టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. తాను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధం.. రాహుల్ గాంధీ సిద్ధమా.. అని కేటీఆర్ సవాల్ విసిరారు. డ్రగ్స్‌కు అంబాసిడర్ అని అంటారా.. తనకు డ్రగ్స్‌కు సంబంధం ఏంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవడో పిచ్చోడు.. ఈడీ ( ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ) కి లెటర్ ఇచ్చాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ పార్టీలకు సిల్లి పాలిటిక్స్ మాత్రమే తెలుసు..
ఢిల్లీ పార్టీలకు సిల్లి పాలిటిక్స్ మాత్రమే తెలుసు అని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది మాత్రం తెలియదన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు పని లేక ఒకరు పాదయాత్ర చేస్తున్నారు. ఇంకొకరేమో తాను ఉన్నానని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జనసంఘ్ ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చరిత్రకు మతం రంగు పూస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కొత్త పార్టీలు.. జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి..
తెలంగాణలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు.. జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చడం కోసమే కొత్త పార్టీలు వస్తున్నాయన్నారు. ఏదో ఒక జాతీయ పార్టీతో కొమ్ము కాస్తున్నాయన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కేసీఆర్‌ను పొగిడారు.. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు రాకపోతే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడు అని కేటీఆర్ అడిగారు. షర్మిల కూడా అలానే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.