అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువనే చెప్పాలి. మిగతా హీరోలకు అభిమానులు ఉంటారేమో కానీ ఒకరకంగా మెగాస్టార్ కు వీరాభిమానులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది.  మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు. నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవి గారిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి గారు వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు.

కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు, దీంతో చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ రప్పించారు. శనివారం నాడు చిరంజీవి గారు వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి. తన వీరాభిమాని వెంకట్, వెంకట్ భార్య సుజాతతో చిరంజీవి కూలంకషంగా వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. ఒమేగా హాస్పిటల్స్ లో తెలిసిన డాక్టర్లతో  మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెల్సుకున్నారు.

అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చలు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్, ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని చెబుతున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని కూడా మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.