ఏప్రిల్‌ 6న మా ఎంపీలు రాజీనామా: జగన్‌

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే లోపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే హోదా  ప్రకటించకపోతే  ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. మంగళవారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలోజరిగిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో  చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవిని అన్నారని, ఆ తర్వాత మాటమార్చి హోదా కంటే ప్యాకేజీయే మేలు అంటూ పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా హామీని తాకట్టు పెట్టారని జగన్‌ ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై వైకాపా మాత్రమే ప్రారంభం నుంచి  పోరాడుతోందన్నారు. ఏపీకి హోదా ఒక్కటే సంజీవిని అన్నారు. ఇందుకోసం కార్యాచరణ ప్రకటించారు. మార్చి 1న వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలు కలిసి అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేస్తారని స్పష్టం చేశారు. మార్చి 3న తాను పాదయాత్ర చేస్తున్న స్థలం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలను దిల్లీకి పంపనున్నట్టు జగన్‌ తెలిపారు. మార్చి 5న వారంతా ప్యాకేజీ ‘మాకొద్దు – హోదా మా హక్కు’ అనే డిమాండ్‌తో దిల్లీలో ధర్నా చేస్తారని అన్నారు. మార్చి 5 నుంచి నెల రోజులపాటు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతాయని,  ఎంపీలంతా పార్లమెంట్‌ హాలులో హోదా కోసం పోరాడుతారన్నారు. బడ్జెట్‌ సమావేశాల పూర్తయ్యేలోపు హోదా ప్రకటించకుంటే చివరి రోజు ఏప్రిల్‌ 6న వైకాపా ఎంపీలు రాజీనామా చేసి బయటకు వస్తారని జగన్‌ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *