. మీరు ఏదీ నేర్పించలేదు. మేమే నేర్చుకున్నాం. ఒకట్రెండు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరిలో చెప్పబోతున్నారు. అవి 24న థియేటర్ లో చూస్తారు. ఇలాంటి సినిమాలో నటించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక సెన్సిటివ్ ఇష్యూను గురించి సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. మా దర్శకుడికి ఆ ధైర్యం ఉంది. ఏడాది ఏడాదిన్నరగా సినిమాను హోల్డ్ చేసిన నిర్మాతలకు థాంక్స్. మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి. సాయి పల్లవి ఆన్ స్క్రీన్ నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. 24న మా సినిమా విడుదల అవుతోంది. ఇదో మ్యాజిక్ డేట్ లా అనిపిస్తోంది. తాతగారి ప్రేమనగర్ 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. మిమ్మల్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. అన్నారు.