ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు.
చిన్నారి తల్లి .. చిన్నారి తల్లీ అంటూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి ముద్దుల పాప ను గారాబం చేస్తూనే ఉన్నారు. అయితే, ఆ చిన్నారి మాత్రం తల్లిదండ్రులు తనకు పంచుతున్న ప్రేమాభిమానాలు, ముద్దుమురిపాలు తన ఈడు పిల్లలందరూ అనుభవిస్తున్నారా …? లేదా …? అని ఆలోచించింది. బుడిబుడి అడుగుల తప్పటడుగుల ప్రాయంలోనే అమ్మా నాన్న తనకు కొనిచ్చిన బొమ్మలు, బిస్కెట్లు సాటి పిల్లలకు ఇచ్చి సంబరపడింది. వయసు పెరిగే కొద్దీ సమాజం పట్ల ఆమెకు ఉన్న ప్రేమకు భౌగోళిక సరిహద్దులు చెరిగిపోయాయి. విశాఖతీరాన ప్రారంభమైన ఆమె సామాజిక సేవ రాష్ట్రం, దేశం సరిహద్దులు దాటి ఖండాలకు పాకింది. ఆ చిన్నారి మరెవరో కాదు డా. కలశనాయుడు మేడపురెడ్డి.
పట్టుమని పదకొండేళ్లు కూడా నిండని ఆ చిన్నారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది చిన్నారులను అక్కున చేర్చుకుంది. తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోని వారిని తల్లిలా ప్రేమిస్తోంది.తండ్రిలా బాధ్యతలు మోస్తూ వారి అవసరాలు తీరుస్తుంది. అందుకే, ఆ చిట్టితల్లి పదకొండేళ్ల చిరు ప్రాయంలోనే సమాజ సేవలో ఆసియా ఖండానికే ఐకాన్‌గా మారింది. శ్రీలంక ప్రభుత్వం ప్రదానం చేసే ఆసియా ఐకాన్ – 2024 అవార్డు ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.
సమాజసేవతో పాటు ప్రపంచలోని ఏ అంశంపై అయినా అనర్గళంగా ప్రసంగించగల అపర మేధావి. ఏక సంథాగ్రహి. ఆమె మేధా సంపత్తుకు మెచ్చిన ప్రపంచమేధావులు సైతం భళా అని దీవించారు. బ్రిటన్ పార్లమెంటులో ఆ చిన్నారి చేసిన ప్రసంగానికి జేజేలు పలికారు. ఆ వయసు పిల్లలందరూ పాఠాలు ఎలా ప్రిపేరవ్వాలో టీచర్ల దగ్గర నేర్చుకుంటుంటే .. కలశనాయుడు మాత్రం అంతర్జాతీయ వేదికలపై తన ప్రసంగాలతో ప్రపంచాధినేతలను సైతం ఆశ్చర్చ చకితులను చేస్తోంది. అంతేకాదు తాను చేస్తున్న సామాజిక సేవలకు గాను అతి చిన్న వయసులోనే డాక్టరేట్ గౌరవాన్ని కూడా పొందింది. బ్రిటన్ పార్లమెంటులో పార్లమెంటేరియన్ల చేత అపరమేధావిగా ప్రశంసలు అందుకున్న డాక్టర్. కలశనాయుడును అప్పటి బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ హైటీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రధాని దంపతులు తమ అధికారిక నివాసంలోకి కలశనాయుడును ఆహ్వానించి హై టీతో గౌరవించారు. అంతేకాదు ప్రధాని రిషి సునాక్ తన కుమార్తెలు అనౌష్క, కృష్ణలకు కలశనాయుడును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముక్కుపచ్చలారని పదేళ్ల చిన్నారి కలశనాయుడు చూపిస్తున్న ప్రతిభకు, సమాజసేవకు చకితుడైన ప్రధాని ఆమెను తన కుమార్తెలకు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం ఆమెకు దక్కిన అరుదైన గౌరవమని చెప్పాలి.
బాధితులు, వ్యధా పీడితులకు ఒక పక్క ప్రేమాభిమానుల్ని, తన ఈడు పిల్లలకు పుస్తకాలు, బ్యాగులతో పాటు వారి అవసరాలు తీరుస్తూ, మరో పక్క సమాజంలోని ప్రతి ఒక్క కేటగిరీలోనూ నిష్ణాతులను గుర్తించి వారిని కలశ అవార్డులతో సన్మానిస్తోన్న డాక్టర్ కలశనాయుడి సామాజిక సేవకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. శ్రీలంక ప్రభుత్వం డా. కలశ నాయుడును ఆసియా ఐకాన్ అవార్డు -2024 పురస్కారానికి ఎంపిక చేసింది.
శ్రీలంక ప్రభుత్వం ఈ నెల 26-27 తేదీల్లో కొలొంబోలో జరిగిన ఆసియా ఐకాన్ -2024 అవార్డ్స్ కార్యక్రమంలో డాక్టర్. కలశనాయుడుకు అవార్డును ప్రధానం చేసింది. కొలొంబో గవర్నర్ సెంథిల్ తండమాన్ సమక్షంలో డా.కలశనాయుడు ఆసియా ఐకాన్అవార్డ్ 2024 అందుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి తారక బాలసూర్య, యువజనశాఖా మంత్రి రోహన దిశాన్‌నాయకే పాల్గొన్నారు.
ఆటపాటలతో జింకపిల్లలా నవ్వుతూ, తుళ్లుతూ పరిగెత్తాల్సిన వయసులోనే సామాజిక బాధ్యతను తన చిన్ని భుజాలపై మోస్తోన్న డాక్టర్. కలశనాయుడును ఆసియా ఖండంలోనే ప్రతిష్టాత్మకమైన ఆసియా ఐకాన్ -2024 అవార్డు వరించడం ద్వారా ఆమె కీర్తి కిరీటంలో మరో మణిపూస వచ్చి చేరిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.