రివ్యూ: తెలుగు సినిమా మీసం మెలేసిన ‘శాతకర్ణి’

84

తారాగణం: నందమూరి బాలకృష్ణ – శ్రియ శరన్ – హేమమాలిని – కబీర్ బేడి – మిలింద్ గుణాజీ – ఫరా కరిమి – తనికెళ్ల భరణి – శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: చిరంతన్ బట్
ఛాయాగ్రహణం: జ్నానశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: సాయిబాబా జాగర్లమూడి – రాజీవ్ రెడ్డి
రచన – దర్శకత్వం: క్రిష్
రేటింగ్: 3.5
తన వందో సినిమా ఎలావుండాలనేది నందమూరి బాలకృష్ణ ఎలాంటి కలలు కన్నాడో తెలియదు కానీ… క్రిష్ మాత్రం బాలయ్యతో తీస్తే ఇలాంటి సినిమానే తీయాలి… అది ఇద్దరి కెరీర్లో చిరస్థాయిగా మిగిలిపోవాలి అనుకుని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే చిత్రాన్ని తెరమీదకు తెచ్చారు. ఆ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి వీరిద్దరి కెరీర్లో ఈ చిత్రం ఏమాత్రం నిలిచిపోతుందో చూద్దామా?
కథ: బాల్యం నుంచే అఖండ భారతావనిని మొత్తం ఏకం చేయాలి.. పరపాలకులను తరిమికొట్టాలనే సంకల్పం గౌతమిపుత్ర శాతకర్ణి(బాలకృష్ణ)ది. భారతావని మొత్తం ఏకమైతేనే.. ప్రజలు సుభీక్షంగా వుంటారనేది శాతకర్ణి ధ్యేయం. అందుకే రాజ్య విస్తరణే ధ్యేయంగా 29 రాజ్యాలను ఏకం చేసి.. మరో ముగ్గురు రాజులు కళ్యాణదుర్గం… సౌరాష్ట్ర రాజైన సహపాలుడు(కబీర్ బేడి)లను జయించి రాజ్య విస్తరణను దక్షిణాది నుంచి ఉత్తరాదికి విస్తరిస్తాడు. అయితే విదేశీయుల కన్ను మాత్రం భారతదేశాన్ని ఆక్రమించాలనే వుంటుంది. ఇందులో భాగంగానే యవనులు(గ్రీకులు) భారతదేశంపై దండేత్తాలని చూస్తే… వారిని కూడా చిత్తుచిత్తుగా ఓడించి భారతదేశాన్ని పరాయి వాళ్ల కన్ను నుంచి కాపాడుతాడు. అలా చివరగా యవనులైన డెమిట్రియస్ ను ఎలా ఓడించాడు? తెలుగు ఖ్యాతిని ఎలా దశదిశలా వ్యాపించపచేశాడనేదే మిగతా కథ.
కథ.. కథనం విశ్లేషణ: బాలయ్య వందో సినిమా ఎలా వుండాలో అలా తీశాడు శాతకర్ణిని క్రిష్. కచ్చితంగా ఈ సినిమా తెలుగు సినిమా మెలేసేదే. ఈ సినిమా ప్రభావం కచ్చితంగా రాబోయే బాహుబలి.. ది కన్ క్లూజన్ పై ప్రభావం వుంటుందనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. ఈ సినిమా మొదలయ్యింది మొదలు… బాలయ్య బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రాగానే… ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినాయి. అప్పటి నుంచి రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయే గానీ… తగ్గింది మాత్రం లేదు. ట్రైలర్ తోనే ఈ సినిమాలో ఏముంటుందనేది చెప్పకనే చెప్పేశారు. సమయం లేదు మిత్రమా.. రణమా..శరణమా అనే డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. అలాంటి భారీ అంచనాల మధ్య విడుదలైన శాతకర్ణి మేకింగ్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. సినిమా ప్రారంభమే.. కళ్యాణదుర్గం రాజును లొంగదీసుకోవడంతో ప్రారంభం అవుతుంది. ఆ యుద్ద సన్నివేశాలను చాలా రిచ్ గా తెరకెక్కించాడు. సముద్రం మీదుగా వచ్చి… కళ్యాణదుర్గం రాజును గెలిచే యుద్ధంతోనే మునుముందు ఇలాంటివి ఎలావుంటాయో చెప్పకనే చెప్పేశాడు. అలానే ఇంటర్వెల్ ముందు వచ్చే యుద్ధం కూడా చాలా గ్రాండియర్ గా తెరకెక్కించారు. క్లైమాక్స్ అయితే.. ఇక యుద్ధ సన్నివేశాలకు పీక్స్. అయితే ఈ సన్నివేశాలే దాదాపు గంటపాటు వుండటంతో.. కొంత విసుగు అనిపిస్తుంది. అక్కడక్కడ రోమాలు నిక్కబొడుచుకునే మాటలుండటంతో మాస్ కు బాగా ఎక్కుతాయి. తెలుగు శకం ప్రారంభానికి కారకుడైన గౌతమిపుత్రుని కథను బాగా శోధించి.. తెరకెక్కించడంలో క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. గతంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో దీన్ని కంపేర్ చేయడం మాత్రం ఖాయం. ఇంత తక్కువ స్పాన్ లో ఇలాంటి విజువల్ ఫీస్ట్ సినిమాను ఎలా తీశారబ్బా అని ప్రతి ఒక్కరూ అనకమానరు.
బాలయ్య ఒక్కరినే ఈ పాత్రకు ఊహించుకోగలం. ప్రతి సన్నివేశంలోనూ ఎంతో ఆవేశంగా చెప్పిన డైలాగులు నందమూరి అభిమనులను అలరిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్.. ఆ తరువాత వచ్చే సీన్లలో బాలయ్య రౌద్రం మాస్ కు బాగా ఎక్కుతుంది. వాశిష్టిదేవిగా శ్రియశరణ్ కూడా బాగా పెర్ ఫార్మ్ చేసింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమై పోతున్న నేటి తరం హీరోయిన్లకు ఇలాంటి క్యారెక్టర్లు రావడం అరుదే. వచ్చిన అవకాశాన్ని శ్రియ చక్కగా ఉపయోగించుకుంది. గౌతమిబాలగా హేమమాలిన నటన అద్భుతంగా వుంది. రాజ్యాన్ని ఏకం చేయడంలో తల్లి గౌతమిది ఎంత ప్రాధాన్యం వుంటుందే తెలియజెప్పే పాత్రను ఆమె చక్కగా డీల్ చేశారని చెప్పొచ్చు. అలానే మిగతా పాత్రల్లో కబీర్ బేడి, సుభలేఖ సుధాకర్, తనికెళ్ళ భరణి, తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు క్రిష్ అన్నీ తానై.. ఈ చిత్రాన్ని ముందుకు నడిపించాడు. కథను చాలా పక్కాగా రాసుకోవడం.. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే నడిపించడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఎక్కడా కథను పక్కదారి పట్టించకుండా సినిమాను నడిపించాడు. అక్కడక్కడ చరిత్రకు కొంత సినిమాటిక్ ఫ్రీడం తీసుకుని సీన్స్ ను రాసుకున్నా… ఎక్కడా అతిశయోక్తి మాత్రం అనిపించవు. తన కథకు.. పాత్రలకు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు బాగా ప్లస్ అయ్యాయి. అసలు ఈ చిత్రానికి మాటలే ప్రధాన బలం అనిచెప్పొచ్చు. ఇక చిరంతన్ బట్ సంగీతం పర్వాలేదు. అక్కడక్కడ నేపథ్య సంగీతం బాగుంది. జ్నానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిడివి కూడా తక్కవే. 2.15 గంటలు మాత్రమే వుండటంతో.. చాలా క్రిస్ప్ గా ఎడిట్ చేశారనడంలో సందేహంలేదు. సంక్రాంతి పండుగకు వచ్చే బాలయ్య సినిమాలన్నీ ఆల్ మోస్ట్ విజయం సాధించాయి. ఈ చిత్రం కూడా అలానే విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఓ రకంగా ఈ సినిమాతో నందమూరి బాలయ్య మరోసారి ‘సంక్రాంతి హీరో నేనే’ అని హిష్టరి రిపీట్ చేశారని అభిమానులు సంబరపడిపతోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here