రివ్యూ: ‘వంగవీటి’లో హింస ఎక్కవ

89
5rlboy3vనటీనటులు: సందీప్ కుమార్(శాండీ) – నైనా గంగూలీ – శ్రీతేజ్ – వంశీ చాగంటి – కౌటిల్య తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్ – దిలీప్ వర్మ – సూర్య చౌదరి
రచన: రాధాకృష్ణ – చైతన్య ప్రసాద్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
రేటింగ్: 2.5
జీవిత కథలను తెరకెక్కించడంలో వర్మకు వర్మే సాటి. అతనికి మరెవ్వరూ సాటిరారు. రక్తచరిత్ర తీసినా.. కిల్లింగ్ వీరప్పన్ తీసినా.. అవన్నీ నిజ జీవిత కథలను ప్రతిబింభించాయి. ప్రేక్షకులు కూడా వాటికి బాగానే కనెక్ట్ అయ్యారు. ఇక హిందీలో తీసిన సత్య, సర్కార్ లాంటి మాఫియా నేపథ్యం వున్న సినిమాలైతే.. వర్మ మార్క్ సినిమాలకు నిలువుటద్దంగా నిలిచాయి. తన కెరీర్ మొదట్లో తెలుగులో శివతో ఓ ట్రెండ్ నే క్రియేట్ చేశాడు. ఆ తరువాత క్షణ క్షణం.. అంతం.. అనగనగా ఒక రోజు, మనీ, మనీ మనీ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. అయితే దొంగలముఠా, ఐస్ క్రీంలాంటి సినిమాలను తీసి పరువు కూడా తీసుకున్నాడు అది వేరే విషయం. వర్మ సీరియస్ గా సినిమాలు తీయ్యడు అనే అపవాదును పోగొట్టుకోవడానికి మరోసారి నిజ జీవిత కథ ‘వంగవీటి’ అనే తను పుట్టి పెరిగిన విజయవాడ నేపథ్యం స్టోరీని ఎంచుకున్నాడు. మరి ఈ సినిమా వర్మ గత చిత్రాల్లానే వుందా లేదా అనేది చూద్దాం పదండి
కథ: విజయవాడ బస్టాప్ లో సాధారణ ఆకు రౌడీగా వుండే వంగవీటి రాధా(శాండీ)… కమ్యునిస్టు నాయకుడు.. రౌడీ అయిన చలసాని వెంకటరత్నం గ్యాంగ్ లోచేరి.. తన ప్రాబల్యాన్ని పెంచుకుంటాడు. దాన్ని వెంకటరత్నం జీర్ణించుకోలేకపోతాడు. వంగవీటి రాధాను పిలిచి కొంచెం తగ్గి వుండాలని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వెంకటరత్నాన్ని కాపు కాచి మట్టుబెడతుంది వంగవీటి రాధా అండ్ బ్యాచ్. వెంకటరత్నం మరణం తరువాత వంగవీటి రాధాకు విజయవాడ నగరంలో తిరుగులేకుండా పోతుంది. అయితే… తమ నాయకుణ్ని చంపడం జీర్ణించుకోలేని ఆ పార్టీ పెద్ద నేతలు.. స్కెచ్ వేసి వంగవీటి రాధాను అంతమొదిస్తారు. దాంతో అతని తమ్ముడు వంగవీటి రంగా రాధా స్థానంలోకి వచ్చి… బెజవాడ రౌడీ ఇజానికి నాయకత్వం వహిస్తాడు.  అదే సమయంలో వెంకటరత్నం మనుషులు కొంత మంది కళాశాల కొంత అలజడి సృష్టిస్తూ స్టూడెంట్స్ ని డిస్టర్బ్ చేస్తున్నారని అన్నదమ్ములు దేవినేని గాంధీ(కౌటిల్య), దేవినేని నెహ్రూ(శ్రీతేజ్) వంగవీటి రాధాను ఆశ్రయిస్తారు. దాంతో వెంకటరత్నం మనుషులకు వ్యతిరేకంగా కాలేజీలో తామే ఓ స్టూడెంట్ యూనియన్ పెడితే బాగుంటుందని రాధాకు సలహాలిస్తారు ఆ అన్నదమ్ములిద్దరూ. ఆ యూనియన్ ద్వారా దేవినేని గాంధీ.. దేవినేని నెహ్రూ ఓ వైపు ఎదుగుతూ వస్తుంటారు. దాన్ని వంగవీటి రంగా అండ్ బ్యాచ్ జీర్ణించుకోలేకపోతారు. తమ అండదండలతో స్టూడెంట్స్ పరపతి సంపాధించుకుని.. కార్మికుల యూనిన్ లీడర్లుగా మారిన దేవినేని నెహ్రూ.. గాంధీలకు రంగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో వారు విడిపోయి.. సపరేట్ గా తమ వర్గానికి నాయకత్వం వహిస్తుంటారు. దాన్ని జీర్ణించుకోలకపోయిన వంగవీటి రంగా… ఓ రోజు కాలేజీలోనే పట్టపగలు దేవినేని గాంధీని తన మనుషుల చేత చంపిస్తాడు. ఇది భరించలేకపోయిన దేవినేని గాంధీ చిన్నతమ్ముడు మురళి(చాగంటి వంశీ) రంగా అనుచరులను వరుసబెట్టి హత్యలు చేస్తాడు. అలా దేవినేని మురళి తన మనుషులను ఒక్కక్కరిని మట్టుబెట్టడం చూసి రంగా రగిలిపోతాడు. అదే సమయంలో సిరిస్ రాజు(రంగా చేతిలో చెంపదెబ్బ తిన్న ఇండస్ట్రియలిస్ట్.. కాంగ్రెస్ నాయకుడు) కూడా దేవినేని మురళికి సపోర్ట్ చేస్తాడు. అయితే… రంగా బ్యాచ్ అదను చూసి దేవినేని మురళిని చంపుతుంది. దాంతో దేవినేని నెహ్రూ.. రంగాల మధ్య రసవత్తర పోరు సాగుతుంది. ఈ పోరులో రంగా ఎలా హత్యకావించబడ్డాడనేదే మిగతా కథ.
కథ..కథనం విశ్లేషణ: ఇలాంటి స్టోరీలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. వాటిని తెరకెక్కించే స్టైల్ బాగుంటే… కచ్చితంగా హిట్ అవుతాయి. ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం నాటి విజయవాడ రౌడీయిజం స్టోరీ అంటే.. ఈ కాలం కుర్రాళ్లకు కొంత ఇంట్రెస్ట్ లేకపోయినా… వాటిని టేకింగ్ పరంగా అందరూ మెచ్చేలా తీస్తే తప్పకుండా ఆదరిస్తారు. వర్మ ఇలాంటి విషయాల్లో బాగా ఆరితేరినవాడనే చెప్పాలి. కానీ ఎందుకో వర్మ… వంగవీటిలో అంత చూపించలేకపోయాడనే అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం కూడా ఏదో అతన అసిస్టెంట్లతో తీయించినట్టు కనిపిస్తుంది కానీ… అతని మార్కు ఎక్కడా కనిపించదు. మొదట చలసాని వెంకటరత్నం హత్యతో ప్రారంభమైన హత్య.. ప్రతీకార హత్యలన్నీ ఒళ్లు గగుర్పొడిచే హత్యల్లానే వున్నాయి తప్ప… ఎక్కడా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయలేకపోయాడు. అలానే… వంగవీటి రాధా.. బస్టాండ్ రౌడీ నుంచి చలసాని వెంకటరత్నం పంచన చేరి… అతనికే కంటగింపు కలిగేలా ఎలా ఆధిపత్యం చెలాయించాడనేది ఎక్కడా చూపించలేదు. కేవలం తన వాయిస్ ఓవర్ తోనే అతని ఎదుగుదలను చెప్పేసి… మళ్లీ అతని మర్దర్ కు ప్లాన్ చేసేసి.. చంపేసే సీన్ చూపిస్తాడు. ఇలా ఇందులో ఏ సీనూ ఎలివేట్ కాలేదు. ఒక్క సీన్ బాగుందనేదానికి పెన్ను పెట్టి వెతికినా కనిపించదు.
దేవినేని గాంధీని కళాశాలలో చంపే సీన్… మరీ సిల్లీగా వుంది. ఎక్కడా అంత ఇంటెన్సిటీ కనిపించదు. అలానే దేవినేని మురళిని మట్టుబెట్టే సీన్ కూడా ఏమంతా ఇంట్రెస్టింగ్ గా వుండదు. పోనీ క్లైమాక్స్ లో రంగాను చంపే సీన్ అయినా.. కొంత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుందేమో అనుకుంటే.. అది కూడా నిప్పు మీద నీళ్లు చల్లినట్టు… ఓ సాదా సీదాగా ముగిసిపోతుంది. ఇలా ఏ సన్నివేశంలోనూ వర్మ తన మార్కునుచూపించకపోవడంతో… ఇది బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
 అయితే అందరూ అనుకున్నట్టు.. ఇందులో ఏ వర్గానికి కొమ్ముకాయలేదనిపిస్తుంది. కొంత బ్యాలెన్స్  అయితే చేయగలిగాడు. వంగవీటి రంగాను ఎవరు చంపారనేది మాత్రం చెప్పకనే చెప్పాడు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణ. మర్డర్ సీన్స్ ను డ్రోన్ షాట్స్ తో బాగా చూపించాడు. అలానే నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ వుంటే బాగుండు. నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకత్వం విషయానికొస్తే.. వర్మ మార్క్ సినిమా అయితే కాదు. అతను ఇంతకు ముందు తీసిన.. సాధారణ సినిమాల జాబితాలో ఇది చేరిపోతుంది. ఇందులో నటించిన శాండీ, శ్రీతేజ్, వంశీ, కౌటిల్య, నయనా గంగూలి తమ పాత్రలకు అనుగుణంగా బాగానే చేశారు. నయనా గంగూలి పాత్ర కొంత డ్రమటైజ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇందులో వచ్చే పాటలన్నీ సినిమా ఫ్లోకు స్పీడు బ్రేకర్స్ లాంటివే. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు పర్వాలేదు. ఓవరాల్ గా ఇది వర్మ మార్క్ మూవీ కాదనేది సినిమా చూసిన తరువాత సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here