రివ్యూ: యమన్.. ఓ పొలిటికల్ థ్రిల్లర్!

37

Yaman 04-02-2017తారాగణం: విజయ్ ఆంటోనీ – మియా జార్జ్ – త్యాగరాజన్ – అరుల్ జ్యోతి – సంగిలి మురుగన్ – చార్లీ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: జీవా శంకర్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: జీవా శంకర్
రేటింగ్: 2.75
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో కూడా ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కం యాక్టర్ విజయ్ ఆంటోని. ఆ తరువాత వచ్చిన బేతాళుడు నిరాశ పరిచింది. అయినా… యమన్ మాత్రం మంచి పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈసారి బిచ్చగాడి లాంటి మెరుపులు ఏమైనా మెరిపించాడా? లేదా? అనేది చూద్దామా?
స్టోరీ: అశోక చక్రవర్తి (విజయ్ ఆంటోనీ) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. దాంతో తాత వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. అలాంటి తాత అనారోగ్యం పాలవడంతో సర్జరీ చేయడానికి డబ్బుల కోసం తన ప్రమేయం లేని ఒక యాక్సిడెంట్ కేసును నెత్తిన వేసుకుని రూ.5 లక్షల కోసం జైలుకు వెళ్తాడు అశోక్. అక్కడే అతని లైఫ్ టర్న్ అవుతుంది. జైలు నుంచి బయటికొచ్చాక డబ్బు.. ఉపాధి రెండూ దొరికినప్పటికీ ఇద్దరు రాజకీయ నాయకుల పోరు కారణంగా అశోక్ ఇబ్బంది పడతాడు. వారి నుంచి అశోక్ పడిన ఇబ్బందులేంటి? అతని తండ్రి ఎలా మరణించాడు? మరి తండ్రి చంపిన వారిని ఎలా అంతం చేశాడు? చివరకు అశోక్ రాజయకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: ‘యమన్’ ఒక పొలిటికల్ థ్రిల్లర్. సామాన్యుడైన ఒక వ్యక్తి అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎలా ఎదిగాడు.. ఎలా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన వాళ్లపై ఎలా పగతీర్చుకున్నాడన్న నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రాజకీయ నాయకుల నేపథ్యాల్ని.. వారి మనస్తత్వాల్ని.. వారు వ్యవహారాలు నడిపే తీరును చక్కగా.. వాస్తవికంగా ‘యమన్’లో ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఐతే ఈ ‘పొలిటికల్ థ్రిల్లర్’లో పాలిటిక్స్ నేపథ్యంలో సాగే కథ ఆకట్టుకుంటుంది కానీ ఇది ఆసక్తికర ‘థ్రిల్లర్’ అయితే కాలేకపోయింది. కథనంలో ఆశించిన వేగం లేకపోవడం.. డ్రామా తప్ప పెద్దగా థ్రిల్ లేకపోవడంతో ‘యమన్’ ఓ స్థాయికి మించి ఎంటర్టైన్ చేయలేకపోయింది. రాజకీయాల నేపథ్యంలో సినిమాలంటే చాలా వరకు జనరలైజ్ చేసేసి.. ఎగ్జాజరేట్ చేసి పైపైన సినిమాలు లాగించేస్తుంటారు తప్ప వాస్తవిక కోణంలో తీసే సినిమాలు తక్కువ. సామాన్యుడైన హీరోను పొలిటికల్ లీడర్ని చేయాలంటే చాలామంది దర్శకులు ఎలాంటి మార్గం ఎంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతనేమనుకుంటే అది జరిగిపోతుంది. అన్నీ అతడికి కలిసొచ్చేస్తాయి. చూస్తుండగానే ఎమ్మెల్యే.. మంత్రి.. ముఖ్యమంత్రి అయిపోతాడు. అలా కాకుండా ఒక సామాన్యుడు అనేక అడ్డంకుల్ని దాటుకుని.. వ్యూహాత్మకంగా అడుగులేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగి ఎలా మంత్రి స్థాయికి చేరాడో రియలిస్టిగ్గా ‘యమన్’లో చూపించారు. ఇక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోలేదని కాదు కానీ.. సాధ్యమైనంత వరకు వాస్తవికంగా ఉండేలా పాత్రల్ని.. కథను తీర్చిదిద్దాడు దర్శకుడు జీవా శంకర్. ‘యమన్’కు ప్రధాన ఆకర్షణ కథ.. పాత్రలే. ఇందులో ప్రతి పాత్రకూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. కథ ఎక్కడా పక్కదోవ పట్టకుండా ఒక పంథాలో సాగిపోతుంది. హీరోతో పాటుగా ఇందులోని పాత్రలన్నింటినీ బలంగా.. ఆసక్తికరంగా తీర్చిదిద్దుకున్నాడు జీవా శంకర్. హీరో పాత్ర పరిచయం దగ్గర్నుంచే ఆసక్తి రేకెత్తిస్తుంది. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. సినిమాపై ఆసక్తి పెంచుతాయి. ‘బిచ్చగాడు’తో బలమైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ.. ఇందులో దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తూ.. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు. హీరో పాత్ర చిత్రణకు తోడు.. సాంకేతిక హంగులు కూడా చక్కగా కుదరడంతో ‘యమన్’ మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమాలా కనిపిస్తుంది.
విజయ్ ఆంటోనీ మరోసారి ఆకట్టుకున్నాడు. అశోక్ పాత్ర ఇంటెన్సిటీని చూపించిన తీరు మెప్పిస్తుంది. సీరియస్ పాత్రలు చేయడంలో విజయ్ ప్రత్యేకత మరోసారి కనిపిస్తుంది. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక సినిమాలో హీరో తర్వాత అత్యంత కీలకమైన రెండు పాత్రల్లో నటించిన ఇద్దరూ మెప్పించారు. ఒకప్పటి విలన్ త్యాగరాజన్ పాత్ర.. ఆయన నటన సినిమాకు బలంగా నిలిచాయి. మినిస్టర్ పాత్రలో కనిపించిన నటుడు కూడా చక్కగా చేశాడు. అతను కళ్లతోనే హావభావాలు పలికించాడు. హీరోయిన్ మియా జార్జ్ పాత్ర పరిమితం. ఆమె పర్వాలేదు.
విజయ్ ఆంటోనీ నటుడిగానే కాదు.. సంగీత దర్శకుడిగానూ ‘యమన్’కు పెద్ద బలంగా నిలిచారు. కొన్ని మామూలు సన్నివేశాల్ని కూడా నేపథ్య సంగీతంతో అతను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాల్లో.. కీలకమైన సీన్స్ వచ్చినపుడు.. ముఖ్యంగా జైల్లో హీరో తిరగబడే సీన్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. దర్శకుడు జీవా శంకరే ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు కూడా. తన కథకు ఎలాంటి విజువల్స్ అవసరమో బాగా తెలుసు కాబట్టి అందుకు తగ్గట్లే కెమెరా పనితనం చూపించాడతను. కథకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరా కూడా కీలక పాత్ర పోషించింది. రచయితగా.. దర్శకుడిగా కూడా జీవా శంకర్ తన ప్రతిభను చాటుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here