టీడీపీలోకి వలస కడుతున్న వైసీపీ ముఖ్య నేతలు..!

శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ, ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ బలహీనంగా ఉండడం, ఆ పార్టీ తరఫున పోటీ చేసినా విజయంపై ధీమా లేకపోవడంతో అధికార పార్టీని ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ నేత నర్తు నరేంద్ర, పలాస నియోజకవర్గం నుంచి వంకా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఇప్పటికే వీరిద్దరు మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే శివాజీ, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతుశిరీషతో చర్చించారు. దీంతో వీరి రాకకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 30న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో విజయవాడలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు అనుచరులతో కలసి బస్సుల్లో విజయవాడకు బయలుదేరుతున్నారు.

మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యేలు శివాజీ, అశోక్‌, గౌతు శిరీష 30కి విజయవాడ చేరుకుంటారు. వీరితోపాటు పాతపట్నం నియోజకవర్గానికి చెందిన పాలవలస కరుణాకర్‌ కూడా టీడీపీలో చేరేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. మర్యాద పూర్వకంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన నర్తు నరేంద్ర 2014లో వైసీపీ టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అధినేత జగన్‌ నిరాకరించారు. అప్పటి నుంచి పార్టీలో తటస్థంగా ఉంటున్నారు. పలాస నియోజకవర్గానికి చెందిన వంకా నాగేశ్వరరావు వజ్రపుకొత్తూరు మండలం సీతాపురానికి చెందిన నేత. ఆయన 2009లో పీఆర్పీ తరఫున 2014లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. పాలవలస 2009లో పీఆర్పీ తరఫున 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *