రివ్యూ: రంగు

376

బాల నటుడిగా తెరంగేట్రం చేసిన తనీష్.. ఉషా కిరణ్ మూవీస్ లో ‘నచ్ఛావులే’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ‘రైడ్’ చిత్రంలో నానితో పాటు స్క్రీన్ షేర్ చేసుకుని హిట్ సాధించారు. ఇటీవల మా టీవీలో ప్రసారం అయిన ‘బిగ్ బాస్2’ సీజన్లో పార్టిసిపేట్ చేసి.. విమర్శకుల చేత సైతం ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కిన ‘రంగు’ చిత్రంలో పవన్ కుమార్ అలియాస్ లారా అనే చిట్టీనగర్ కు చెందిన రౌడీషీటర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం విడుదలకు ముందే లారా కుటుంబం నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆ తరువాత వారికి సినిమా చూపించి.. వారి అనుమతితోనే ఈనెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో తనీష్ సరసన ప్రియా సింగ్ లీడ్ రోలో పోషించగా.. పరుచూరి రవి ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటించారు. రాజకీయ నాయకుల పాత్రలో పోసాని, డి.ఎస్.రావు నటించారు. రౌడీ షీటర్స్ పాత్రలో షఫీ, టార్జన్, జబర్దస్థ్ రఘు తదితరులు నటించారు. పరుచూరి వెంకటేశ్వరరావు సాధారణ పోలీసు పాత్రను పోషించారు. ఈ చిత్రానికి రచనా సహకారం పరుచూరి బ్రదర్స్ అందించారు. మరి లారా జీవిత కథ.. మిగతా రౌడీ షీటర్స్ కి ఆదర్శంగా వుండేలా తెరకెక్కిందా లేదా అన్నది చూద్దాం పదండి.

కథ: పవన్ కుమార్ అలియాస్ లారా (తనీష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన క్రమశిక్షణ కలిగిన విద్యార్థి. తండ్రి కనుసన్నల్లో బుద్ధిగా చదువుకుంటూ… ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధిస్తాడు. ఈ క్రమంలో కాలేజీలో సీనియర్స్ చేసే ర్యాగింగ్ వల్ల కొన్ని వివాదాల్లో చిక్కుకుంటాడు. దాంతో కాలేజీలో గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ… చిల్లర చిల్లర గొడవలు పడుతూ వుంటూ ఇంట్లో చివాట్లు కూడా తింటాడు. అలా చిన్న చిన్న గొడవల కారణంగా.. ఓ సారి వీధిలో వున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లారా చేతిలో చనిపోతాడు. దాంతో మర్డర్ కేసులో ఇరుక్కుని బయట పడతాడు. అలా బయటపడిన లారా.. మళ్లీ తన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసే క్రమంలో అతనిపై రౌడీ షీటర్ ముద్ర పడుతుంది. దాంతో లారా పూర్తిగా రౌడీ అవతారం ఎత్తి… సెటిల్ మెంట్లు.. దాదా గరి చేసి ప్రాణాల మీదకే తెచ్చుకుంటాడు. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న లారా.. తను ఎలా ఎదుర్కొన్నాడు? పోలీసుల వల్ల అతనికి జరిగిన లాభం? నష్టం ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

కథ.. కథనం: నిజ జీవిత కథలు ఎప్పుడూ ఆసక్తిగానే వుంటాయి. ముఖ్యంగా వాటికి రౌడీయిజం నేపథ్యం వుంటే ఈ జనరేషన్ కి మరింత ఆసక్తికరంగా వుంటాయి. గతంలో వచ్చిన రక్తచరిత్ర, వంగవీటి చిత్రాలు ఇలాంటివే. ఇప్పుడు తాజాగా బెజవాడ రౌడీయిజం నేపథ్యంలో ‘రంగు’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో లారా అనే రౌడీషీటర్ పాత్రను తనీష్ పోషించి… అతని జీవిత కథను వెండితెరమీద కళ్లకు కట్టినట్టు కనిపించారు. ఓపెనింగ్ షాట్ లోనే లారాని కొంత మంది రౌడీలు వేటకొడవళ్లతో తరమడంతోనే మిగతా సినిమా ఎలావుంటుందనేది ఊహించేయొచ్చు. అయితే… వారి నుంచి తప్పించుకుని ఒక్కసారిగా తన గతంలోకి తొంగిచూసుకున్న లారా జీవితం చూపించి దర్శకుడు రొటీన్ కి భిన్నంగా కథనాన్ని నడిపించారు. మధ్య మద్యలో తన జీవితాన్ని తలచుకుని బాధపడిన భావోద్వేగ సన్నివేషాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. ఒక్కసారి రౌడీయిజంలో చిక్కుకుంటే… ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఎలా జీవించాలో చూపించిన విధానం ప్రతి ఒక్క రౌడీ షీటర్ కి కనువిప్పు కలిగే అంశం. ద్వితీయార్థంలో కూడా లారా జీవితాన్ని విభిన్నమైన స్క్రీన్ ప్లేతో నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కూడా ఉత్కంఠభరితంగా ముగించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఫైనల్ గా ‘రంగు’ పోలీసులకు… ప్రతి ఒక్క రౌడీషీటర్ కు కనువిప్పు కలిగించే కథ.
చాలా కాలం తరువాత తనీష్ ఓ మంచి పాత్రలో నటించారు. గతంలో ‘నక్షత్రం’ సినిమాలో విలన్ పాత్రను పోషించిన కారణంగా తనీష్.. ఇందులో రౌడీ పాత్రను చక్కగా పోషించగలిగాడు. ఎక్కడా తడబాటు లేకుండా వేరియేషన్స్ చూపించారు. కాలేజీ స్టూడెంట్ గా… ఆ తరువాత లారా లాంటి పవర్ ఫుల్ రౌడీ పాత్రలో చక్కగా నటించారు. అతనికి జంటగా నటించిన ప్రియా సింగ్ కూడా తన పరిధి మేరకు భావోద్వేగాలు చక్కగా పండించారు. వీరి తరువాత పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్ర పోషించిన పరుచూరి రవి గురించే. చాలా కాలం తరువాత స్క్రీన్ పై కనిపంచిన పరుచూరి రవి.. తన పాత్రకు బాగా న్యాయం చేశారు. రాజకీయనాయకుని పాత్రలో పోసాని తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ… మెప్పించారు. డి.ఎస్.రావు కూడా తన పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నీ తమ పరిధిమేరకు న్యాయం చేశారు.
దర్శకుడు కార్తికేయ.. బెజవాడ రౌడీయిజం గురించి బాగా రీసెర్చ్ చేసి.. లారా అనే రౌడీ జీవితాన్ని వెండితెరమీద చూపించిన విధానం అందరినీ ఆకట్టుకంటుంది. ఎక్కడా వివాదాలు లేకుండా సినిమాలో బ్యాలెన్సింగ్ గా అతని పాత్రను తీర్చిదిద్దిన విధానం కుటుంబసభ్యులనే కాదు… ప్రేక్షకులను సైతం మెప్పిస్తుంది. సినిమా నిడివి కాస్త లెంగ్త్ అయిన కారణంగా… అక్కడక్కడా స్లో అయినట్టు కనిపిస్తుంది. ఇంకాస్త ట్రిమ్ చేయగలిగితే బాగుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. రౌడీయిజం సినిమా అనే మూడ్ ను క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ ముఖ్య పాత్రను పోషిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here