శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం!

27

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని తెలియచేశారు.  తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారన్నారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచామన్నారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలియచేశారు.  ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవలైన ఆష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసినట్లు, ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, విజివో శ్రీ రవీంధ్రారెడ్డి, పేష్కర్‌ శ్రీ రమేష్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here