ఏపీ స‌చివాల‌యంలో ఉద్యోగుల నిర‌స‌న

విభజన హామీలను త‌క్ష‌ణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతిలో సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం తీరును నిరసిస్తూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భోజన విరామ సమయంలో అమరావతి సచివాలయం ఆవ‌ర‌ణ‌లో అన్ని శాఖ‌ల ఉద్యోగులు ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు. విభజన హామీల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఉద్యోగులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 29 సార్లు దిల్లీ వెళ్లి విజ్ఞాపన చేసినా పట్టించుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఇక సహించేది లేదని ఆక్షేపించారు. విభజన సమయంలో చేపట్టిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమం తరహాలోనే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కేంద్ర బడ్జట్‌లో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలనూ కల్పించలేదని, అత్యధికంగా పన్ను చెల్లింపుదారులైన ఉద్యోగుల విషయంలోనూ కనికరించలేదని పేర్కొన్నారు. ఏపీకి ద‌క్కాల్సిన న్యాయ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. కేంద్రం స్పందించ‌ని ప‌క్షంలో త‌మ ఆందోళ‌నను తీవ్ర‌త‌రం చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *