మొన్న రాసిన వుత్తరంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించక పోవడంపై మాజీ ఎం. పి. హరిరామ జోగయ్య మరొసారి నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ తీరుపై నేరుగా కాపు సామాజిక వర్గానికి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం కింది విధంగ వుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో సంభవిస్తున్న సామాజిక పరిణామాలు చూస్తుంటే బాధకలుగుతున్నది. ఈ పరిణామాలు మన కాపు సామాజికవర్గ ఉనికికి ముప్పు తెచ్చేలా మున్ముందు మనల్ను మరింత ఆత్మ రక్షణలో పడేసేలా ఉన్నాయి తప్ప మన కాపులకు ఏమాత్రం మేలు చేసేవిలా లేవు.
ఇన్నేళ్ళుగా అన్ని పార్టీలు కాపులను వాడుకుని చివరకు కరివేపాకులా బయటపడేశారు. ఇన్నాళ్లు లెక్కవేరు ఇక నుంచి వేరు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోవడానికి కాపులు సిద్ధంగాలేరు. వంగవీటి రంగా తర్వాత పెద్ద స్థాయిలో కాపులకు అండగా నిలబడతాడని అనుకున్న పవన్ కళ్యాణ్… చంద్రబాబు పంచన చేరడం మన సామాజికవర్గానికి అవమానకరంగా ఉంది. కాపుల ఆత్మగౌరవన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాడు.
మన సామాజికవర్గానికి పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చాము, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి. పొత్తుతో ఉన్న పార్టీని సంప్రదించకుండా ఐదు సంవత్సరాలు సీఎం అభ్యర్థి చంద్రబాబే అని లోకేష్ ఎలా ప్రకటిస్తారు. బాబు అనుమతి లేకుండానే లోకేష్ ఈ ప్రకటన చేశారా ? కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి బాబు చేస్తున్న కుట్ర ఇది.
ఈ విషయమై నేను బహిరంగలేఖ రాసినా ఇప్పటివరకు పవన్ గాని, నాదెండ్ల గాని స్పందించలేదు. కాపులు ఆలోచించుకోవాల్సిన సమయమిది. పవన్ వైఖరి చూస్తుంటే జనసేనను టీడీపీలో విలీనం చేసేలా కనిపిస్తుంది.
ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. మనం గళం విప్పాలి.. మన గొంతు వినిపించాలి.. మనం పిడికిలి బిగించాలి. మన ఉనికిని కాపాడుకోవాలి. అధికారంలో మనవాటా మనం తీసుకోవాలి… అంటూ ఘాటుగా రాశారు.