చంద్రబాబు హామీల పునరుద్ఘాటనపై సుబ్బారెడ్డి ఆగ్రహం!

36

నాలుగేళ్ల నుంచి వెలుగొండ ప్రాజెక్టుకు కనీసం ఆరేడు వందల కోట్లకు మించి ఇవ్వలేక పోయారు. కేవలం ఆరు నెలల్లో రూ.700 కోట్లకు పైగా నిధులుచ్చి పనులు ఎలా చేస్తారు ? అసలు మీకు జిల్లా ప్రజలపై చిత్తశుద్ధి ఉందా ! ఉంటే ఇలా చేస్తారా ! అంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల ప్రచారానికి దారితీసినట్లు పేర్కొన్నారు. బుధవారం ఒంగోలులోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యతో ఆరేడు వందల మంది చనిపోయినా ఇంకా చంద్రబాబు ఎన్నికల ప్రయోజనాల కోసం పాకులాడడం తప్ప ప్రజలకు ఒరగబెటట్టింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం దుగరాజపట్నం సాధ్యం కాదన్నప్పుడు ప్రత్యామ్నాయ పోర్టు గురించి అడిగింది. రామాయపట్నం పోర్టు గురించి ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా తీర ప్రాంతాన్ని ప్రైవేటు పోర్టులకు అప్పగించి చోద్యం చూస్తున్న చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నట్లు గుర్తు చేశారు. జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి ఈ ఏడాది 47.7 శాతం లోటు వర్షపాతం నమోదయింది. కేవలం యాభై మండలాల్లో కరవున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు. గతేడాది ఖరీఫ్‌, రబీల్లో పంట నష్టపోయిన రైతులకు ఫసల్‌ బీమా సొమ్మును వెంటనే రైతులకు చెల్లించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. పెండింగులో ఉన్న గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల పథకం, సంగమేశ్వరం ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. ఈ సమస్యలన్నింటిపై ప్రజలను జాగృతం చేసేందుకు ఈనెల 10 తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 2014-15లో పామూరు వద్ద జాతీయ వస్తూత్పత్తి మండలి (నిమ్జ్‌)కు సంబంధించి కేంద్రం పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న సంగతి ఇటీవల కేంద్ర మంత్రి లోక్‌సభలో వెల్లడించిన సంగతి గుర్తు చేశారు. దొనకొండ పారిశ్రామిక వాడకు ఒక్క పరిశ్రమ తేలేకపోయారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయక.. అటు కేంద్రం నుంచి వచ్చిన పథకాలను నీరుగార్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. జిల్లాకు సంబంధించి నాలుగు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలకు అనుమతులు తీసుకొచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. 2017లోనే ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రిని జిల్లాకు మంజూరు చేయిస్తే.. ఇప్పటికీ అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కేంద్ర నిధులతో నిర్మించే రామాయపట్నం పోర్టు గురించి అడుగుతుంటే చీరాల వాడరేవులో ప్రైవేటు పోర్టు గురించి ప్రస్తావించడం బీజేపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు సంకేతమని చెప్పారు. ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఈ రెండు పార్టీలు లబ్దిపొందాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు పోర్టులను నిర్మించినా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు. ప్రత్యేక హోదా విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ.. రెండూ యూటర్న్‌ తీసుకున్నట్లు ఇటీవల పార్లమెంటు సమావేశాలే వెల్లడించాయన్నారు. ప్యాకేజీకి ఒప్పుకొని టీడీపీ ప్లేటు ఫిరాయించినట్లు ప్రధాని చెప్పడాన్ని బట్టి వీళ్ల బండారం జనానికి తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ నేతలు చుండూరి రవిబాబు, క్రాంతి కుమార్‌, కేవీ రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, కర్నాటి ప్రసాద్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here