క్రైం కామెడీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చే నిర్మాతలు గానీ, దర్శకులు గానీ… ఇలాంటి జోనర్స్ ని ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుంటారు. అలాంటి కామెడీ క్రైం థ్రిల్లర్ మూవీనే ‘పరారీ’. ‘రన్ ఫర్ ఫన్’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో హీరోగా యోగీశ్వర్ పరిచయం అవుతున్నాడు. ఓ వైపు సివిల్స్ కి ప్రిపేర్ అవుతూనే… తనకు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అతని సరసన అతిథి అనే అమ్మాయి నటిస్తోంది. హీరో తండ్రి జి.వి.వి.గిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శివాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షుకలను ఏమాత్రం నవ్వించిందో చూద్దాం పదండి.
కథ: కాలేజీలో సరదాగా గడిపే యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే.. అనుకోకుండా హీరోయిన్ కనిపించకుండా పోతుంది. ఆమెను వెతుక్కుంటూ… హీరో తన తోటి స్నేహితులతో(భూపాల్, రఘు కారుమంచి) కలిసి వెళతాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగీ తండ్రి… పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) చేత కిడ్నాప్ కి గురవుతాడు. మరి యోగి… మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్ కి గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? తన కాలేజ్ మీట్ అయిన అతిథితో లవ్ ని ఎలా సక్సెస్ చేసుకున్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లషణ: క్రైం కామెడీ మూవీస్ ఎప్పుడూ ప్రేక్షకులన్ని ఆకట్టుకుంటాయి. మంచి ప్లాట్ రాసుకుని… దాని చుట్టూ… ఎంగేజింగ్ గా ఉండే కథనాన్ని రాసుకుంటే చాలు… ప్రేక్షకులను థియేటర్లో కోర్చోబెట్టవచ్చు. ‘పరారీ’ చిత్రంలో కూడా దర్శకుడు సాయి శివాజీ ఈ చిత్రానికి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి… ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్ ని ఇంటర్వల్ నుంచి పరుగులు పెట్టిస్తుంటారు. దానిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్… ఆ తరువాత అత్తాపురం ఎపిసోడ్ తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసిన దర్శకుడు… ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ ఇచ్చి… సెకెండాఫ్ పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించారు. మధ్యలో హీరో, హీరోయిన్, ఐటెం గాల్స్ తో చేయించిన డ్యాన్సులు మంచి ఊపు తెస్తాయి. క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ బాగా నవ్విస్తుంది.
హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడైనా… బాగా నటించారు. ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. మాస్ ని మెప్పించే మ్యూజిక్ ఉండటంతో… హీరో కూడా అందుకు తగ్గట్టుగానే డ్యాన్స్ ఇరగదీసేశాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. హీరోయిన్ అతిథి పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది. హీరోతో పాటు చేసిన భూపాల్ పాత్ర కూడా ఒకే. అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర కూడా గ్లామర్ తో కూడి… యూత్ ని ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ రఘు కారుమంచి… బాగా నవ్వించారు. తన కామెడీ టైమింగ్ తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఆలీ ఇందులో ఉన్నా… సైలెంట్ గానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. పోలీస్ అధికారి పాత్రలో సుమన్ కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్రనే చేసి మెప్పించారు. హీరో తండ్రిగా షయాజీ షిండే బాగా నవ్వించారు. అలాగే హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా తెలంగాణ యాసలో గయ్యాళిగా ఆకట్టుకుంటుంది. ఇక చెప్పుకోవాల్సింది… బాలీవుడ్ నటుడు థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే… అమ్మాయిలను కిడ్నాప్ చేసి… వ్యాభిచారం రొంపిలోకి దింపే కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా… తన పాత్ర పరిధి మేరకు నటించారు. స్వామీజీ పాత్రలో కమెడీయిన్ జీవా కాసేపు నవ్వించారు.
దర్శకుడు సాయి శివాజీ ఫన్ ఎపిసోడ్ ని బాగా ఎంగేజింగ్ తీశాడు. సినిమా ఆద్యంతం నవ్వించారు. గరుడ వేగా అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ గా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. ఒకస్టార్ హీరో సాంగ్స్ ఎలా ఉంటాయో ఖర్చుకు వెనుకాడకుండా అలా తీశారు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాని తీశారు నిర్మాత జి.వి.వి.గిరి. చాలా క్వాలిటీగా తెరకెక్కించారు. ఈ వారం సరదాగా చూసేయండి.
రేటింగ్: 3