రొయ్యల సాగుకు అనుమ‌తుల అడ్డంకుల‌ను ప‌రిష్క‌రిస్తాం:మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి

తూర్పుగోదావరి జిల్లాలో రొయ్యల చెరువుల అనుమతుల విషయంలో ప్ర‌భుత్వ ప‌రంగా ఏవైనా అడ్డంకులు ఉంటే పరిశీలించి, నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామ‌ని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య, సహకార శాఖల మంత్రి ఆదినారాయణరెడ్డి తూ.గో జిల్లా రొయ్యల రైతులకు హామీ ఇచ్చారు. తూ.గో జిల్లా రొయ్యల సాగురైతులు శుక్రవారం వెల‌గ‌పూడిలోని సచివాలయంలో మంత్రిని కలసి తమకు ఎదురవుతున్న సమస్యలపై వినతిపత్రం అందచేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి వారి సమస్యలను పశుసంవర్ధక, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి గొపాలకృష్ణ దివేదితో కలసి సమావేశమై సావధానంగా విన్నారు. నిబంధనలకు లోబడి వ్యవహరించాలని మంత్రి వారికి ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 30 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతున్నా 9వేల ఎకరాల సాగుకే అనుమతులు ఉన్నాయని, మిగిలిన వాటి రెగ్యులరైజేషన్‌కు నిబంధనలకు లోబడి ధరఖాస్తు చేసినా అనుమతులు పెండింగులో ఉన్నాయని రైతులు వివరించారు. కోర్డు కేసులు, ఫిర్యాదులున్నాయంటూ జిల్లా స్థాయి కమిటీ తమ ధరఖాస్తులన్నింటినీ పెండింగులో పెట్టింద‌న్నారు. తనిఖీలు చేసి నిబంధనలు అతిక్రమించినవారిని పక్కన పెట్టి నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో సమస్య లేదని ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే సమస్య ఉందని మంత్రికి వివరించారు. ఈ అంశమై జిల్లా కలెక్టరుతో చ‌ర్చించి పరిష్కరిస్తామని రైతుల‌కు మంత్రి హామీ ఇచ్చారు. రొయ్యల సాగు రైతులకు సబ్సిడీకి పరిమితులు విధించడం వల్ల ఎవరూ వినియోగించుకోలేకపోతున్నారని రైతులు మంత్రికి వివవరించారు. పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయలు సబ్సిడీగా ఇస్తూ రొయ్యల సాగు రైతుల‌కు మాత్రం పరిమితి విధించడం సరికాదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీద మస్తాన్‌రావు, అఖిలభారత రొయ్యల సాగు రైతు సమాఖ్య అధ్యక్షుడు రాజు, తూ.గో జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రుద్రరాజు వెంకటరాజు, మత్స్య శాఖ అదనపు కమీషనర్ సీతారామరాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *