ఢిల్లీ : విజయవాడ నగర ఆర్థిక వృద్దిని పునర్నిర్మించడానికి దోహదపడే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు,అవుటర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పచ్చ జెండా ఊపినట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించినట్లు తెలియజేశారు. అదే విధంగా విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పై కూడా సమీక్ష జరిగిందని, ఈ పనులు మరో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఇక విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు పనులకి సంబంధించిన టెండర్లు కూడా త్వరలోనే పిలవటం జరుగుతుందన్నారు.
గత నెల జూన్ 29వ తేదీ మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడ్ని తను కలిసి విజయవాడ లో పెండింగ్ లో వున్న హైవే నిర్మాణం పనుల గురించి తెలియజేయటం జరిగిందన్నారు. ఈ భేటీలో ఆ అంశాలను ప్రస్తావించి ఆ పనులకు అనుమతి లభించే విధంగా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అనుమతులిచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఎంపి కేశినేని శివనాథ్(చిన్ని) కృతజ్ఞతలు తెలిపారు.