టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గోదావరి ప్రాంతానికి చెందిన వాడన్న సంగతి తెలిసిందే. గోదావరి నేపథ్యంలో కథలను ఆయన ఎంత అథెంటిగ్గా తీయగలరో చెప్పడానికి ‘రంగస్థలం’ సినిమా చక్కటి ఉదాహరణ. ఐతే ఇలాంటి నేపథ్యం ఉన్న దర్శకుడు చిత్తూరు-కడప జిల్లాల నేపథ్యంలో నడిచే ‘పుష్ప’ సినిమాను కూడా అంతే అథెంటిగ్గా తీసి ఆశ్చర్యపరిచారు.
ఈ రెండు జిల్లాల్లో విస్తరించిన శేషాచలం అడవుల్లో దొరికే అరుదైన వృక్ష సంపద అయిన ఎర్రచందనం, దాని స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’; పుష్ప-2’ సినిమాలు తీసి మెప్పించడం మామూలు విషయం కాదు. ఐతే ఈ పనిని సుకుమార్ అద్భుతంగా చేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమాలో చిత్తూరు, కడప జిల్లాల ప్రజల భాష-యాస.. వాళ్ల ఆచార వ్యవహారాలు.. రెండు మూడు దశాబ్దాల కిందటి అక్కడి పరిస్థితులను చూపించిన తీరు.. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలను తెరపై ప్రెజెంట్ చేసిన వైనం స్థానికులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఐతే ఈ విషయంలో సుకుమార్‌కు కావాల్సిన సమాచారం అంతా ఇచ్చి.. స్క్రిప్టుతో పాటు అనేక విషయాల్లో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గురించే ఇప్పుడు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. తన పేరు.. వీరా కోగటం.
‘పుష్ప-2’ టైటిల్ కార్డ్స్ పరిశీలిస్తే.. ‘స్క్రిప్ట్ రీసెర్చ్-కల్చర్’తో పాటు ‘సెకండ్ అసోసియేట్ డైరెక్టర్’గా క్రెడిట్స్ అందుకున్న వీరా కోగటం నేపథ్యం ఆసక్తికరం. కడప జిల్లాకు చెందిన వీరాకు సినిమాలపై యుక్త వయసు నుంచే అమితాసక్తి ఉంది. ఆ ఆసక్తితోనే కొంత కాలం సినీ రంగంలో పని చేసి.. ఆ తర్వాత ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా కెరీర్ ఆరంభించారు. అక్కడ వివిధ హోదాల్లో పని చేస్తూనే కథలు రాస్తూ స్క్రిప్ట్ రైటింగ్ మీద అవగాహన పెంచుకున్నాడు. ‘పుష్ప’ సినిమా మొదలయ్యాక సుకుమార్‌తో పరిచయం జరగడంతో ఆయన టీంలోకి వచ్చారు. చిత్తూరు, కడప జిల్లాలో జర్నలిస్టుగా పని చేసిన అనుభవం సుకుమార్‌కు బాగా పనికి వచ్చింది. పుష్ప కథ, పాత్రల విషయంలో వీరా చేసిన రీసెర్చ్ ఎంతో ఉపయోగపడింది. ఫస్ట్ పార్ట్‌కు తెర వెనుక పని చేసిన వీరా.. పుష్ప-2 మొదలయ్యేసరికి టీంలో కీలక వ్యక్తిగా మారారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సుకమార్‌తో కలిసి ప్రయాణం సాగించారు. కథా విస్తరణలో, సినిమాలో ప్రధాన పాత్రలను తీర్చిదిద్దడంలో, డైలాగ్స్‌లో వీరా పాత్ర ఎంతో కీలకం. లిరిక్స్‌కు కాన్సెస్ట్ రాయడంలో కూడా వీరా తన వంతు పాత్ర పోషించారు. చిత్తూరు, కడప జిల్లాల భాష, యాస, సంస్కృతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న వీరా.. ఈ విషయాలన్నీ తెర మీద చాలా అథెంటిగ్గా ఉండేలా చూడడంలో కీలకంగా వ్యవహరించారు. ‘పుష్ప-2’కు హైలైట్‌గా నిలిచిన జాతర ఎపిసోడ్‌లో కల్చర్ అంత పర్ఫెక్ట్‌గా ఉందంటే అందులో వీరా కృషి ఎంతో ఉంది. ‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలకు సంబంధించి స్క్రిప్టు సహా అన్ని విషయాల్లో వీరా పాత్ర గురించి సుకుమార్ స్వయంగా టీం సభ్యుల దగ్గర పలు సందర్భాల్లో చెప్పారంటే ఈ సినిమాకు తనెంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. తెర మీద పడ్డ క్రెడిట్స్‌ను మించి అతను సినిమా రూపకల్పనలో కీలకంగా వ్యవహరించాడు. దర్శకుడవ్వాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వీరా.. ఆ కలను నెరవేర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నట్లు సమాచారం. ఒక స్టార్ హీరోకు వీరా కథ నచ్చి సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలో దాని గురించి ప్రకటన రావచ్చని తెలుస్తోంది.