అనంతపురం నగరం సహా జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగ్ వల్ల ప్రజల భద్రతకు భరోసా కల్గుతోంది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు గత నెల 1672 విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల వల్ల రౌడీలు, అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతోంది. ఆయా స్థానిక పోలీసుల నేతృత్వంలో ఏ.ఆర్ , స్పెషల్ పార్టీ సిబ్బంది విజిబుల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకం కావడం… వారి సమస్యలను తెలుసుకుని వాటికి సరైన పరష్కారాలు చూపిస్తున్నారు. వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడే వ్యక్తులను అణిచి వేస్తున్నారు. ప్రధానంగా అమ్మాయిలు, ఉద్యోగినులు బైకుపై వచ్చి షాపింగ్ చేసుకుని/ విధులు ముగించుకుని నిర్భయంగా ఇంటికి చేరుకునేలా పరిస్థితులు కల్పిస్తున్నారు. అంతేకాకుండా… రహదారులపై అడ్డదిడ్డంగా వాహనాలు పార్క్ చేయకుండా మరియు వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అల్లరి మూకలు, ఈవ్ టీజర్స్ , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిఘా ఉంచారు. జనం గుమిగూడకుండా ఉండేలా చెల్లాచెదురు చేస్తున్నారు. అల్లర్లు, గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కల్గకుండా రహదారులపై తోపుడు బండ్లు పెట్టుకోరాదని సూచిస్తున్నారు. ప్రజలకు కనిపించేలా గస్తీ తిరగాలని భావించి ఎస్సై, సీఐలు మొదలుకుని మిగిలిన పోలీసు సిబ్బంది సమిష్టిగా రహదారులపై ఉండి విధులు నిర్వహిస్తున్నారు.