రామ్ చరణ్ తరువాతి సినిమాకు కథ తయారు చేయడంలో బిజీగా ఉన్న దర్శకుడు సుకుమార్… ఇప్పటికే తన శిష్యులు రాసిన రెండు కథలకు ఓకే చెప్పారు. అందులో ఒకటి కథానాయకుడు కిరణ్ అబ్బవరంతో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. హార్డ్ వర్క్, సిన్సియారిటీలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతూ… యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం ఈ చిత్రంతో ‘క’ లాంటి మరో పెద్ద హిట్ అందుకుంటాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
శిష్యులను దర్శకులుగా పరిచయం చేయడంలో, కొత్త కథలను ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ పలువురికి ఆదర్శంగా నిలిచే దర్శకుడు సుకుమార్. ఆయన ఆశీస్సులతో ఇప్పటికే తెరకు పరిచయం అయిన బుచ్చిబాబు, పల్నాటి సూర్యప్రతాప్, శ్రీకాంత్ ఓదెల తెలుగు సినీ పరిశ్రమలో మంచి విజయాలు అందుకుంటున్నారు. ఆ బాటలోనే ఇప్పుడు వీరా కోగటం, హేమంత్ అని ఇద్దరు నూతన దర్శకుల కథలను సుకుమార్ ఓకే చేశారని అవి త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనున్నాయని తెలుస్తోంది. పుష్ప-1, పుష్ప-2 చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన వీరా కోగటం చెప్పిన కథ సుకుమార్ ను బాగా ఇంప్రెస్ చేసిందని సమాచారం. యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ఈ కథ కిరణ్ అబ్బవరం కు బాగా నచ్చడంతో నటించడానికి ఒప్పుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రీ పొడక్షన్ పనులు మొదలైన ఈ చిత్రాన్ని అశోక్ బండ్రెడ్డి, వంశీ నందిపాటి కలసి నిర్మిస్తున్నారు. త్వరలోనే సుకుమార్ రైటింగ్స్ నుంచి అధికారికంగా ఈ ప్రాజెక్టు వివరాలు ప్రకటించనున్నారని తెలుస్తోంది.