టెట్‌ నిర్వహణ లోపాలపై మంత్రి గంటా ఆగ్రహం!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణ కేంద్రాల కేటాయింపుల్లో పొరపాట్లు చోటుచేసుకోవడంపై రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఉద‌యం సంబంధిత అధికారులతో మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఫోన్‌లో మాట్లాడారు. ఏ జిల్లా నుంచి అభ్యర్ధి దరఖాస్తు చేస్తే- ఆ జిల్లా కాకుండా ఒక మూల నుంచి మరో మూలకు విసిరేయడం ఏమిటని గట్టిగా నిలదీశారు. పరీక్ష కేంద్రాలను మార్చుకునేందుకు అంతర్రాష్ట్ర విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించినా రాష్ట్రంలోనే దూర ప్రాంతాలకు వేసిన వారి గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తొలిసారి ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నందున ఏ చిన్నపాటి పొరపాటుకు తావివ్వొద్దని పదేపదే చెబుతున్నా అలసత్వం కనబరుస్తుండడం సరికాదని హెచ్చరించారు.

టెట్‌ నిర్వహణ లోపాలు- ఇతర అంశాలపై గురువారం విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి మార్చి మూడో తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించి ఇబ్బందులు తొలగిపోయాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

హాల్‌టిక్కెట్లలో తప్పిదాలపై అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు వస్తోన్న విషయాన్ని మంత్రి గంటా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఏంటని మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దరఖాస్తులో ఆప్షన్లు పెట్టకపోయినా.. కొందరు విద్యార్థులకు పక్క రాష్ట్రాల్లో, మరికొందరికి రాష్ట్రంలోనే వందల కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలను కేటాయింపు ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *