‘దేశం’లో ఖాతాలో తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు

73

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న తెదేపా… తాజాగా జరిగిన మూడు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తన హవాను కొనసాగించింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలను తెదేపా, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని తెదేపా.. ప్రతిపక్ష వైకాపాకు గట్టి షాకే ఇచ్చింది. 40 ఏళ్ల వైఎస్‌ కంచుకోటను తాము బద్దలు కొట్టామంటూ తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
నెల్లూరులో తెదేపా ఘన విజయం…
నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన గంటకే ఫలితాలను కలెక్టర్‌ ప్రకటించారు. ఈ ఫలితాలలో వైకాపా అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై తెదేపా అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 852 ఓట్లుండగా.. ఎన్నికల్లో 851 ఓట్లు పోలయ్యాయి. అందులో 465 ఓట్లు తెదేపాకు, 378 ఓట్లు వైకాపాకు వచ్చినట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. ప్రతి పక్ష వైసీపీ.. తెదేపా అభ్యర్థిపై వాకాటి నారాయణరెడ్డిపై ఎన్ని ఆరోపణలు చేసినా… తన సొంత మీడియా సాక్షిలో ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా… చివరకు తెదేపా అభ్యర్థినే అక్కడి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకున్నారు. దాంతో వైసీపీకి బాగా బలం వున్న జిల్లాగా పేరొందిన నెల్లూరులో ఇప్పుడు వైసీపీకి గడ్డుకాలం మొదలైందే చెప్పొచ్చు.
కర్నూలు ‘స్థానిక’ ఎమ్మెల్సీ తెదేపాదే…
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై తెదేపా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 64 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెదేపాకు 565 ఓట్లు రాగా.. వైకాపాకు 501 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లనివిగా ప్రకటించగా.. ఒకటి నోటా వచ్చింది. భూమా.. శిల్పా వర్గాలు మొదట్లో కారాలు మిరియాలు నూరుకోగా.. చివరకు అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి.. ఇరు వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చారు. దాంతో రెండు వర్గాలూ… శిల్పా విజయానికి శాయశక్తులా కృషి చేశాయని ఈ విజయంతో రుజువైంది.
కడప గడపలో తెదేపా పాగా …
కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. తెదేపా అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్‌ రవి)… వైకాపా అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తకాకముందే ఓటమి నిర్ధారణ కావడంతో వైకాపా శ్రేణులు ఓటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో తెదేపాకు 433 ఓట్లు రాగా.. వైకాపాకు 399 ఓట్లు వచ్చాయి. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను తెదేపా, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. ఓట్ల లెక్కింపులో తొలుత వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగగా.. అనంతరం తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి క్రమంగా ఓట్లను పెంచుకుంటూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. చివరకు బీటెక్‌ రవి 34 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి… మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి వర్గాలు మొదట ఎడమొహం.. పెడమొహంగా వున్నా… అధినేత ఆదేశాల మేరకు ఇన్ ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ జిల్లాలో మకాం వేసి… రెండు వర్గాలు కలిసి పనిచేసేలా సయోధ్య కుదిర్చారు. దాంతో ఇక్కడ తెదేపా అభ్యర్థి విజయం నల్లేరుమీద నడక అయిందని టీడీపీ వర్గాలంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here