రివ్యూ: ఒక్క క్షణం

63


రేటింగ్: 3.25
తారాగణం: అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్, దాసరి అరుణ్ కుమార్, జబర్దస్త్ రఘు, ప్రవీణ్, చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: చక్రి చిగురుపాటి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వి.ఐ.ఆనంద్

శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మంచి హిట్టు అందుకొని.. ఇప్పుడు ‘ఒక్క క్షణం’ అంటూ మన ముందుకొచ్చాడు. ‘ఎక్కడికి పోతావు చితన్నవాడ’లాంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వి.ఐ.ఆనంద్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇద్దరూ మంచి విజయాలందుకొని ఊపు మీద వున్న వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: జీవా(అల్లు శిరీష్), జ్యో(సురభి) ఇద్దరూ తొలిచూపులో ప్రేమలో పడతారు.అయితే జ్యో వుంటున్న అపార్టుమెంటులోనే నివాసం వుంటున్న స్వాతి(సీరత్ కపూర్), శ్రీనివాస్(అవసరాల శ్రీనివాస్)లది ప్రేమ వివాహం. వీరి ప్రేమ కూడా సేమ్ జీవా, జ్యో ప్రేమకథలానే ఇనార్బిట్ మాల్ లో ప్రారంభమై వుంటుంది. అలా ప్రారంభమైన వీరి ప్రేమ.. చివరకు పెళ్లి చేసుకుని స్థిరపడేందుకు దారి తీస్తుంది. అలా ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు తరచుగా పోట్లాడుకుంటున్నట్టు జ్యోకి కనిపిస్తుంటారు. ఓరోజు కోపంతో స్వాతి చెంపను చెళ్లుమనిపిస్తాడు శ్రీనివాస్. మరోసారి ఆమె స్పృహ కోల్పోయి వుండ‌గా ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డం జ్యో చూస్తుంది. ఇలా పోట్లాడుకుంటున్న వీరి వ్యవహారం గురించి జీవాకు చెబుతుంది జ్యో. వీరు తరచు పోట్లాడుకోవడానికి గల కారణాలను తెలుసుకోవాలనుకుని..వారి ప్రేమ.. పెళ్లి గురించి శ్రీనివాస్ ని అడుగుతాడు జీవా. వారి పెళ్లి.. ప్రేమ గురించి విన్న తరువాత.. అచ్చం తన ప్రేమ కథలానే వుండటంతో.. ఇలా ఎందుకు జరుగుతోందో అనే విషయాన్ని ఓ ప్రొఫెసర్ ద్వార తెలుసుకుంటాడు జీవా. ఇది ప్యారల్ లైఫ్ అని.. కొన్ని ఉదాహరణలతో సహా సోదాహరణంగా వివరిస్తాడు ప్రొఫెసర్. ఈ విషయం తెలుసుకునేలోపే స్వాతి హత్యచేయబడుతుంది. ఈ హత్యకు కారణం తన భర్త శ్రీనివాసే అని పోలీసులు అరెస్టు చేస్తారు. ఈ సంఘటనతో జీవా, జ్యో హతాశులవుతారు. ఇంచుమించు వారి జీవితంలానే.. వీరి జీవితం కూడా వుండటంతో… జ్యో కూడా తనను జీవా చంపేస్తాడేమో అని భయంతో.. జీవాను దూరం పెడుతుంది. మరి ఇలా దూరం అయిన జీవా.. చివరకు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు? అసలు స్వాతిని భర్త శ్రీనివాసే చంపాడా? లేక వేరే వారెవరైనా చంపారా? ఆమె హత్యకు అసలు కారణం ఏంటి? వీరి ప్యారలల్ లైఫ్ చివరకు ఎలాంటి మలుపు తీసుకుందనేదే మిగతా కథ.

కథ-కథనం విశ్లేషణ: ప్యారలల్ లైఫు కథతో తెలుగులో సినిమాలు రాలేదు. అలాంటి యూనిక్ కాన్సెప్ట్ ను టచ్ చేసి తీసన చిత్రం ‘ఒక్కక్షణం’. సైన్స్ ఫిక్షన్ తో తెరకెక్కిన ఈ చిత్రం… రెండు ప్రేమ జంటల జీవితం ఒకే విధంగా వుండటంతో.. వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి… చివరకు వాటిని ఎలా పరిష్కరించుకున్నారనే కథను.. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు దర్శకుడు వి.ఐ.ఆనంద్. గతంలో ఎలాగైతే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’లాంటి భిన్నమైన కథను ఎంతో రీసెర్స్ చేసి తెరకెక్కించి హిట్టు కొట్టిన వి.ఐ.ఆనంద్.. ఇసారి కూడా భూమి మీద వున్న కోటానుకోట్ల ప్రజల్లో ఇద్దరు జీవితాలు కూడా ఒకే విధంగా వుంటాయనేదాన్ని ఎంతో రీసెర్చ్ చేసి.. చాలా ఇంట్రెస్టింగ్ గా సెల్యులాయిడ్ పై అందమమైన ప్రేమకథతో తెరకెక్కించి మెప్పించాడు. మొదటి అర్థభాగంలో.. రెండు జంటల మధ్య అందమైన లవ్ స్టోరీని తెరకెక్కించి… ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్యారలల్ లైఫ్ లో జరిగే కొన్ని దుస్సంఘటనలను ఎంతో థ్రిల్లింగ్ గా తెరమీద చూపించారు. ఆ తరువాత ద్వితీయార్థంలోనూ అదే టెంపోనూ మెంయింటైన్ చేయడంతో ప్రేక్షకులు ‘ఒక్కక్షణం’ను ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా.. అల్లు శిరీష్ కెరీర్లో ఈ సినిమా ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుంది.
నటీనటులు విషయానికొస్తే… అల్లు శిరీష్ మరోసారి సెటిల్ పర్ ఫార్మెన్స్ ను చూపించి మెప్పించాడు. గతంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు చిత్రంలో ఎలాగైతే తన నటనతో మెప్పించాడో… అలానే ఇందులోనూ చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో శిరీష్ నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. డ్యాన్స్, ఫైట్లతోనూ ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీలోనూ టైమింగ్ చూపించాడు. అలానే తనకు జంటగా నటించిన సురభి కూడా బాగా నటించింది. ప్రేక్షకుల్ని థ్రిల్లింగ్ చేసే.. సెకెండాఫ్ లో ఆమె పాత్రే ప్రధానం కావడంతో… అందుకు తగ్గట్టుగానే సురభి నటనలో మెచ్యురిటీని చూపించింది. ఇక రెండో జంటగా నటించిన అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ కూడా మెప్పించారు. ముఖ్యంగా భయపడే పాత్రలో సీరత్ నటన చాలా బాగుంది. ఇక విలన్ గా నటించిన దాసరి అరుణ్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. తనకు ఇది బెస్ట్ లాంచ్ అనే చెప్పొచ్చు. ఇక మిగతా పాత్రలో నటించిన కాశీ విశ్వనాథ్, చమ్మక్ చంద్ర, ప్రవీణ్, జబర్థస్త్ రఘు, దువ్వాసి మోహన్ తదితరులంతా తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… దర్శకుడు వి.ఐ.ఆనంద్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. తన గత చిత్రాల్లానే ఇది కూడా ప్రేక్షకుల్ని ఎంతో థ్రిల్ కు గురిచేస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకుని.. దానిని ఇంట్రెస్టింగ్ గా మలిచిన తీరు బాగుంది. దీనికి మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్లను చాలా అందంగా తెరపై చూపించాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here