ఏపీలో సంక్రాంతి తరువాత కేసీఆర్ బహిరంగ సభ జరిగే అవకాశం ఉన్నది. బీఅరెస్ సీనియర్ నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ మేరకు స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు అత్యంత ప్రముఖ నేతలు కేసీఆర్ తో ఇప్పటికే మాట్లాడినట్లు భోగట్టా. వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. మరొకాయన టిడిపిలో మంత్రిగా పనిచేశారు. ఇద్దరూ ఆర్ధికంగా, సామాజికపరంగా మంచి బలవంతులు. అలాగే మరికొందరు టిడిపికి చెందిన నాయకులు కూడా ఉన్నారట.
బీఅరెస్ పార్టీ ప్రకటనతో ముఖ్యముగా చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. టిడిపికి సంబంధించిన నియోజకవర్గాల వైపు, అలాగే వైసిపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై బీఅరెస్ దృష్టి సారిస్తుందని విశ్వసనీయ సమాచారం. యాదవ సామాజిక వర్గం వారి ఓట్లకోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రయోగించే ఛాన్స్ ఉంది. రాయలసీమలో తనకున్న పూర్వపరిచయాలతో కొంతమందితో మాట్లాడాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో బీఅరెస్ పోటీ చేస్తుందని కేసీఆర్ ఈరోజు ప్రకటించారు. కుమారస్వామి కూడా బీఅరెస్ తో తమ పార్టీ పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పాల్గొంటుందని పార్టీ సమావేశంలో ప్రకటించారు.
మోడీని పన్నెత్తి మాటనడానికి మహామహులే గడగడలాడుతున్న ఈ సమయంలో మోడీనే ఢీకొడతానని ప్రకటిస్తూ జాతీయపార్టీని ప్రకటించడం గొప్ప విషయమని దేశం నలుమూలలనుంచి అభినందన సందేశాలు అందుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు కూడా కేసీఆర్ సాహసాన్ని ప్రశంసిస్తూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.