Jr ఎన్టీఆర్‌ టిడిపిని బతికిస్తారా..?

81

రాజకీయాలు సినిమా కలిసిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో దేన్ని తీవ్రంగా తీసుకోవాలో ఎవరు దేని వెనుక ఎవరు ఉన్నారో చెప్పడం కష్టంగా వుంది. ద్వితీయ శ్రేణి వారిని అలా వుంచితే ఎమ్జీఆర్‌ ఎన్టీఆర్‌ జయలిత వంటివారి విజయాల తర్వాత చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, కమల్‌హాసన్‌ రకరకాల అనుభవాలు ఇచ్చారు, ఇంకా కొనసాగుతున్నారు. రజనీకాంత్‌ పార్టీ స్థాపించనున్నట్టు చాలా హడావుడి చేసి వెనక్కు వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టుకున్న ఆయన మనవడు జూనియర్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఇతరులు తన పేరిట చేసే హడావిడి ఆగడం లేదు.

టిడిపి వరుసగా పరాజయా పాలైన తర్వాత దాన్ని బతికించగలిగేది జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రమే నని ఒక పల్లవి వినిపిస్తూనేవుంది.విచిత్రంగా ఈ పాట వైసీపీ నేతలు మంత్రులు కూడా ఆలపించుతుంటారు.ఇక టిడిపిలో చంద్రబాబును ఆమోదించినా లోకేశ్‌ నాయకత్వం పట్ల అసంతృప్తిగా వుండేవారు, ఏదో విధంగా ఆ పార్టీని కాపాడుకుని ముందుకు తీసుకుపోవాలని ఆరాటపడేవారు, అందరినీ మించి సినీ అభిమానలు జూనియర్‌ వస్తే పార్టీ బాగవుతుందని ప్రచారం చేస్తుంటారు. ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్‌లో ఏకంగా సిఎం ఎన్టీఆర్‌ అని నినాదాలిస్తే ఆయనే కోప్పడి ఆపాల్సి వచ్చింది.

నిజంగా ఇదొక తాడూ బొంగరం లేని వ్యవహారం. జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా కాలంగా తెలుగు దేశం పార్టీలో క్రియాశీంగా లేరు. అయితే తన తాతగారి పార్టీకి తన మద్దతు ఎప్పుడూ వుంటుందని ఎలాగూ చెబుతుంటారు. అయితే ఒక దశలో తర్వాత తండ్రి హరికృష్ణతో పాటు టీడీపీ అధిష్టానానికి దూరంగా మసిలారు. తాత సమాధి దగ్గరకు కూడా విడిగానే వెళ్లేవారు. హైదరాబాద్ లో నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు లాంఛనంగా హర్షించడం తప్ప ప్రచారానికి రాలేదు. మొత్తంపైన ఆయన టిడిపికి ఎడంగానే వున్న మాట నిజం.

ఇప్పుడు అదంతా మారిపోయి ఒక్కసారిగా వచ్చి చేరి నాయకుడై పోవడం విజయపథంలో నడిపించడం ఎలా సాధ్యం? 2009 ఎన్నికల్లో మొదటిసారి చివరి సారి ఆయన పార్టీ తరపున ప్రచారం చేసిన మాట నిజమే. ఆ సమయంలో మేము ఎన్‌టివి చర్చలో వుండగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చంద్రబాబు జూనియర్‌ ఇద్దరినీ మాట్లాడిదంచడం నాకు గుర్తు. ఏమైనా అప్పుడు విజయం రాలేదు. ఆయన ప్రచారం చేసిన చోట్లనైనా పెద్దగా గెలిచింది లేదు. కనుక తారక రాముడే తారక మంత్రం అనుకోవడానికి ఆస్కారం లేదు. పైగా పార్టీలు రాజకీయాలు విధానాలతో నిమిత్తం లేకుండా కేవలం వ్యక్తులను బట్టి ఆకర్షణలను బట్టి విజయాలు వచ్చి పడటం ఎక్కడా జరగలేదు.

ఇప్పుడు కరోనా అనంతరం సినిమా రంగం నిలదొక్కుకోవడానికి పెనుగులాడుతున్నది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి చిత్రం కోసం జూనియర్ర్‌(రాం చరణ్‌తో కసి) ఎంతో కష్టపడ్డారు. తన సినిమాలు రావలసి వుంది. వయసులో చిన్నవాడైన జూనియర్‌ అప్పుడే సినిమాలు వదలి పూర్తి స్థాయి రాజకీయాలో మునిగే అవకాశమే లేదు. ఇలాంటి సూచన ఆయన చేసిందీ లేదు. లోకేశ్‌ను కాదని చంద్రబాబు ఆయనను నాయకుడిదని చేయడమనే ప్రశ్న వుదయించదు కూడా. ఇన్ని కోణాలు ఉండగా టిడిపిని ఆయనే బాగు చేయగలడు ప్రచారం అది కూడా వైసీపీ నేతలు చేయడం ఎంత హాస్యాస్పదం? దీనిపై జూనియర్‌ గాని చంద్రబాబు గాని ఎలాగూ మాట్లాడరు. ఈ మధ్యనే ఒక వాణిజ్య కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు జూనియర్‌ను దీనిపై అడిఇగితే ఇది అసందర్భం అని జవాబిచ్చారు.

ఈ జవాబులో శ్లేష వుంది. ఏమంటే ఇప్పుడు ఆ చర్చకు సమయం కాదని చెప్పారనుకోవచ్చు.సీఎం నినాదాలు చేసిన వారిపై కూడా అలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడుగా వ్యక్తిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ వయసును మించిన పరిణతి ప్రదర్శిస్తుండవచ్చు గాని రాజకీయాలో రాణించడానికి అధికార సోపానం అధిష్టించడానికి అది మాత్రమే చాలదు. ఆయన ఈ దశలో సినిమాపైనే కేంద్రీకరించ క తప్పదు. ప్రస్తుతం తెలుగుదేశం నాయకత్వాన్ని అంటే తండ్రి కొడుకును బలోపేతం చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం జరగదు. వారు తప్పుకుని తనకు పగ్గాలు అప్పగించడం అసలు జరగదు. ఆయన వచ్చి టిడిపిని బాగు చేయాలని వైసీపీ కోరుకోవడం చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి తప్ప నిజంగా కాదని ఎవరికైనా తెలుస్తుంది. ఇదంతా చూసి అభిమానులు రెచ్చిపోవడం బొత్తిగా అనవసరం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here