రివ్యూ: ప్రేక్షకుల మదిని గెలిచిన ‘సప్తగిరి LLB’

430


రేటింగ్: 3

హాస్యనటుడు సప్తగిరి… టాలీవుడ్లో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. సప్తగిరి కామెడీ చేశాడంటే.. ఆ సినిమాకు కాసుల పంటే. గతంలో ఇది ప్రూవ్ అయింది కూడా. అలాంటి కామెడీ కింగ్… హీరోగా మారి.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో మన ముందుకొచ్చాడు. హీరోగా నటించిన తొలి సినిమాతోనే మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి ‘సప్తగిరి LLB’తో మన ముందుకొచ్చాడు. హిందీలో ఘన విజయం సాధించిన ‘జాలీ LLB’కి ఇది రీమేక్. సప్తిరి ఎక్స్ ప్రెస్ సినిమాను నిర్మించిన డాక్టర్ రవికిరణ్ ఈ చిత్రానికి కూడా నిర్మాత. చరణ్ లక్కాకుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సప్తగిరి ఎక్స్ ప్రెస్ లాగ కేవలం మాస్ ఆడియన్స్ నే కాకుండా… ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం పదండి.

కథ: ఎల్.ఎల్.బి.చేసి లాయర్ వృత్తిలో స్థిరపడాలనుకునే గ్రామీణ యువకుడు సప్తగిరి. జిల్లా కోర్టులో చిన్న చిన్న కేసులను వాదిస్తూ… గుర్తింపుకోసం పాకులాడే వ్యక్తి. అయితే ఇతనికి తన మరదలు(కశీష్ వోరా)ను పెళ్లి చేసుకోవాలని వుంటుంది. ఇందుకు ఆమె తండ్రి అంగీకరించడు. తాను బాగా గుర్తింపు పొంది.. వృత్తిలో సెటిల్ అయిన తరువాతే తన మరదలిని పెళ్లి చేసకుంటానని శపథం చేసి హైదరాబాద్ నగరానికి బయలుదేరుతాడు. ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలెడతాడు. అతనికి మొదట్లో చిన్నా చితకా కేసులు వచ్చినా.. అవేవీ గుర్తింపు తీసుకురావు. అయితే.. నగరంలో అర్థరాత్రి ఓ ఆరు మంది బిక్షగాళ్లు ఫుట్ పాత్ మీద పడుకుని వుంటే… సిటీలో పేరు మోసిన సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు బాగా తాగేసి వాళ్ల మీద తన టయోటా కారు పోనిస్తాడు. దాంతో వాళ్లు అక్కడికక్కడే చనిపోతారు. ఆ కేసుకు తగిన సాక్ష్యాధారాలు లేక కోర్టులో కొట్టేస్తారు. అయితే మరుసటి రోజు మీడియాలో మాత్రం.. తనగిన సాక్ష్యాధారాలు లేకుండానే కేసును కొట్టేశారని కథనాలు వెలువడుతాయి. దాంతో సప్తగిరి… ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించడంలో పేరు మోసిన లాయర్ అయిన రాజ్ పాల్(సాయికుమార్) తో పోటీపడతాడు. మరి సప్తగిరి సాక్ష్యాధారాలను సంపాధించాడా? అసలు చనిపోయిన ఆరు మంది బిక్షగాళ్లేనా లేక మరెవరైనానా? వారి మరణానికి కారణమైన వ్యక్తికి సప్తగిరి శిక్ష వేయించాడా? చివరకు ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగిందనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: కోర్టు నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. స్టోరీ సింపుల్ గా వున్నా… గ్రిప్పింగ్ గా వుండే.. స్క్రీన్ ప్లే… రియల్ స్టిక్ మాటలతో సినిమాను రెండు గంటల పాటు నడపగలిగితే చాలు… ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. హిందీలో ఇలాంటి తరహా సినిమాలు ఇటీవల చాలా చూశాం. అందులో ఒకటి ‘జాలీ LLB’. దీన్ని ఇప్పుడు కామెడీ కింగ్ సప్తగిరి ప్రధాన పాత్రలో తెలుగులో తెరకెక్కించి గొప్ప సాహసమే చేశారు. ఎంతో ఇంటెన్స్ వున్న ఈ కథను సప్తగిరిని ఎన్నుకోవడం… దానిని పరెఫెక్ట్ గా సప్తగిరితో క్యారీ చేయించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది. సప్తగిరి ఎక్కడా తొట్రుపాటు లేకుండా ప్రీ ఇంటర్వెల్ నుంచి.. క్లైమాక్స్ దాకా ఎంతో పరిణితితో కూడిన నటన కనబరిచి.. సక్సెస్ అయ్యాడు.
మొదటి అరగంట మాస్ కోసం కాస్త కామెడీ పెట్టి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించి… ఆ తరువాత అసలు కథలోకి ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసిన విధానం చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ కి ముందు.. చనిపోయిన వాళ్లు బిక్షగాళ్లు కాదు… విత్తనాలకోసం పట్టణానికి వచ్చిన రైతులు అనే విషయాన్ని రివీల్ చేయగానే… కుర్చీలో వున్న ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఉద్వేగానికి గురవుతారు. ఆ మూడ్ ని క్లైమాక్స్ దాకా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక క్లైమాక్స్ సన్నివేశం అయితే… చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటుంది.
సప్తగరి ఇందులో హీరోయిజంతోపాటు… తన నటన ప్రతిభను కనిబరిచాడు. ముఖ్యంగా కోర్టు సీన్లలో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో డైలాగు డెలివరి బాగుంది. దాంతో సప్తగిరిలో మరో కోణం ప్రేక్షకులకు పరిచయం అయింది. డ్యాన్సులు.. ఫైట్లు కూడా బాగా చేశాడు. ఆ తరువాత సాయికుమార్ పాత్ర చాలా బాగా ఆకట్టుకుంటుంది. హిందీలో బోన్ ఇరానీ చేసిన పాత్రను ఇందులో సాయికుమార్ అవలీలగా చేసేశాడు. ఎంత పొడువాటి డైలాగునైనా.. ఇలా అలవోకగా చెప్పేశాడు. అందుకు తగ్గట్టుగా పరచురి బ్రదర్స్ రాసిన మాటలు బాగా ప్లస్ అయ్యాయి. ఇక జడ్జిపాత్రలో నటించిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా బాగా నటించాడు. జడ్జిపాత్రకు ప్రాణం పోశాడు. ఈ చిత్రంలో ఈ ముగ్గురూ హీరోలే అనిపిస్తుంది. అంత బాగా వున్నాయి వీరి పాత్రలు. ఇక షకలక శంకర్ కామెడీ బాగుంది. గొల్లపూడి మారుతిరావు పాత్ర చిన్నదే అయినా బాగుంది. రైతుల పాత్రలో నటించిన శేఖర్, ఎల్.బి.శ్రీరామ్ తదితరులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు కొత్తవాడైనా చక్కగా డీల్ చేశాడు చరణ్. మొదట్లో కొంత కమర్షియల్ టచ్ కోసం కాస్త తడబడినట్టు అనిపించినా… ప్రీ ఇంటర్వెల్ నుంచి… క్లైమాక్స్ దాకా ఇక్కడా ఆ ఇంటెన్స్ తగ్గకుండా సినిమాను రక్తికట్టించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకు స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ మాటలు కూడా తోడయ్యాయి. ఈ మధ్య కాలంలో పరుచూరి బ్రదర్స్ కలం నుంచి జాలువారిన మంచి సంభాషణలు అని చెప్పొచ్చు. సినిమా కథ బాగుంటే… ఈ స్టార్ రైటర్లలో సత్తా ఇంకా తగ్గలేదని ఈ సంభాషణలు వింటేనే అర్థం అవుతోంది. అలానే సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ కూడా కేవలం పాటలకే కాకుండా… సెకెండాఫ్ లో వచ్చే ఓ మాంటేజ్ సాంగ్, నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. ఇంకాస్త.. మొదటి హాఫ్ లో ట్రిమ్మింగ్ చేస్తే బాగుండు. నిర్మాత ఇందులో హీరో బావగా నటించి మెప్పించాడు. సినిమాకు కావాల్సినంత ఖర్చు చేయడానికి ఈయన వెనుకాడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here