పింఛన్లు తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని, పింఛనర్ల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని, పెండింగ్ లో ఉన్న వివిధ పింఛన్ల సమస్య గురించి తాను ముఖ్యమంత్రితో ప్రస్తావించినట్లు అక్టోబర్ మాసం చివరినాటికి అవన్నీ మంజూరు చేయబడతాయని ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్నివెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు.
బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
స్థానిక రాజుపేటకు చెందిన గోపు రామారావు అబ్నే వృద్ధుడు మంత్రిని కలిసి తనకు గత 6 నెలలుగా పింఛన్ రావడం పోలేదని వాపోయారు. ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఏర్పడిన కారణంగా, పింఛన్ ను తగ్గించడం లేదా నిలిపియడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ కొందరు పస లేని ఊహాగానాలు చేస్తూ మీడియాలో, వివిధ సామాజిక మాధ్యమాలలో పుకార్లు విష ప్రచారం వ్యాపింపచేస్తున్నారని అవి పెద్ద అసత్యం అని ఖండించారు. ఈకెవైసి కాక ఆగిన పింఛన్లను, రద్దు కాబడిన పింఛన్లను పరిశీలన చేసి.అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ వచ్చేలా చూస్తానని ముఖ్యమంత్రి తమకు చెప్పారని మంత్రి తెలిపారు.
విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన తంగేటి అనిల్ కుమార్ మంత్రిని కలిసి తన సమస్యను చెప్పుకొన్నారు. గత ఏడాది తాను రమణ ట్రావెల్స్ ద్వారా యూనియన్ బ్యాంకులో కారు కొనేందుకు రుణం తీసుకొన్నానని ప్రభుత్వం ఎస్సీలకు సబ్సిడీ డి ఐ సి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారని, ఈ విషయమై ఐ పి ఓ ను సంప్రదించానని ఇంకా ఆన్లైన్ రాలేదని, వచ్చిన తర్వాత రమ్మని ఆమె చెప్పిందని అన్నారు. ఈ ఏడాది మార్చి 5 వ తేదీ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆమెను కలిసినప్పటికీ జీ ఎస్ టి సర్టిఫికెట్ ఇవ్వాలని వివిధ కారణాలను చూపి ఆమె తనకు సానుకూలంగా పని చేయలేదని దాంతో సబ్సిడీ కాల పరిమితి పూర్తైపోయిందని కరోనా కారణంగా ట్రావెల్స్ నిర్వహణలో ఎంతో నష్టపోయామని తమ దరఖాస్తును పరిశీలించి తమకు న్యాయం చేయాలనీ అనిల్ కుమార్ మంత్రి అభ్యర్ధించారు.
స్ధానిక చిలకలపూడికి చెందిన బంగారు వరలక్ష్మి మంత్రికి తన సమస్యను తెలిపింది. ఇళ్ల స్థలానికి దరఖాస్తు చేసుకున్నామని, అయితే గతంలో తాము డబ్బులు చెల్లించి జీ ప్లస్ 3 అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వచ్చిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలని, ఇటీవల తన భర్త చనిపోయారని అధికారులు ఇల్లు నిర్మించుకొమని చెబుతున్నారని పలు ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్నానని తనకు ఆ ఫ్లాట్ కట్టించి ఇస్తే తన కుటుంబానికి ఒక గూడు ఏర్పడుతుందని మంత్రికి మొర పెట్టుకొంది.
దివిసీమ చల్లపల్లి వైశ్య బజార్ కు చెందిన కూరపాటి నాగ వెంకట శివ కాంత్ తన తండ్రితో వచ్చి మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నారు. తన భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదని మీ తల్లితండ్రులను విడిచి తననే అక్కడకు రమ్మని అంటుందని కాపుర కస్టాలు ఏకరువు పెట్టాడు. అంతేకాక తన భార్య లాయర్ ద్వారా తనను బెదిరిస్తూ తరచూ వేధిస్తుందని ఆమెతో తానూ ఇక కాపురం చేయలేనని మీరే నాకు సహాయం చేసి తన భార్య నుంచి కాపాడాలని మంత్రి వద్ద గగ్గోలు పెట్టాడు.ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, కాలమాన పరిస్థితులు మారేయని, ఒకసారి వివాహమైతే జీవితాంతం భార్యతో రాజీ పడి కాపురం చేయాలని మరో మార్గం లేదన్నారు. భార్య భర్తల వివాదాల విషయమై పలువురి వద్ద పంచాయితీలు పెట్టుకోవడం పూర్తిగా దండుగ మారి వ్యవహారం అని , తనను , మీ తండ్రిని , ఉచిత సలహాలు ఇచ్చే పెద్దలను నమ్మవద్దని మీ భార్యనే నమ్ముకొని కాపురం చేస్తే శుభ్రంగా సుఖపడతావని హితవు పలికారు. అందుకు శివకాంత్ బదులిస్తూ తనకు ఇక బతకాలని లేదని తనకు విముక్తి లేదా సార్ ? అని బిక్కమొహం పెట్టారు. ఎంతటి వారైనా సరే భార్యకు లొంగిపోయి కాపురాలు చేసుకునేవారే అని, దంపతుల నడుమ తల్లితండ్రుల జోక్యం , పెద్దమనుష్యుల పెత్తనం సరి కాదన్నారు. నీవు లేనిపోని అహం వీడాలని, ఏ ఆడపిల్ల ఐనా ఇరవై ఏళ్ళు పుట్టింట్లో పెరిగి నిన్ను నమ్ముకొని పెళ్లిచేసుకొని కనీసం నీతో యాభై ఏళ్ళు జీవిస్తుందని అటువంటి భార్యతో రాజీ పడటంలో నీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. వైవిహిక బంధంలో కిటుకులు భోధిస్తున్నానని వింటే బాగు పడతావు లేదంటే జీవితాంతం వంటరి పురుషుడిగా మిగిలిపోతావని మంత్రి ఆ వ్యక్తికి తనదైన శైలిలో హితబోధ చేశారు.