పురాతన గ్రంథాలను ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచాలి : టిటిడి ఈవో

110

కేంద్రీయ గ్రంథాలయంలో ఉన్న విలువైన పురాతన గ్రంథాలను డిజిటలైజ్‌ చేసి టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఉన్న కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధన కేంద్రాన్ని గురువారం ఉదయం ఈవో పరిశీలించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రంగనాథ రామాయణం, అమరకోశ వ్యాఖ్య, అప్పకవీయం గ్రంథాలు, ఇతర పురాణాలకు సంబంధించిన విలువైన సమాచారం తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైందని, వీటిని పరిష్కరించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అనంతరం గ్రంథాలయంలోని తాళపత్రాలు, దృశ్యశ్రవణ రికార్డింగులు, సిడిలను ఈవో పరిశీలించారు. అదేవిధంగా, గ్యాలరీల వారీగా ఏర్పాటుచేసిన హిందూ మతం, తత్త్వశాస్త్రం, వేదాలు, సంహితాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆగమాలు, వైష్ణవం, శైవం, రామాయణ, మహాభారతం, భాగవతం, శ్రీవేంకటేశ్వరస్వామి మహత్యం, శ్రీకృష్ణుని లీలలు తదితర గ్రంథాలతోపాటు యోగా, ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, జ్యోతిషం, సంగీతం, నృత్యం, మనోవిజ్ఞానశాస్త్రం, భారతీయ కళలు, నిర్మాణశాస్త్రం, సాహిత్యం, భాషాశాస్త్ర గ్రంథాలను పరిశీలించారు. ముందుగా, శ్వేత సంచాలకులు కల్నల్‌ మండ చంద్రశేఖర్‌ కేంద్రీయ గ్రంథాలయ కార్యకలాపాల గురించి ఈవోకు వివరించారు. అదేవిధంగా, శ్వేత భవనంలోని హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ కార్యాలయాలను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here