“భారతీయ ఆధ్యాత్మిక సాధనలో యోగా ఒక భాగం. ధ్యాన యోగం చెయ్యడం వల్ల మానసిక ఆరోగ్యం, హఠ యోగం వల్ల శరీర ఆరోగ్యం తోపాటు ముఖ వర్ఛస్సును కూడా ఇనుమడింప చేసుకోవచ్చు. పూర్వం యోగ చేసేవారిని యోగులు అనేవారు. యోగా ప్రాధాన్యత ఆ కాలం వారికి బాగా తెలుసు. ఆధునిక యాంత్రిక జీవితంలో యోగా క్రమం తప్పకుండా చేయడం వల్ల మన జీవిత కాలం పెరగడంతో పాటు మానసిక,శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ” అంటారు కాకర్ల ఉమామహేశ్వర రావు .
“మాది కృష్ణా జిల్లా పెద ముక్తేవి గ్రామం. తండ్రి శ్రీహరి రావు , తల్లి కోటేశ్వరమ్మ , నేను పుట్టింది ,పెరిగింది అక్కడే . ఉన్నత పాఠశాల విద్య తో చదువుకు స్వస్తి చెప్పి ఆ తరువాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాను. పెద ముక్తేవిని వదలి విశాఖపట్టణంలో స్థిరపడ్డాను . నాకు చిన్నప్పటి నుంచి మైగ్రైన్ అనే తలనొప్పి ఉండేది. తలకు ఒకవైపు ఈ నొప్పి వస్తుంది. ఇది వచ్చినప్పుడు వికారంగా ఉండటం, వాంతులు కావడం, చికాకు కలిగించడంతో చాలా బాధపడేవాడిని . ఒకరకంగా నరక యాతన అనుభవించేవాడిని . బెంగుళూరు కు చెందిన సిద్ది సమాధి యోగా గురువు ఋషి ప్రభాకర్ విశాఖ వచ్చినప్పుడు 15 రోజుల శిక్షణ తరగతులకు నేను హాజరయ్యాను. ఆయన యోగ ఆసనాలు వేయించే ముందు ఆహారం విషయంలో తగిన సూచనలుచేశారు. వాటిని నేను పాటించాను. యోగాచేసిన వారం రోజుల్లో నాకు మైగ్రైన్ ఉందనేది పూర్తిగా మర్చిపోయాను . యోగా చెయ్యడం వల్ల ఆ సమస్య పూర్తిగా పోయింది . అక్కడ నుంచి నా ద్రుష్టి యోగా మీదకు మళ్లింది” అని చెప్పారు ఉమామహేశ్వర రావు .
“జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పూర్తిగా మార్చే ఘటనలు జరుగుతుంటాయి . అప్పుడే మనకు జీవిత లక్ష్యం బోధపడుతుంది. యోగాతో నాకు జ్ఞానోదయం అయ్యింది . ఇక నా జీవితాన్ని యోగా మార్గంలో నడపాలని , దేశమంతా తిరిగి , పోటీలలో పాల్గొని యోగాను ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను.” అన్నారు .
“భారతీయ జీవన విధానంలో యోగా భాగం కావాలనే ఉద్దేశ్యం తో 2014లో ప్రధాని గా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించాక సెప్టెంబరు 27న ప్రధాని నరేంద్రమోడి, ఐక్యరాజ్యసమితి లో జరిగిన సర్వసభ్య సమావేశంలో “అంతర్జాతీయ యోగా దినోత్సవం” ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోవడం మానవాళికి మంచిదనే ప్రతిపాదన చేశారు. ఐక్యరాజ్యసమితిలో 193 మంది ప్రతినిధులలో 175 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు. ఇది చారిత్రాత్మకమైన రోజు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న మనదేశం తో పాటు 192 దేశాలు ఇందులో 44 ముస్లిం దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం మనకు గర్వ కారణం ” అని చెప్పారు ఉమామహేశ్వరరావు.
యోగా ప్రచారంలో ఇప్పటికే మనదేశంలో అనేక రాష్ట్రాలు సందర్శించాను . అక్కడ జరిగే యోగా పోటీల్లో పాల్గొనేవాడిని . అలా ఇప్పటికి 80 ప్రాతాల్లో జరిగిన యోగా పోటీల్లో పాల్గొని 38 బంగారు ,12 వెండి , 7 కాంస్య పతకాలను గెలుసుకున్నాను, అలాగే అనేక సర్టిఫికెట్లు కూడా వచ్చాయి . దీంతో నా బాధ్యత మరింత పెరిగింది . ” అని చెప్పారు.
” మనదేశంలో ఆనందమయి మా, అరబిందో , అమృత దేశాయ్ , జగ్లీ వాసుదేవ్ , కృష్ణమాచార్య , కువలయానంద , మహర్షి మహేష్ యోగి , మెహర్ బాబా , ధర్మ మిత్ర , నిర్మలా శ్రీవాస్తవ , బాబా రాందేవ్ , శివానంద, రవిశంకర్ , సచ్చిదానంద మొదలైన యోగా గురువులు తమ జీవితాన్ని యోగాకు అంకితం చేశారు. ఎందరినో ప్రభావితం చేశారు. నేను కూడా ఆ గురువుల బాటలో నడవాలనుకుంటున్నా ” అని చెప్పారు .
“సినిమా రంగంలోకూడా నటీనటులు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు . అనుష్క శెట్టి మొదట యోగా గురువు , అలాగే భూమిక భర్త భరత్ టాగోర్ కూడా యోగా గురువే. వీరిద్దరి దగ్గర ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు తమ శరీరాకృతి ని కాపాడుకోవడానికి యోగాను చేసేవారు. యోగా ఆవశ్యకతను సినిమావారు కూడా గుర్తించారు ” అని చెప్పారు .
“ఇప్పటి నుంచి నేను యోగా తరగతులు నిర్వహించాలని , మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా పర్యటించి యోగా ఆవశ్యకతను చాటాలని, ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచాలని నిశ్చయించుకున్నా, యోగా వల్ల రోగ నిరోధక శక్తి ని కాపాడుకోవచ్చు, అనవసరమైన మందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించవచ్చు, తద్వారా జీవిత కాలం కూడా పెరుగుతుంది . ఈ విషయం అందరూ గ్రహించి రోజులో కనీసం ఒక గంటసేపైనా యోగా చెయ్యాలి. ఇది అందరికీ చెప్పాలని నేను భావిస్తున్నా, అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుంటున్నా “అని చెప్పారు .