హారర్ కాన్సెప్ట్ అటు క్లాస్… ఇటు మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ఉపయోగపడుతుంది. అందుకే నిర్మాతలు.. దర్శకులు అలాంటి కాన్సెప్టును తెరమీద చూపించడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి జోనర్లు ఇప్పటికే చాలా వచ్చినా… అందులో ఏదో ఓ పాయింట్ ను ఆధారం చేసుకుని రివేంజ్ హారర్ డ్రామాగా తెరకెక్కించడం.. దానివల్ల బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం జరుగుతోంది. తాజాగా పూజా రామచంద్రన్, మౌర్యాని, కమల్ కామరాజు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం కూడా ఇలాంటి రివేంజ్ డ్రామా హారర్ సినిమానే. మరి గత హారర్ చిత్రాల్లాగే ఈ సినిమా కూడా ఏమాత్రం ప్రేక్షకుల్ని అలరించిందో చూద్దాం పదండి.
కథః రాధ(మౌర్యాని), విక్రమ్(కమల్ కామరాజు) ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇద్దరి పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధం అవుతారు. ఇంతలో రాధను ఓ వ్యక్తి(మల్లిడి రవి) ఫాలో అవుతుంటాడు. అలా ఫాలో అవుతున్న వ్యక్తికి రాధ వార్నింగ్ ఇస్తుంది. అయినా అతడు వెంటాడుతూనే వుంటాడు. దాంతో విక్రమ్ చేత వార్నింగ్ ఇప్పిస్తుంది. అయినా అతను వినకుండా… రాధ వుంటున్న అపార్టుమెంటుకు వాచ్ మెన్ గా వస్తాడు. వాచ్ మెన్ గా వుంటూ… రాధను వింతగా చూడటం… ఆమెను లిఫ్టులో తీసుకెళ్లి ఇంట్లో వదలడంలాంటివి చేస్తుంటాడు. అయితే రాధ మాత్రం అతను మిస్ బిహేవ్ చేస్తున్నట్టు కలలు కంటూ వుంటుంది. దాంతో ఓ రోజు.. వాచ్ మెన్ ను చూసి ఇంట్లోకి పరుగులు పెడుతుంది. ఇంతలో వాచ్ మెన్ ఆమె చెయ్యిని పట్టుకుంటాడు. దాంతో అపార్ట్ మెంట్ లో వున్న నలుగురు కుర్రాళ్లు అతన్ని తన్ని తరిమేస్తారు. అందుకు ఆగ్రహించిన వాచ్ మెన్… ఇక నుంచి మీ నలుగురిలో రోజుకో శవం పడుతుందని… మీ ఖర్మ మీరే అనుభవించడండని వెళ్లిపోతాడు. వాచ్ మెన్ అలా వెళ్లగానే ఆ అపార్టుమెంట్లో వున్న నలుగురు కుర్రాళ్లలో ఇద్దరు కుర్రాళ్లు దారుణంగా చనిపోతారు. ఇదంటా వాచ్ మెన్ చెప్పి చేస్తున్నాడని అతన్ని పట్టుకుని విక్రమ్ విచారించగా… ఆ అపార్టుమెంటులో వున్న రహస్యాన్ని పూసగుచ్చినట్టు చెబుతాడు. మిగతా ఇద్దరు కుర్రాళ్లు కూడా చనిపోతారని వాచ్ మెన్ ద్వారా తెలుసుకున్న విక్రమ్ వారిని కాపాడగలిగాడా? అసలు ఆ నలుగు కుర్రాళ్లను వాచ్ మెన్ ఎందుకు అన్నాడు? వారు గతంలో ఏం చేశారు? వారిని అలా చంపడానికి ప్రయత్నిస్తున్నదెవరు? ఇదంతా తెలిసిన వాచ్ మెన్ ఎవరు? మిగతా ఇద్దరు కుర్రాళ్లను విక్రమ్ కాపాడ గలిగాడా? లేదా అన్నదే మిగతా కథ.
కథ.. కథనం విశ్లేషణః LAW(లవ్ అండ్ వార్)… ఇదో రివేంజ్ హారర్ డ్రామా చిత్రం. మొదటి హాఫ్ లో ప్రేమ.. రొమాంటిక్ లవ్ స్టోరీని నడిపిన దర్శకుడు ద్వితీయార్థంలో తను నమ్ముకున్న హారర్ తో ప్రేక్షకుల్ని భయపెట్టడాడు దర్శకుడు. ముఖ్యంగా వాచ్ మెన్ యాంగిల్ లో స్టోరీని నడిపిన కథ.. కథనాలు కొత్తగా అనిపించాయి. గతంలో వచ్చిన హారర్ చిత్రాలు ప్రేమికులను చంపడం… తల్లి బిడ్డలను చంపడం.. వారిలో ఎవరో ఒకరు దెయ్యంగా మారి రివేంజ్ తీర్చుకోవడం చూస్తుంటాం. అయితే ఇందులో కూడా ఇంచుమించు అలాంటి పాయింటే కానీ… ఓ అచేతన అవస్థలో వున్న అమ్మాయి… తన కళ్ల ముందే తండ్రి చంపబడితే… అది తట్టుకోలేక తను కూడా ఆకలి దప్పికలతో చనిపోయి… ఆత్మగా మారి… తమ మరణాలకు కారణమైన నలుగు కుర్రాళ్లను చంపడానికి మరో శరీరం కోసం వెయిట్ చేసి… అందుకు లీడ్ రోల్ లో ఒక క్యారెక్టర్ ను ఎంచుకుని… పగ తీర్చుకోవడం పాయింట్ కొత్తగా వుంది. కచ్చితంగా లా.. మాస్, క్లాస్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది.
అవిటిరాలు పాత్రలో పూజా రామచంద్రన్ బాగా నటించింది. తరువాత దెయ్యం పాత్రలోనూ మెప్పించింది. పూజాకు రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ కథ ఇంప్రెసివ్ గా వుంది. అలానే మౌర్యాని కూడా దెయ్యం ఆవహించిన పాత్రలో రౌద్రం చూపించింది. ఫస్ట్ హాఫ లో హోమ్లీగా… క్యూట్ గా కనిపించిన మౌర్యానీ… సెకెండాఫ్ లో హారర్ ఎపిసోడ్ లో అదరగొట్టేసింది. ఇక మౌర్యాని లవర్ గా నటించిన కమల్ కామరాజు కూడా తన పాత్రకు న్యాయం చేశారు. వాచ్ మెన్ పాత్రలో నటించిన మల్లిడి రవి శివుని భక్తునిగా చక్కగానటించారు. ఫస్ట్ హాఫ్ లో కొంత మొరటుగా కనిపించినా… అసలు విషయం రివీల్ అయినప్పుడు అతని పాత్ర బాగా కనెక్ట్ అవుతంది. ఇక మిగతా పాత్రలన్నీ తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. మాస్ అలరించడానికి రాసుకున్న హారర్ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అవుతుంది. ద్వితీయార్థంలో ఎక్కడా తడబాటులేకండా కథ.. కథనాలను నడిపించాడు. హారర్ ఎలిమెంటును ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అందుకు తగ్గట్టుగా నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త ట్రిమె చేసుంటే బాగుండు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ఖర్చు చేశారు. గో అండ్ వాచ్ ఇట్..!
రేటింగ్ః 3