రివ్వ్యూ: డోనరుడు.. నవ్వించెన్!

259

తారాగణం: సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, సుమన్ శెట్టి, నాగచైతన్య(క్యామియో) తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: షనీల్ డియో
కథ – స్క్రీన్ ప్లే: జుహి చతుర్వేది
మాటలు: కిట్టు విస్సాప్రగడ – సాగర్ రాచకొండ
నిర్మాతలు: సుప్రియ – సుధీర్ కుమార్ పూదోట
దర్శకత్వం: మల్లిక్ రామ్
రేటింగ్: 2.75
సుమంత్ వెండితెరకు పరిచయం అయ్యి.. దశాబ్దన్నర కాలం అవుతోంది. అయితే అతని కేరీర్ మాత్రం సినీఫీల్డులో ముందుకు వెళ్లడం లేదు. అతని సినీ కెరీర్లో ఇప్పటి వరకు సత్యం, గోల్కొండ హైస్కూల్ చిత్రాలే చెప్పుకోదగ్గ విజయం సాధించాయి. గౌరి సినిమా యావరేజ్ గా మిగిలింది. అందుకే ఈ మధ్య సినిమాలు తీయడం కూడా మానేశాడు సుమంత్. మొన్న విడుదలైన ఏమో గుర్రం ఎగురావచ్చు.. కూడా చాలా కాలం పెండింగ్ లో వుండి రిలీజ్ అయింది.. పోయింది కూడా. అయితే ఇక నుంచి మంచి సెలెక్టివ్ సబ్జెక్ట్స్ ఎన్నుకొని సినిమాలు నిదానంగా చేస్తూ వెళదామనుకుని.. తాజాగా ‘నరుడా డోనరుడా’ పేరుతో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా హిందీలో విడుదలైన ‘విక్కీడోనర్’ కి రీమేక్. శుక్రవారం విడుదలైంది. ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దామా?
కథ: విక్కీ ఉద్యోగం.. సద్యోగం లేకుండా ఫ్రెండ్స్ తో తిరిగే కుర్రాడు. ఇంట్లో వాళ్లు ఇచ్చిన పాకెట్ మనీతో సినిమాలు.. షికార్లు చేయడం.. పబ్బులకు.. షాపింగ్ లకు వెళ్లడం ఇతని హాబీ. అమ్మ(శ్రీలక్ష్మీ) బ్యూటీ పార్లర్ నడుపుతూ ఇతన్నీ.. తన అత్తను పోషిస్తూ వుంటుంది. అయితే సంతాన సాఫల్య కేంద్రం నడిపే ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఆంజనేయులు(తనికెళ్ల భరణి).. ఆరోగ్య వంతమైన పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించి… పిల్లలు లేని వాళ్లకు సంతానం కలిగేలా ట్రీట్ మెంట్ ఇస్తుంటాడు. అందులో భాగంగా అతనికి ఓ సారి మంచి ఆరోగ్య వంతుడి వీర్యం కోసం.. విక్కీని సంప్రదిస్తే.. అతను ససేమిరా అంటాడు. అయితే ఎలాగో అలాగ అతన్ని బ్రతిమాలి… వీర్యం ఇచ్చేందుకు ఒప్పిస్తాడు. అందుకు ప్రతిఫలంగా పదివేల రూపాయలను విక్కీకి ఇస్తాడు. అంతేకాదు.. రోజూ ఇస్తే.. డబ్బులతో పాటు.. పార్టీల నుంచి గిఫ్ట్ లను కూడా ఇప్పిస్తానని ఆంజనేయులు చెబుతాడు. దాంతో అప్పటి నుంచి విక్కీ.. ఆ ఇన్ ఫర్టిలిటీ సెంటర్ కు స్పెర్మ్ డోనరుగా మారిపోతాడు. అదే సమయంలో విక్కీ.. ఆషిమా రాయ్(పల్లవి సుభాష్) ప్రేమలో పడతాడు. అప్పటికే ఆమెకు పెళ్లయి విడాకులు కూడా అయివుంటుంది. అయినా సరే… పెద్దలను ఒప్పించి ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే.. తను స్పెర్మ్ డోనర్ అనేది మాత్రం ఆమెతో చెప్పడు. చివరకు ఓ రోజు.. ఆవిషయం పోలీసుల ద్వారా ఆమెకు తెలుస్తుంది. ఆ తరువాత ఏమి జరిగిందనేదే మిగతా కథ.
కథ..కథనం విశ్లేషణ: ఇలాంటి బోల్డ్ స్టోరీలను తెలుగు హీరోలు చేయలేదనే చెప్పాలి. అయితే ఇప్పటికే ఓ మెచ్యూర్డ్ కాన్సెప్ట్ ను తీసుకుని హిందీలో తెరకెక్కించిన ‘విక్కీడోనర్’ విజయవంతం కావడంతో.. అదే కాన్సెప్ట్ లో నటిస్తే.. ఏం పర్వాలేదని సుమంత్ కూడా ఈ సినిమాను చేయడానికి ధైర్యం చేసుండొచ్చు. హంగులు.. ఆర్భాటాలకు వెళ్లకుండా ఈ సినిమాను కేవలం కోటి రూపాయాల్లో తెరకెక్కించడం కూడా కాస్ట్ ఫెయిల్యూర్ కాదని చెప్పొచ్చు. ఇక అసలైన సబ్జెట్టులోకి వస్తే… వీర్యం గురించి బహిరంగంగా మాట్లాడలేని నేటి సమాజంలో… అలాంటి దాన్ని డొనేట్ చేసి… సొమ్ము చేసుకోవచ్చనే కాన్సెప్ట్ ను ఫన్నీగా చెప్పడంలో దర్శకుడు మల్లిక్ రామ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సంతానలేమితో బాధపడే వారికి ఇలాంటి కథలు నచ్చుతాయి.. కానీ మిగతావారికి అంత త్వరగా ఎక్కకపోవచ్చు. ఇలాంటి వాటిని తెరకెక్కించేటప్పుడు నిర్మాణ విలువల పరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే క్వాలిటీ పరంగా ప్రేక్షకులు కూడా వెంటనే కనెక్ట్ అవుతారు. ఇందులో లోపించింది అదే. నిర్మాణ విలువలు చాలా పూర్. స్టార్ కాస్ట్ కూడా చెప్పడానికి ఏమీ లేదు. సుమంత్, తనికెళ్ళ భరణి, సుమన్ శెట్టి, శ్రీలక్ష్మీ తప్ప ఇంకెవరూ చెప్పుకోవడానికి లేరు. అలానే హీరోయిన్ కూడా అంతంత మాత్రమే. మొదటి హాఫ్ మొత్తం కామెడీతో నడిపి.. సెకెండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేశాడు.
సుమంత్ చాలా కాలం తరువాత ఓ ఫన్నీ క్యారెక్టర్ పోషించాడు. ఆద్యంతం నవ్వించే క్యారెక్టర్ అతనిది. అలానే తనికెళ్ళ భరణి కూడా. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి పాత్ర.. సుమంత్ తో పాటు చివరి దాకా వుంటుందంటే.. అతని పాత్రకు ఎంత ప్రాధాన్యం వుందో అర్థం అవుతుంది. ఇక మిగతా పాత్రల్లో సుమన్ శెట్టి.. శ్రీలక్ష్మీ పర్వాలేదనిపించారు. దర్శకుడు కొత్తవాడైనా సబ్జెక్ట్ ను బాగానే డీల్ చేశాడు. సెకెండాఫ్ కూడా కొంత కామెడీ వుండి వుంటే.. మరింత బాగుండేది. సంభాషణలు బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. మరికాస్తా.. స్టార్ కాస్ట్.. నిర్మాణ విలువలు పెంచి వుంటే… ఈ డోనరుడు అందరిచేత మెప్పించబడేవాడే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here