తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీల అమలను వేగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… తాజాగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు’లో మొదటి రోజే భారీ పెట్టుబడులను తెలంగాణాకు తీసుకొచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
విద్యుదుత్పత్తి, బ్యాటరీ సెల్ తయారు చేయడానికి ఆదానీ, గోద్రెజ్, జేఎస్ డబ్ల్యూ, గోది, వెబ్ వర్క్స్, ఆరా జెన్ లాంటి సంస్థలతో సుమారు రూ.37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని టీపీసీపీ వర్కింగ్ ప్రెసిండెండ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి మహమ్మద్ అజహారుద్దీన్ అన్నారు.
యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడం కోసం ఆదానీ ముందుకు రావడం తెలంగాణ యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా యువతకు ఉపాధికల్పన కోసం పబ్లిక్, ప్రేవేటు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.
ఇప్పటికే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసి… మరో రెండు నెలల్లో మిగతా నాలుగు గ్యారెంటీలను కూడా అమలు చేసి… వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో అత్యధిక పార్లమెంటు సీట్లను గెలుస్తాం అన్నారు. ప్రజలకోసం నిర్వహించిన ప్రజాపాలనలో సుమారు కోటీ ఇరవై లక్షలకు పైగా వినతులు వచ్చాయి, వాటినన్నింటినీ కంప్యూటీరకరణ చేసి… ప్రతి సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇలా తెలంగాణా అభివృద్ధికోసం నిత్యం పాటుపడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి.. కేంద్రంలో సోనియాగాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అహర్నిషలు పాటుపడుతాం అన్నారు. మహిళలకోసం ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బస్సల్లో ఉచిత ప్రయాణానికి విశేషమైన స్పందన లభిస్తోందన్నారు. దీన్ని మిగతా రాష్ట్రాలు అమలు చేయడానికి ముందుకు వస్తున్నాయంటే… ఇక్కడ చిత్తశుద్ధితో ఈ పథకం ఎంతబాగా అమలవుతోందనేది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. అలాగే రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతులకు పెంట పెట్టుబడి కోసం రైతు భరోస, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అమలు కోసం గృహజ్యోతి, ప్రతి పేదవానికీ సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కృషి చేస్తోందని అజహరుద్దీన్ తెలిపారు.
అలాగే మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ప్రజారంజక పాలనను అందిస్తూ అన్ని వర్గాల నుంచి మన్ననలను పొందుతోందని ఆయన కొనియాడారు.