ఏపీలో కొరియన్ సిటీ ఏర్పాటు చేస్తాం!

ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కొరియన్ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లిన ఆయన తొలిరోజు పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ను రెండో రాజధానిగా చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు తొలుత కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తాము పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికపై కియా ప్రతినిధులు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎంతమేర పెట్టుబడులు పెట్టేది వివరించారు. తాము ఏర్పాటు చేసే సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయో వెల్లడించారు.

దక్షిణ కొరియాలో కియా అనుబంధ సంస్థల ప్రతినిధులందరినీ ఒకేసారి కలుసుకోవడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. అనేక అవరోధాలు, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. భౌగోళికంగా, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్, దక్షిణకొరియా మధ్యనున్న సారూప్యతలను వివరించారు. ప్రపంచంలో భారత్ ఒక్కదానికే రెండంకెల వృద్ధిరేటు సాధించగల సామర్థ్యం ఉందన్నారు. గత మూడేళ్లుగా ఏపీ సుస్థిరంగా రెండంకెల వృద్ధి సాధిస్తోందని తెలిపారు. వచ్చే 15ఏళ్ల పాటు 15శాతం వృద్ధి నమోదు చేయాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *