జ్యోతిషం ఎందుకు నవ్వులపాలవుతోంది..?

ఈ మాట నిజమే… నా దృష్టిలో జ్యోతిషం నవ్వులపాలవుతోంది. దీనికి కారణం కొంతమంది జ్యోతిష్కుల అజ్ఞానం. ఒక్క జ్యోతిష్కమే కాదు మన వేదవిజ్ఞానం కూడా అభాసుపాలవుతోంది. నిత్యానంద, రమణానంద లాంటివారి వల్ల హైందవ సంస్కృతికే భంగం వాటిల్లుతోంది. ప్రస్తుతం
జ్యోతిషం విషయానికే వద్దాం. నిన్న డేంజర్ డే అన్నారు… చివరికి ఏమీకాలేదు. దీనిపై  ఒక టీవీ చానల్ వారు వేణుస్వామి అనే ఓ జ్యోతిష్కుడిని చర్చకు పిలిచింది. టీవీ వాళ్లు చర్చకు పిలిస్తే ఫ్రీ పబ్లిసిటీ కదా అని పరుగెత్తేవారే ఎక్కువ. అసలు ఈ ప్రచారాన్ని కోరుకోవడం వల్లే జ్యోతిషం మీద అపప్రద పడుతోంది. ప్రచారం ఎందుకు కోరుకుంటున్నారంటే డబ్బు కోసం. డబ్బు చేరితే ఏ విద్య అయినా భ్రష్ఠు పట్టి తీరాల్సిందే. ఒక టీవీ ఛానల్ కార్యక్రమానికి హేతువాది గోగినేని బాబు వచ్చే సరికి వేణుస్వామికి గుండెల్లో రాయిపడి నట్లయింది. ఎందుకంటే బాబు వాదన పటిమ లాజికల్ గా ఉంటుంది. ఇంతకుముందు చాలా కార్యక్రమాల్లో బాబుదే పైచేయి అయింది. ఈమధ్యనే ఓ ప్రాణిక్ హీలింగ్ చేసే వ్యక్తి కూడా అభాసుపాలయ్యాడు. నిన్నటి చర్చలో యథాప్రకారం గోగినేని బాబు పైచేయి సాధించారు. ఆయనను తట్టకునే శక్తిలేక వేణుస్వామి మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. ఇక్కడ నేను చెప్పొచ్చేదేమిటంటే వేదవిజ్ఞానాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం వల్లనే దీనిపై విమర్శలకు ఆస్కారం కలుగుతోంది. ఇలాంటి విషయాల్లో నేను గోగినేని బాబునే సమర్ధిస్తాను.

ప్రచార పటాటోపం ఎందుకు?
ఒక ప్రొడక్డ్ మార్కెట్ లోకి వెళ్లాలంటే ప్రచారం చాలా అవసరం. అలాగని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం అవసరమా అన్నదే ఇక్కడ ప్రశ్న. వేణుస్వామి లాంటివారు చాలామంది ఇక్కడే తప్పుచేస్తున్నారు. శాస్ర్తాన్ని నమ్ముకోవడం కన్నా అమ్ముకోవడంపైనే ఇప్పుడు దృష్టి ఎక్కువైంది.
పరిహారాల పేరుతో వేలకు వేలు గుంజటం జరగడం లేదా? మీరు చేసే పనికి న్యాయబద్ధంగా ఫీజు తీసుకోండి తప్పుకాదు. ఇదే తప్పు ఎందరో చేస్తున్నారు. ఉదహరణకు మన వైద్యులు కూడా చేస్తున్నది అదే. డాక్టర్ ఫీజు రూ. 500 ఉంటే ఇతర పరీక్షల ఫీజులు రూ.50000 వరకూ ఉంటున్నాయి. ఇది తప్పుకదా. ఇలాంటివారి వల్ల బలవుతున్నది సామాన్య ప్రజలే. వీటిని అడ్డుకునే శక్తులు లేకపోతే సమాజం మరింత భ్రష్టుపట్టిపోతుంది. జ్యోతిషం పేరుతో సాగే అరాచకాలను అడ్డుకునే శక్తిగానే నేను గోగినేని బాబును భావిస్తాను.
జ్యోతిషం శాస్ర్తమా కాదా?
జ్యోతిషం శాస్ర్తమనే నేను నమ్ముతాను. ఇదే అంశంపై ఒకప్పటి ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కిరాల వేదవ్యాస పుస్తకం రాశారు. జ్యోతిషం శాస్ర్తమేనని అనేక ఉదాహరణలను ఆయన అందులో పొందుపరిచారు. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఏ జ్యోతిష్కుడూ నూటికి నూరు శాతం ఫలితం. చెప్పలేడు. అది మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. 60 శాతం ఫలితం చెప్పగలిగాడంటే అదే గొప్ప. నూటికి నూరు శాతం ఫలితం చెప్పగలిగే వాడు ఈ మానవ సమాజంలో ఉండలేడు. అతను ఏ హిమాలయాలలోనూ ఉంటాడు. జ్యోతిషం, వాస్తు, సంఖ్యాశాస్ర్తం… లాంటి వాటి పేరుతో ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం మాత్రం జరుగుతోంది. నీకు తెలిసింది చెప్పు తప్పులేదు… తెలియంది కూడా జ్యోతిషం పేరుతో చెప్పడం వల్లే ఇన్ని తిప్పలు వచ్చిపడుతున్నాయి. జ్యోతిషం శాస్ర్తం కాదు అనేకునే రెండు వారు రెండు విషయాలను గమనించవచ్చు. ఎలాంటి వ్యక్తి అయినా ఏలినాటి శనిలో ఇబ్బందులు పడాల్సిందే. జాతక చక్రంలో చంద్రుడున్న రాశిపై శని సంచారం. జరిగేటప్పుడు ఉద్యోగం మార్పులు రావడం కచ్చితంగా జరుగుతుంది. జాతక చక్రంలో గురువు ఉన్న రాశిపై కుజ, రాహు సంచారం. జరిగేటప్పడు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఫలితం చెప్పడంలో జ్యోతిష్కుడు విఫలమవుతాడేమో గాని శాస్ర్తం మాత్రం విఫలం కాదు. ఫలితం చెప్పడంలో చాలా విషయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందులో ఒకటి వాక్సుద్ది, ఇంకోటి విల్ పవర్. సంకల్పబలంతో ముందుకు వెళ్తుంటే మనకు ఏ జ్యోతిష్కుడి సలహాలు సంప్రదింపులు అవసరం లేదు. వాక్సుద్ది లేని జ్యోతిష్కకు ఎంత చెప్పినా వృధానే. ఇలాంటి ఎన్నో అంశాలతో జ్యోతిషం ముడిపడి ఉండటం వల్లే ఫలితాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల నా అనుభవం ఇది ఈమధ్యనే వాట్సాఫ్ లో నాకు ఓ మెసేజ్ వచ్చింది. అది ఓ జ్యోతిష్కుడికి సంబంధించినది. తన విషయంలో ఆ జ్యోతిష్కుడు ఉన్నది ఉన్నట్లు చెప్పాడని స్లేట్ స్కూల్ యజమాని అమరనాథ్ అమరనాథ్ అందులో పేర్కొన్నారు. ఫేస్ బుక్ లో నేను అమరనాథ్ గారిని సంప్రదించాను. అది తన మెసేజేనని ఆయన అంగీకరించారు. దాంతో కొంతమంది మిత్రులతో నేను ఆ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లాను. అది డబ్బు దోపిడీ గుడారమని నాకు అర్ధమైంది. నా విషయంలో అతను చెప్పిన ఏ విషయమూ జరగలేదు. నాతో వచ్చిన వారి విషయంలోనూ అలాగే జరిగింది. అంటే అతను మోసం చేసే డబ్బు సంపాదిస్తున్నాడన్న మాట. నేను జ్యోతిషాన్ని నమ్ముతున్నాను, అధ్యయనం చేస్తున్నాను. కానీ బోగస్ జ్యోతిష్కులవల్లే శాస్ర్తం అభాసుపాలవుతోంది. అసలు జ్యోతిష్కుల గెటప్పే మోసపూరితంగా ఉంటోంది. మెడలో రుద్రాక్ష మాలలు, ప్రత్యేక వస్ర్త ధారణతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతిషం చెప్పేవారికి ఇవన్నీ అవసరమా? అని కూడా నాకు అనిపిస్తుంది. గెడ్డాలు పెంచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, మాలల ధారణ … ఇవన్నీ జనాన్ని ఆకర్షించడానికే. జ్యోతిషం మాత్రం నిజం… శాస్ర్తపరిజ్ఞానం ఉన్న వారితో దీన్ని చర్చకు పెట్టండి… అంతేగాని వ్యక్తిగత ప్రచారానికి మాత్రం కాదు. దీనికి భిన్నంగా జరగడం వల్లే జ్యోతిషం నవ్వులపాలవుతోంది.

– హేమసుందర్ పామర్తి, జ్యోతిష పరిశోధకుడు (సీనియర్ జర్నలిస్ట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *