జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తాము ముందే ఊహించామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లుగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్నామన్నారు. దీని ఫలితంగానే గతంలో సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులకు ప్రజలు పట్టం కట్టారన్నారు. గ్రామీణ ఓటర్లే కాకుండా మునిసిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కూడా జగన్ వైపే నిలిచారని తెలిపారు. రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీదే విజయమని అనంత ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. కేవలం ఫ్రస్టేషన్‌లో ఉండడం వల్లే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. ఒక పార్టీ అధినేతగా కార్యకర్తలకు.. ఓ తండ్రిగా లోకేశ్‌కు మంచి బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. లోకేశ్‌కు ఆయన మంచి రాజకీయ జీవితాన్ని ఇవ్వలేకపోయారని అన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్ మారుతుందని అనంత అన్నారు. ఇప్పటికైనా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కళ్లు తెరవాలని, లేకపోతే త్వరలోనే ఆ పార్టీలను ప్రజలు మరచిపోయే పరిస్థితి వస్తుందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.