సంప్రదాయ విలువలు తెలియజేసే… ‘శుభలేఖ+లు’

97

ప్రస్తుత ఆధునిక యుగంలో సంప్రదాయ విలువలు తెలియజేసే సినిమాలు చాలా తక్కవగానే వస్తున్నాయి. అలాంటి విలువలకు వ్యాల్యూ ఇచ్చి తెరకెక్కిన చిత్రం ‘శుభలేఖ+లు’. కొత్త దర్శకుడు శరత్ నర్వాడే ‘శుభలేఖ+లు’ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరోయిన్లుగా నటించగా.. ప్రియా వడ్లమాని ఓ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో ఏమాత్రం మన సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చి తెరకెక్కించారో చూద్దాం పదండి.

కథ: చందు (సాయి శ్రీనివాస్)కి క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇంట్రస్ట్. ఓ సాంగ్ ను డైరెక్ట్ కూడా చేస్తాడు. కానీ ఇంట్లోవాళ్లకి.. బంధువులకి అతను ఖాళీగా తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. తన సవతి తల్లితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా చందుని పెద్దగా పట్టించుకోరు. ఈ క్రమంలో చందు తన స్టెప్ సిస్టర్ నిత్య (ప్రియా వడ్లమాని) పెళ్లికి ఇంటికి వస్తాడు. అప్పటికే తన మరదలు శిరీష (దీక్ష శర్మ)తో చందు ప్రేమలో ఉంటాడు. ఈ క్రమంలో నిత్య వేరే అతన్ని ప్రేమిస్తోందని… పెద్దలు కుదిర్చిన పెళ్లిని సైతం లేక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడానికి సిద్ధపడుతోందని చందు తెలుసుకుంటాడు. నిత్య అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందని ఆమెను ఆపే ప్రయత్నం చేయడానికి ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? అది వర్కవుట్ అయిందా? చందు, శిరీషల ప్రేమ ఫలించిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: దర్శకుడు ఎంచుకున్న కథ చాలా సింపుల్ గానే వున్నా… దాని చుట్టూ రాసుకున్న కథనం చాలా ఎంటర్టైనింగ్ గా వుంది. అలానే నేటి పాశ్చాత్య యుగంలో యువత ఎలాంటి పోకడలకు పోతున్నారు? తల్లిదండ్రుల పెంపకం ఎలావుండాలి? వారికి సంప్రదాయ విలువలు ఎలా నేర్పించాలనే దానిని ఇందులో చక్కగా చూపించారు. ముఖ్యంగా ఇంట్లోని పిల్లలకు మట్టివాసన గురించి… వారి వేష ధారణ గురించి తెలియజేసే సన్నివేషాలు సందేశాత్మకంగా వున్నాయి. అలానే నిజాయతీతో వుండాలనేదానికి నిదర్శనంగా… తాను చేసిన తప్పును ఏమాత్రం దాచుకోకుండా తనకు కాబోయే వాడితో ప్రియ వడ్లమాని పాత్రతో చెప్పించిన విధానం కూడా బాగుంది. అలానే ఉమ్మడి కుటుంబం విలువను, ఆప్యాయతలను తెలియజేసే సన్నివేషాలు ఇందులో వివాహ మహోత్సవం సందర్భంగా చాలానే చూపించారు. పిల్లల పట్ల పెద్దలు ఎలాంటి ఇగోలు వుండరాదనే విషయాన్ని చెప్పడానికి హీరో పట్ల సవతి తల్లి చూపించే ప్రేమను చాలా సింపుల్ సన్నివేషంతో ఎంతో డెప్త్ గా చూపించారు దర్శకుడు. ఇలా చెబుతూ పోతే.. ఇందులో చాలా విషయాలను నేటి తరానికి పనికొచ్చేలా తెరమీద చూపించారు దర్శకుడు.
నటీనటుల విషయానికొస్తే… ఈ చిత్ర హీరో సాయి శ్రీనివాస్ కి హీరోగా మొదటి సినిమా అయినప్పటికీ అతని లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. తన స్టెప్ మదర్ తనపట్ల దురుసుగా ప్రవర్తించే సందర్భాల్లో గాని, అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో గాని తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ తో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా సాయి శ్రీనివాస్ చాలా చక్కగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన దీక్షా శర్మ కూడా తన నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో దీక్షా శర్మ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన ప్రియా వడ్లమాని పాశ్చాత్య పోకడలున్న అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. హీరోకి పెద్దనాన్నగా నటించిన నటుడు కూడా తన కెరీర్ లోనే గుర్తు పెట్టుకునే పాత్ర చేశారు. ఆయన తిట్టే మాటలు.. విలువల గురించి చెప్పే మాటలన్నీ అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
దర్శకుడు శరత్ నర్వాడే ఎంచుకున్న కథ.. కథనం బాగుంది. రెండు గంటల పాటు ప్రేక్షకుడు హాయిగా సినిమాలో లీనమయ్యేలా సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు. సంగీత దర్శకుడు కె యమ్ రాధాకృష్ణ సమకూర్చున పాటలు బాగున్నాయి. మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలను మంచి విజువల్ గా చిత్రీకరించారు. ఇక మధు ఎడిటింగ్ కూడా బాగుంది. చిత్ర నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. నటీనటుల దగ్గర నుంచి సాంకేతిక నిపుణుల వరకూ ఎక్కడా రాజీ పడకుండా సినిమా రిచ్ గా రావడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
నటీనటులు: సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ, ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, తదితరులు.
సంగీతం: కె యమ్ రాధాకృష్ణ
సినిమాటోగ్రఫర్: మురళీమోహన్ రెడ్డి
ఎడిటర్: మధు
నిర్మాత: సి విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్
దర్శకత్వం: శరత్ నర్వాడే
రేటింగ్: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here