పండ్ల పక్వానికి కాల్షియం కార్బైడ్ వాడితే క్రిమినల్ చర్యలు

వివిధ రకాల పండ్లను కృత్రిమ పద్ధతిలో త్వరగా పక్వానికి తెచ్చేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగించే వారిపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఆహార కల్తీ అంశంపై జరిగిన సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ పండ్లను త్వరగా మగ్గబెట్టి మార్కెట్లో అమ్మేందుకు రైతులు, వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి తీరన నష్టాన్ని కలిగిస్తున్నారని ఆ విధంగా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్బైడ్ వినియోగించిన పండ్లను తినడవం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ స్పష్టం చేశారు. అదే సమయంలో పక్వానికి రాకముందే కృత్రిమ పద్ధతుల్లో కాల్షియం కార్బైడ్ వినియోగించిన పండ్లను విక్రయించే వారికి చట్టం గురించి వివరించి వారిలో అవగాహన కలిగించడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించేందుకు రేడియో, టివి,పత్రికలు,సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాద్యమాలు ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. ఆహార కల్తీ నియంత్రణకు ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ ద్వారా కృత్రిమ విధానాల్లో పండ్లను మగ్గించి విక్రయించడాన్ని నిరోధించేందుకు మార్కెట్ యార్డులు ఇతర అవసరమైన ప్రాంతాల్లో టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని సిఎస్ చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ ల్యాబ్ లను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తనిఖీ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఆహార కల్తీ కూడా ఒకటని దీనిని పూర్తిగా నివారించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విపత్తులను ఏవిధంగా ఎదుర్కొంటామో అదే రీతిలో వీటిని కూడా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసి అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ అన్నారు. ముఖ్యంగా కృత్రిమ పద్ధతుల్లో కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాలను వినియోగించి పండ్లను మగ్గబెట్టి విక్రయించడం, ఆహార కల్తీల నివారణకు ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ కృత్రిమ పద్ధతిలో పండ్లను మగ్గబెట్టేందుకు కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాల వినియోగం నివారించేందుకు స్వల్ప, మద్ధ్య, దీర్ఘకాలిక విధానం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. ముందుగా రైతులు,వ్యాపారులకు వీటిపై అవగాహన కలగించడం తదుపరి ఇందుకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ ఎస్.వెంకటేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *