రివ్యూ: హలో… క్లీన్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ!

71

రేటింగ్: 3.75
తారాగణం: అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్, రమ్యకృష్ణ, జగపతిబాబు, కృష్ణుడు, అజయ్, సత్య కృష్ణ, పోసాని, ప్రవీణ్, వెన్నెల కిశోర్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: నాగార్జున అక్కినేని
రచన-దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్
అక్కినేని నాగార్జున ఎంతో కేర్ తీసుకుని.. అఖిల్ ని రీలాంచ్ చేసిన సినిమా ‘హలో’. ‘మనం’ సినిమాతో మంచి విజయాన్ని అక్కినేని కుటుంబానికి ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్.. ఇసారి అదే కుటుంబానికి చెందిన అఖిల్ ని డైరెక్ట్ చేసి.. ఓ మంచి హట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. వెండితెరపై విక్రమ్ డైరెక్షన్ శైలే వేరనేది ప్రేక్షకులకు తెలిసిందే. తన గత చిత్రాలు మనం, 24 దీన్ని రుజువు చేశాయి. అతని శైలి మెచ్చే.. నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్ ను రీలాంఛ్ చేయడానికి సంకల్పించాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్లేమీ లేకుండా తన గత చిత్రాలు ఎలాగైతే గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా లాగ ఓ మంచి క్యూట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీలో అఖిల్ ని చూడాలనుకుని.. ఈ సినిమాను నిర్మించారు నాగార్జున. ఈ సినిమా ఈ రోజే పాజిటివ్ బజ్ తో విడుదలైంది. మరి ప్రేక్షకులు ‘హలో’ ఏమాత్రం కనెక్ట్ అయ్యారో చూద్దాం పదండి.

కథ: శీను(అఖిల్) అనాథ. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాయొలిన్ వాయిస్తూ… ఎంతో కొంత సంపాదించుకుని పొట్టనింపుకొంటుంటాడు. ఆ కుర్రాడికి జున్ను(కళ్యాణి ప్రియదర్శన్) పరిచయం అవుతుంది. శీను.. జున్నులిద్దరి స్నేహం ఒకరినొకరు విడిచి వుండలేనంత బలంగా మారుతుంది. ఉద్యోగరిత్యా సడన్ గా జున్ను కుటుంబం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. శీనుని మరిచిపోలేక జున్ను… వంద రూపాయల నోటుపై తన ఫోన్ నెంబర్ రాసి కారులో వెళుతూ… శీను వన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పడేసి పోతుంది. దాన్ని తీసుకుని ఫోన్ నెంబర్ పరిశీలిస్తుండగా… మరో అనాథ బాలుడొచ్చి దాన్ని లాక్కెళ్లిపోతాడు. దాంతో ఫోన్ నెంబర్ మిస్ అవుతుంది. అలా చిన్నప్పుడే విడిపోయిన శీను.. జున్నులిద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతారు. అయితే వీరి స్నేహం మాత్రం చెరిగిపోదు. తనువులు దూమైనా మనసులు మాత్రం కలవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటాయి. మరి వీళ్లిద్దరూ చివరకు ఎలా కలుసుకున్నారు? అనాథగా వున్న శీను.. అవినాష్ గా ఎలా మారాడు? అతన్ని ఎవరు పెంచి పెద్ద చేశారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ప్రేమకథలను మనసుకు హత్తుకునేలా ట్రెండ్ కి తగ్గట్టుగా తెరమీద చూపిస్తే… చాలు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. గతంలో అనేక చిత్రాలు ఇదే ఫార్ములాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అందుకే అక్కినేని నాగార్జున తన కుమారుడు అఖిల్ ని ఓ మంచి లవ్ స్టోరీతో రీలాంఛ్ చేయడానికి ముందుకొచ్చారు. అతని ప్రయత్నం ఫలించింది. తన కుమారుడిని తెరమీద ఎలా చూడాలనుకున్నాడో అదే ‘హలో’ సినిమాలో కనిపిస్తుంది. చైల్డ్ లవ్ స్టోరీ నుంచి… వారు పెరిగిపెద్దవారై.. ప్రియ-అవినాష్ ల మధ్య నడిచే సున్నితమైన భావోద్వేగంతో కూడిన లవ్ స్టోరీ దాకా దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఎక్కడా డీవియేట్ కాకుండా అనుకున్నది అనుకున్నట్టు తెరమీద చూపించి.. సక్సె అయ్యారు. వీరి లవ్ స్టోరీకి తోడు రమ్యకృష్ణ, జగపతిబాబు జంట… వారితో అఖిల్ కున్న సెంటిమెంట్ సీన్లన్ని తెరమీద హృదయానికి హత్తుకొంటాయి. దాంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతారు.
ప్రథమార్థంలో రెండు పసిహృదయాల మధ్య పరిచయం… అది స్నేహంగా మారడం.. ఆ తరువాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ఒకరి నొకరు గౌరవించుకోవడం.. స్నేహానికి గుర్తుగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలాంటి వన్నీ.. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరిగిన తీపి గుర్తులన్నీ సినిమా చూస్తున్నంత సేపు గుర్తొస్తుంటాయి. అలా మన చిన్ననాటి గుర్తులు కూడా తెరమీద కనిపించడంతో వెంటనే కనెక్ట్ అయిపోతాం. అలానే ద్వితీయార్థంలో వచ్చే హీరోయిన్ పరిచయ సన్నివేశాలు.. ఆమెతో నడిచే సెన్సిటివ్ లవ్ ట్రాక్ మొత్తం యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. దానికి తోడు రమ్యకృష్ణ సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కు రప్పిస్తుంది. ఇక క్లైమాక్స్ సన్నివేశం ఉత్కంఠ భరితంగా సాగి.. ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుంది.
తారాగణం విషయానికొస్తే… అఖిల్ అక్కినేని చాలా క్యూట్ గా కనిపించాడు. లవ్ సీన్లలోనూ.. సెంటిమెంట్ సీన్లలోనూ చాలా మెచ్యురిటీగా నటించి మెప్పించాడు. ఇక సందర్భానుసారం వచ్చే యాక్షన్ సీన్లలోనూ మాస్ ను మెప్పించేలా కనిపించాడు అఖిల్. తన బాడీ లాంగ్వేజ్ కూడా మొదటి సినిమాకంటే.. ఈ సినిమాలో మరింత బాగుంది. ఇది అఖిల్ కి పర్ ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. అలానే హీరోయిన్ గా నటించిన దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి కూడా మెప్పిస్తుంది. ఇక రమ్యకృష్ణ, జగపతిబాబు జోడీ తెరపై చక్కగా వుంది. రమ్యకృష్ణ సెంటిమెంట్ సీన్లలో మరోసారి మెప్పించింది. మిగత పాత్రల్లో నటించిన అజయ్, పోసాని, సత్యకృష్ణ, కృష్ణుడు, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులంతా పర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… ఈ సినిమాకు రచన-దర్శకత్వం వహించిన విక్రమ్ కె.కుమార్ ను అభినందించి తీరాల్సిందే. తనకున్న క్రియేటివిటీని ప్రతి ఫ్రేమ్ లోనూ చూపించారు. కూల్ లవ్ స్టోరీని తెరమీద ఎంతహాయిగా చూపించొచ్చో… మరోసారి నిరూపించాడు. చిన్నచిన్న ట్విస్టులతో లవ్ స్టోరీని చివరిదాకా కొనసాగించి.. ఓ ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ తో శుభం కార్డు వేయడం బాగుంది. అందుకు అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం కూడా బాగా ప్లస్ అయింది. పాటలన్నీ బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఫ్రేమ్.. బ్యాక్ గ్రౌండ్ అన్నీ ఒక క్యూట్ లవ్ స్టోరీని నడిపించడానికి ఎలా వుండాలో అలా సెట్ చేసుకుని తెరమీద చూపిండం అంటే మాటలు కాదు. కచ్చితంగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గ్రాండియర్ లుక్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా ఎక్కడా జర్కులు లేకుండా క్లీన్ గా ఎడిట్ చేశారు. పాటలన్నీ సందర్భానుసారం వస్తుంటాయి. దాంతో ఎక్కడా స్టోరీకి ఫైట్లుగానీ.. పాటలు గానీ అడ్డుపడలేదు. ఈ సినిమా అంత రిచ్ గా.. క్లీన్ గా రావడంలో నిర్మాత నాగార్జున చాలా కేర్ తీసుకున్నాడు. అది ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించి.. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ప్రేక్షకులకు అందించారు అక్కినేని నాగార్జున. నాగార్జున కెరీర్లో గీతాంజలి, శివ, నిన్నేపెళ్ళాడతా సినిమాలు ఎలాగో అలానే.. హలో మూవీ కూడా అఖిల్ కెరీర్లో ఓ మంచి సినిమాగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు. గో అండ్ వాచ్ ఇట్!
-వడ్డే మారెన్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here