రివ్యూ: మెగా అభిమానులకు పండగే!

54

నటీనటులు: చిరంజీవి – కాజల్ అగర్వాల్ – తరుణ్ అరోరా – ఆలీ -బ్రహ్మానందం – రఘుబాబు – జయప్రకాష్ రెడ్డి -నాజర్ – పోసాని కృష్ణమురళి – రఘు కారుమంచి -పృథ్వీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
రచన: పరుచూరి బ్రదర్స్ – సాయిమాధవ్ బుర్రా – వేమారెడ్డి
కథ: మురుగదాస్
నిర్మాత: రామ్ చరణ్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: వి.వి.వినాయక్
రేటింగ్: 3
చిరు రీ ఎంట్రీ అనగానే మెగా అభిమానులకు హద్దుల్లేవ్. #BossIsBack అనే హ్యాష్ ట్యాగ్ తో మెగా అభిమానులు సోషల్ మీడియాలో నానా రచ్చ చేసేశారు. తన 150వ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’ సినిమాను రీమేక్ చేయడానికి చిరంజీవి సిద్ధమవ్వగానే.. కొంతమంది అయితే పెదవి విరిచారు కానీ… మెగా అభిమనులు మాత్రం ఆనందపడ్డారు. ఎందుకంటే… ఆ సినిమాను తమిళంలో మురగదాస్ డైరెక్ట్ చేశాడు. గతంలో కూడా మురగదాస్ డైరెక్ట్ చేసిన రమణ చిత్రాన్ని తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవే రీమేక్ చేసి విజయం సాధించాడు. సో… అలాంటి మ్యాజిక్కే ఇప్పుడు కూడా రీపీట్ అవుతుందని మెగా అభిమానుల సంబంరం అన్నమాట. ఈ రెండు రీమేక్ లకు దర్శకుడు వి.వి.వినాయక్ కావడం విశేషం. ఇన్ని విశేషాలున్న ‘కత్తి’ రీమేక్ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం మెగాస్టార్ తగ్గ రేంజ్ లో వుందో లేదో చూద్దాం పదండి.

కథ: కత్తి శీను(చిరంజీవి) కోల్ కత్తా కేంద్రకారాగారంలో శిక్ష అనుభవిస్తుంటాడు. ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసి అక్కడ శిక్ష అనుభవిస్తుంటాడు. అయితే ఓ రోజు ఓ కరుడు గట్టిన నేరస్తుడు.. జైలు అధికారులను చంపేసి జైలు నుంచి పారిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి జైలు సిబ్బంది కత్తి శీనును ఉపయోగించుకొంటారు. కత్తి శీను ద్వారా ఆ కరుడుగట్టిన నేరస్తుణ్ని అయితే జైలు సిబ్బంది పట్టుకుంటారు కానీ.. వారి కళ్లు గప్పి కత్తి శీను పారిపోతాడు. అలా పారిపోయిన కత్తి శీనుకు.. ఓసారి తన పోలికలతో వున్న మరో వ్యక్తిపై కొంత మంది దుండగులు కాల్పులు జరుపుతారు. రక్తపు మడుగులో వున్న ఆ వ్యక్తిని కత్తి శీను అతని మిత్రుడు మల్లి(ఆలీ) సహాయంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అయితే.. తన పోలికలతో వున్న ఈ వ్యక్తి వద్ద తనకు సంబంధించిన ఐడీ ప్రూఫ్స్ వదిలేసి వెళ్లిపోవడంతో… కత్తి శీను అతనే అని భావించి.. గాయపడిన వ్యక్తిని కోల్ కత్తా జైలు సిబ్బంది తీసుకెళతారు. అలా కత్తి శీను మరో వ్యక్తి ప్లేసులోకి వచ్చి సమాజంలో ఏం చేశాడు? ఆ గాయపడిన వ్యక్తి ఎవరు? అతనిపై దుండగులు ఎందుకు కాల్పులు జరిపారు? అసలు వారి లక్ష్యం ఏంటి? అనేదే మిగతా కథ

కథ..కథనం విశ్లేషణ: చాలా కాలం తరువాత చిరంజీవిని వెండితెరపై చూడాలని మెగాస్టార్ అభిమనులు ఎంత ఆత్రుతగా చూశారే… తెరమీద చిరంజీవిని చూసిన తరువాత… అంతే ఆనందంతో పొంగిపోతారనడంలో సందేహం లేదు. ఎందుకుంటే.. దర్శకుడు వి.వి.వినాయక్.. చిరంజీవిని అంతబాగా చూపించాడు ఇందులో. ప్రతి ఫ్రేములోనూ చాలా అందంగా చూపించాడు. అరవై ఏళ్లు పైబడినా… ఇప్పటికీ యంగ్ కుర్రాడిలా కనిపించడంలో చిరంజీవి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో తెలిసిపోతుంది. స్టెప్పులు వేయడంలో చిరంజీవి మరోసారి నిరూపించుకున్నాడు. అయితే ఫైట్ సీన్స్ లో మాత్రం మరింత వేగంగా బాడీ మూమెంట్స్ వుండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. చాలా చోట్ల చిరంజీవిలో కొంత వేగం తగ్గిందనే భావన కలుగుతుంది.
దర్శకుడు వి.వి.వినాయక్ చిరంజీవిని చూపించడంలో వున్న శ్రద్ధ..కథ..కథనం నడిపించడంలో చూపించివుంటే.. ఈ సినిమా మరో బిగ్ హిట్ చిత్రాల సరసన నిలిచిపోయేది. తమిళంలో విజయం సాధించిన ‘కత్తి’ సినిమా తమిళనాడు ప్రభుత్వాన్ని బేస్ చేసుకుని తీశారు. రైతుల పంట పొలాలకు నీళ్లు లేకపోయినా… కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల లీటర్ల నీటిని అప్పణంగా ఇచ్చేస్తున్నారని.. పంట భూములను సైతం.. ఫ్యాక్టరీల స్థాపనకు కట్టబెడుతున్నారని తమిళనాడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది ‘కత్తి’ సినిమా. అయితే ‘ఖైదీ నంబర్150’లో మాత్రం హీరో ఎక్కడో వున్న కరువు అనంతపురంలోని గుత్తి మండలం నీరూరు రైతుల గురించి పోరాడుతుంటాడు. ఆ రైతుల బాధను ప్రభుత్వానికి… మీడియాకు తెలియజేయడం కోసం.. హైదరాబాద్ కు మూడు రోజులు నీరు రాకుండా చేస్తాడు. ఇది ఎలా సింక్ అవుతుందో దర్శకుడే ఆలోచించాలి. రెండు రాష్ట్రాలు విడిపోయి రెండున్నరేళ్లయింది. అలాంటిదే వేరే రాష్ట్రంలో వున్న గ్రామ రైతుల గురించి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం.. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నీళ్లు ఆపేస్తే… అక్కడి ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి వస్తుందో అనేది దర్శకుడికే తెలియాలి.
నటీనటుల విషయానికొస్తే… అన్నీ తానై చిరంజీవి నడిపించాడు. ఎంటర్టైనింగ్ లో మెగాస్టార్ కామెడీ మాత్రం మిస్ కాలేదు. కామెడీ బాగుంది. ఆలీతో చేసే కామెడీ బాగుంది. అయితే బ్రహ్మానందం కామెడీ అక్కడక్కడ పర్వలేదనిపించింది. కాజల్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆమె కేవలం పాటలకోసమే అన్నట్టుగా వుంది. ఇందులో ప్రధాన మైనస్.. బలమైన విలన్ లేకపోవడం. అతని పాత్రను మరింత బాగా తీర్చిదిద్దవుండి వుంటే బాగుండేది. మిగతా పాత్రలు పోషించిన పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ రఘు, నాగబాబు, జయప్రకాష్ రెడ్డి పాత్రలు కొంత సేపే అయినా పర్వాలేదు అనిపించాయి.
దర్శకుడు వి.వి.వినాయక్… చిరంజీవిని బాగా చూపించాడు… అతనితో బాగా స్టెప్పులు వేయించడంలో సక్సెస్ అయ్యాడు కానీ… కథను డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా మొదటి హాఫ్.. ఎంటర్టైనింగ్ పేరుతో బోర్ కొట్టించాడు. అలానే ప్రీ ఇంటర్వెల్ ముందు టాప్ గేర్లోకి వెళ్లిన కథ… సెకెండాఫ్లో అదే ఫ్లోలో సీరియస్ గా నడవకుండా… కామెడీ.. పాటలు పెట్టి మళ్లీ స్లో చేయడం కొంత ల్యాగ్ అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడే సీన్ ను మరింత బాగా తీర్చిదిద్ది వుండాల్సింది. క్లైమాక్స్ మరీ సాగతీత అనిపిస్తుంది. కాయిన్ ఫైట్ తమిళ్ ‘కత్తి’ రేంజ్ లో అయితే లేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం మరింత బాగా వుండాల్సింది. రత్న వేలు కెమెరాతనం పర్వాలేదు. ఎడిటింగ్ మరింత గ్రిప్పింగ్ గా వుండివుంటే బాగుండు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు నిర్మాత రామ్ చరణ్. కథ..కథనం నడిపించడంలో దర్శకుడు ఫెయిల్ అయినా…. మెగాస్టార్ ను మెగా అభిమానులు ఏరేంజ్ లో కోరుకుంటారో.. ఆ అంచనాలకు తగ్గట్టుగా చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here