లక్ష్మీ నారాయణ ప్రెజెంట్స్, సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దేవరాజ్, సోనాక్షి వర్మ జంటగా నటించిన చిత్రం “బుల్లెట్ సత్యం”. ఈ చిత్రానికి మధు గోపు దర్శకత్వం వహించారు. హీరో దేవరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని రామసక్కని సీలక పాటతో పాటు ఇందులో ఉన్న మూడు పాటలకు యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో పాటు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజే విడుదల అయింది. మరి “బుల్లెట్ సత్యం” ఆడియన్స్ ని ఎలా అలరించాడో చుద్దాం పదండి.
కథ: బాన్సువాడలో సత్యం(దేవరాజ్)… రావ్(సీనియర్ నటుడు వినోద్ కుమార్) ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు. MPTC ఎన్నికల్లో ఇద్దరూ పోటీపడతారు. ఈ ఎన్నికల సమయంలోనే సత్యం.. రావ్ ని కాపాడి… అతని మన్ననలు పొంది… రావ్ కూతురు లత(సోనాక్షి వర్మ)ని వివాహం చేసుకుంటాడు. ఇలా రాజకీయ ప్రత్యర్ధులు కాస్తా.. మామా అల్లుళ్ళు అవుతారు. ఈ ముగ్గురూ కారులో వెళుతుండగా కొంతమంది దుండగులు కారును అడ్డగించి… లతను హత్యచేసి వెళ్ళిపోతారు. మరి లతను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? మరి తన కూతుర్ని చంపిన వారిపై రావ్ ఎలా కక్ష తీర్చుకున్నాడు అనేదే మిగతా కథ.
కథ.. కథనం విశ్లేషణ: అక్రమ సంబంధం పెట్టుకునోళ్లు… అర్థాంతరంగానే తనువు చాలిస్తారనే.. ఓ మెసేజ్ ఇవ్వడానికి “బుల్లెట్ సత్యం” ఓ చక్కటి ఉదాహరణ. ఇందులో హీరో రాజకీయంగా ఎదగాలనే ఔత్సాహిక యువకునిగా… అలానే స్త్రీ లోలునిగా రెండు షేడ్స్ లో వుండే పాత్రను… అలాగే హీరోయిన్ కాలేజీ లైఫ్ లో ప్రేమించిన వ్యక్తితో హద్దులు దాటి తిరగడం… ఆ తరువాత తండ్రి చెప్పిన పెళ్లికి ఒకే చెప్పి… పెళ్లయిన తరువాత కూడా పాత ప్రియుడితో అక్రమ సంబంధం నెరపడం… ఆ తరువాత ప్రాణాల మీదకు తెచ్చుకోవడం… ఇలాంటి సున్నితమైన సన్నివేశాలను దర్శకుడు మంచి స్క్రీన్ ప్లేతో నడిపించారు. ఓ వైపు హీరో తన గ్రామంలో ఉండే యువతులతో చిలక్కొట్టుడు వేషాలు వేస్తూనే… మరో వైపు రాజకీయాల్లో చురుగ్గా ఉండటం… తన పలుకుబడితో యువతులను ఆకర్షించడం… ఇలాంటి సీన్స్ అన్ని వర్తమాన కాలంలో మనం చూస్తుంటాం. దాన్ని బేస్ చేసుకొనే దర్శకుడు ఈ కాన్సెప్ట్ ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఓవరాల్ గా బుల్లెట్ సత్యం మెప్పిస్తాడు.
హీరో దేవరాజ్ కి ఇది డెబ్యూ మూవీనే అయినా అగ్రెస్సివ్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఓ వైపు అమ్మాయిలను ఆకర్షించే యువకునిగా.. గ్రామీణ రాజకీయాల్లో చురుగ్గా వుండే యువకునిగా బాగా నటించారు. అతని సరసన నటించిన సోనాక్షి వర్మ కూడా రెండు వేరియేషన్స్ లో మెప్పించింది. సీనియర్ నటుడు వినోద్ కుమార్ కూడా రాజకీయ నాయకునిగా మెప్పించాడు. తన కూతురిని మట్టుబెట్టిన వాళ్ళకి తగిన శాస్తి చేసే పాత్రకు కరెక్టుగా సరిపోయారు. కమెడియన్ ధన్ రాజు, చలాకి చంటి, అప్పారావు కాసేపు వున్నా నవ్వించారు. సత్తెన్న పోలీసు పాత్రలో కనిపించి తన పాత్రకు న్యాయం చేశారు. మోనా ఠాకూర్ హాట్ గా కనిపించి యూత్ ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. మిగతా పాత్రలు పోషించిన సంజయ్ రెడ్డి, శివ లీల, సత్తెన్న, వాసు, రాకేష్, చేతన్ తదితరులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి న్యాయం చేశారు.
దర్శకుడు మధు గోపు… అక్రమ సంబంధం ఎంతటి ప్రమాదకరమనేది ఇందులో చక్కగా చూపించారు. క్షణికావేశానికి లోనై తమ ప్రాణాలను అర్థాంతరంగా ఎలా పోగొట్టుకుంటున్నారనేదాన్ని హీరో, హీరోయిన్ పాత్రలతో ఓ మెసేజ్ రూపంలో నేటి యువతి యువకులకు ఇచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. పాటలు బాగున్నాయి. బీజీఎం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా పల్లె అందాలు… అక్కడి కల్చర్ ని చూపించారు. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్రానికి హీరో దేవరాజ్ నే నిర్మాత కావున… ఎక్కడ రాజీ పడకుండా.. సినిమా క్వాలిటీగా ఉండేలా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3
– Regati Nagaraju