కొత్త రకమైన కథలు చెప్పడంలో…. సరికొత్త పాత్రలు సృష్టించడంలో… మాస్టర్… మన లెక్కల సారు సుకుమార్. తన స్క్రీన్ ప్లేతో, మేకింగ్ తో దేశాన్నే మెప్పించిన దర్శకులు సుకుమార్. పుష్ప1,2లతో బాక్స్ ఫీసు లెక్కలు సరిచేసిన ఆయన రామ్ చరణ్ తో తన తర్వాత సినిమా అని ప్రకటించారు. ఇది జరిగి చాలా కాలమైనా దాని అప్ డేట్స్ రావడం లేదు. డిసెంబరు 5న పుష్ప 2 రిలీజైన తర్వాత… కొంత రిలాక్స్ అయినా సుకుమార్…. ఇప్పుడు తన కొత్త సినిమా కథపై కసరత్తు మొదలు పెట్టారు. 6 నెలలుగా ఇక్కడ రకరకాల చర్చల తర్వాత ఆయన మూడు కథా నేపథ్యాలు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి చారిత్రకం, రెండోది సైన్స్ ఫిక్షన్, మూడోది రా రస్టిక్ రూరల్ లవ్ స్టోరీ…. ఈ మూడు రామ్ చరణ్ కు నచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీటిల్లో ఒకటి డిసైడ్ చేసి… దాన్ని పూర్తి చేయడానికి సుకుమార్ అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి పూర్తి స్థాయి కథతో వచ్చి… ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు. ఈ మూడు కథల్లో ఏదైనా రామ్ చరణ్ ను మరో మెట్టు ఎక్కిస్తాయని అభిమానుల నమ్మకం.
రెండు ఫైనల్…
శిష్యులను ప్రోత్సహించడంలో…. వారితో సినిమాలు చేయడంలో తెలుగు సినీ పరిశ్రమలో ఆదర్శంగా నిలిచే దర్శకులు సుకుమార్. ఈ ఆరు నెలల్లో తన శిష్యులు రాసుకున్న కథలు విన్న ఆయన… రెండు కథలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీరా, హేమంత్ అని ఇద్దరు శిష్యులు… దర్శకులుగా వెండితెరకు పరిచయం కానున్నారని సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న సమాచారం. ఆయన సెలెక్ట్ చేసిన కథలు ఎంత పెద్ద హిట్స్ అవుతాయో… ఉప్పెన, విరూపాక్ష చాటాయి. అదే పంథాలో కొత్త కథలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటిల్లో ఒక దానిలో ప్రముఖ యువ హీరో నటిస్తున్నారని, మరో దానిలో అంతా కొత్త వారు చేయనున్నారని టాలీవుడ్ టాక్. ఈ ఏడాదే ఈ రెండు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.